మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం మున్సిపాలిటీ : నాలుగేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పత్రి కాముఖంగా విన్నవించారు. స్థానిక సత్యకార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముందుగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరి జవహార్‌లాల్‌కు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో అపార అనుభవం ఉన్న కలెక్టర్ జవహార్ రాబోయే ఎన్నికల కాలంలో సమర్ధవంతమైన పాలన సాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ, ఇసుక మాఫియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గత కలెక్టర్ వివేక్‌యాదవ్ చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమం అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందన్నారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ నాయకులు తిష్టవేసి సామాన్యులకు అన్యాయం చేస్తున్నారన్నారు. చీపురుపుల్లి ఆర్‌ఈసీఎస్‌లో జరిగిన నిధులు గల్లంతులపై 51 సెక్షన్ ప్రకారం సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులతో జిల్లాలో మొక్కజొన్న , బొప్పాయి, జీడిమామిడి పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.
మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు పనికొచ్చే ఒక్క శాశ్వత కార్యక్రమమైనా చేపట్టారా అంటూ నిలదీశారు. జిల్లాకు రావాల్సి న ప్రభుత్వ వైద్య కళాశాలను తిరస్కరించారని, గిరిజన యూనివర్సీటీ ఏర్పాటుకు నిధులు కేటాయించడంలో వైఫల్యం చెందారన్నారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment