అనుచిత దోపిడీ | sand robbery in vizianagaram | Sakshi
Sakshi News home page

అనుచిత దోపిడీ

Published Wed, Nov 2 2016 2:47 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

అనుచిత దోపిడీ - Sakshi

అనుచిత దోపిడీ

మహిళా సంఘాలకు ఇసుక అమ్మకం అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ షాడో నేతలు సిద్ధమైపోయారు. మహిళా సంఘాలు డమ్మీలైపోయాయి. నేతలు ఇష్టానుసారం ఇసుక అమ్ముకున్నారు. కోట్లకు కోట్లు సంపాదించారు. ప్రభుత్వ నిర్వాకంపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. నాయకుల తీరుతో సర్కారు డిఫెన్‌‌సలో పడింది. ఇది గతం.
 
 ప్రభుత్వం కొత్త ఇసుకపాలసీని తెచ్చింది. ఇసుక పుణ్యమాని మూటగట్టుకున్న అపప్రధ నుంచి తప్పించుకునేందుకు ఉచితం అంటూ కొత్త నినాదం తీసుకొచ్చింది. ఇళ్లు కట్టుకున్నవారు నిరభ్యంతరంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్నారు. ఇక్కడా నాయకుల జోక్యం పెరిగిపోయింది. నిరభ్యంతరంగా నేతలే తరలించేస్తున్నారు. పేదలకు ఇసుక భారమైంది. పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదీ ప్రస్తుత స్థితి. ఏ నిర్ణయమైనా... అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా మారిపోతోంది. వారు ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలకు మాత్రం ఇసుక భారమైపోతోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఉచితం పేరిట ఇసుక దోపిడీ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద దందా సాగుతోంది. సామాన్య ప్రజలకు ఎవరికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదు. టీడీపీ నేతలకు మాత్రమే ఉచితంగా లభ్యమవుతోంది. చంపావతి నదిని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. వారికి మాత్రమే అనుమతిచ్చినట్టుగా నిర్భయంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతుల్లేని నాతవలస వంతెన, కొప్పెర్ల,  లెంకపేట ఇసుక రేవులను ఏకంగా గుల్ల చేసేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. పక్కనున్న కళ్లాలు, ఖాళీ స్థలాల్లో దర్జాగా పోగులేసి నిల్వ చేస్తున్నారు. సాయంత్రం, రాత్రిపూట యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ట్రాక్టర్ లోడు రూ. 1200ల నుంచి రూ.1500లకు విక్రయించగా, లారీ లోడును రూ. 5వేల నుంచి 7వేల వరకు అమ్ముతున్నారు. ప్రతీ రోజూ అనధికారికంగా రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరికి నియోజకవర్గ కీలక నేతల అండదండలున్నాయి.  
 
 పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోనే...
 పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో ఉన్న ఇసుక రేవులన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఏ రేవు ఏ మండలంలోకి వస్తుందో కూడా అంచనా వేయలేం. అధికారులు సైతం గుర్తించలేని పరిస్థితి నెలకుంది. పూసపాటిరేగ పరిధిలోకి వచ్చే రేవులో తవ్విన ఇసుకను డెంకాడ మండల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిల్వ చేయగా, డెంకాడ పరిధిలో గల రేవులో తవ్వే ఇసుకను పూసపాటిరేగ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తమ పరిధిలోకి రాదని రెవెన్యూ అధికారులు సైతం తప్పించుకుంటున్నారు. మొత్తానికి  అనధికారికంగా పోగులేసిన ఇసుకను సాయంత్రం, రాత్రి సమయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ లోడును రూ. 1200నుంచి రూ. 1500వరకు, లారీ లోడును రూ. 5వేల నుంచి 7వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రతీ రోజూ ఈ మూడు రేవుల నుంచి సరాసరి 300లోడుల ఇసుక అనధికారికంగా తరలివెళ్లిపోతోంది. దీని ద్వారా స్థానిక అధికార పార్టీ నేతలు రోజూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. కీలక నేతలు భారీగా ముడుపులు అందుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా చోద్యం చూస్తోంది.
 
 కిమ్మనని అధికారులు
 నేతల అండదండలతో ఇసుక అక్రమ భాగోతం నడుస్తుండటంతో తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతం లో ఇదే తరహాలో జరిగే ఇసుక దం దాను అడ్డుకున్నందుకు స్థానిక పోలీసు అధికారులు, ఎస్పీపై ఇక్కడి నేతలు నేరుగా మంత్రులకు ఫిర్యాదు చేసి బెదిరింపులకు దిగారు. నాటి నుంచి పోలీసులు సైతం ఇసుక అక్రమ దం దాను అంతగా పట్టించుకోవడం లేదు. ఇదే విషయమై పూసపాటిరేగ, డెంకాడ తహసీల్దార్లు పేడాడ జనార్దనరావు, పెంటయ్య వద్ద ’సాక్షి’ ప్రస్తావించగా అనుమతుల్లేని ఇసుక రేవుల్లో తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, అక్రమంగా పోగులేసినా చర్యలు చేపడుతామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement