hari jawaharlal
-
గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు. -
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
-
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆక్సిజన్ ప్రవాహం తక్కువ కావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో అధికారులు స్పందించి, 15 మంది రోగులను వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే ఇద్దరు చనిపోయారని స్పష్టం చేశారు. ఖాళీ అయిన సిలిండర్లు ఎప్పటికప్పుడు నింపుతున్నామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు అదే విధంగా ఈ ఘటనపై డీప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో 296 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 150మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా -
సినిమాలో నటిస్తోన్న డిప్యూటీ సీఎం
సాక్షి, గుమ్మలక్ష్మీపురం (విజయనగరం): ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి’ సినిమాలో టీచర్ పాత్రలో డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణి, అధికారి పాత్రలో కలెక్టర్ హరిజవహర్‌లాల్ నటించారు. మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో నిర్వహించిన సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎంపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందదాయకమన్నారు. నటుడు రాజాప్రసాద్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని చెప్పారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారుడు వండపండు, జట్టు వ్యవస్థాపకులు డి.పారినాయుడు పాల్గొన్నారు. తోటపల్లిలో సినిమా సందడి గరుగుబిల్లి: ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిస్తున్న అమృతభూమి సినిమాలో అధికారి పాత్రలో కలెక్టర్ డా.హరిజవహర్‌లాల్ నటించారు. మండలంలోని తోటపల్లిలోని ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో పలు సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఏపీ రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో జట్టుటస్టీ డి.పారినాయుడు పర్యవేక్షణలో సినిమా నిర్మాణం జరుగుతోంది. సినీ రచయిత వంగపండు ప్రసాదరావు ప్రకృతి వ్యవసాయం ఇతివృత్తంగా ఈ కథను రచించారు. షూటింగ్లో కలెక్టర్ పాల్గొనడంతో చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సేంద్రియ ఎరువులను వినియోగించి ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రసాద్‌బాబు, టీవీ ఆర్టిస్ట్ దయబాబు, కెమెరామెన్ మురళి, ఆర్ట్ డైరెక్టర్ శివ, సహదర్శకుడు రౌతు వాసుదేవరావుతో పాటు నటీనటులు ప్రసాద్‌బాబు, లక్ష్మి, స్వప్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడంలో జిల్లా ముందంజ
సాక్షి, పూసపాటిరేగ (విజయనగరం): మొక్కలు నాటడంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ హరిజవహర్ తెలిపారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ మరమ్మతులకు గురవడంతో తక్షణమే బాగు చేయించాలని తహసీల్దార్ అప్పలనాయుడును ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 19,011 గృహాలు ఉండగా వాటన్నింటిని తనిఖీ చేసి ఆన్లైన్ చేసినట్లు తెలియజేశారు. వారిలో 5120 మంది గృహాలు అవసరమని గుర్తించారు. వారికి 90 ఎకరాలు అవసరం ఉండగా 17 ఎకరాలు వరకు గుర్తించినట్లు తెలియజేశారు. 13 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. డిప్యూటీ కలెక్టర్ సహకారంతో భూసేకరణ చేస్తామన్నారు. బీసీ వసతి వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.17 లక్షలు మంజూరు అయినట్లు తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మరలా ఎస్టిమేట్ వేసి నిధులు మంజూరు చేస్తాం అన్నారు. విజయనగరంలో 48 లక్షల వరకు మొక్కల నాటినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.ప్రకాశరావు, తహసీల్దార్ జి.అప్పలనాయుడు, సీఎస్‌డీటీ పిట్ట అప్పారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ..అవినీతి పాలనకు చెక్‌పెట్టండి
విజయనగరం మున్సిపాలిటీ : నాలుగేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పత్రి కాముఖంగా విన్నవించారు. స్థానిక సత్యకార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరి జవహార్లాల్కు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో అపార అనుభవం ఉన్న కలెక్టర్ జవహార్ రాబోయే ఎన్నికల కాలంలో సమర్ధవంతమైన పాలన సాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ, ఇసుక మాఫియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గత కలెక్టర్ వివేక్‌యాదవ్ చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమం అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ నాయకులు తిష్టవేసి సామాన్యులకు అన్యాయం చేస్తున్నారన్నారు. చీపురుపుల్లి ఆర్ఈసీఎస్లో జరిగిన నిధులు గల్లంతులపై 51 సెక్షన్ ప్రకారం సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులతో జిల్లాలో మొక్కజొన్న , బొప్పాయి, జీడిమామిడి పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు పనికొచ్చే ఒక్క శాశ్వత కార్యక్రమమైనా చేపట్టారా అంటూ నిలదీశారు. జిల్లాకు రావాల్సి న ప్రభుత్వ వైద్య కళాశాలను తిరస్కరించారని, గిరిజన యూనివర్సీటీ ఏర్పాటుకు నిధులు కేటాయించడంలో వైఫల్యం చెందారన్నారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా అధికారుల పరిస్థితి అయోమయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ట్రవిభజన తర్వాత ఇది ఒకవిధంగా సంధికాలమే. గత ప్రభుత్వంలో చేపట్టిన ఏ పథకమూ ప్రస్తుతం అమలులో లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలేవీ అమలు చేయడం లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త లక్ష్యాలతో నూతన పథకాలకు రూపకల్పన చేసే అవకాశం ఉండడంతో ఆయా ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీనికి తోడు తెలంగాణేతర ప్రాంతానికి చెందిన అధికారులను సైతం ఇక్కడే ఉంచుతారా, లేక ఆంధ్రప్రదేశ్‌కు పంపుతారా అన్న విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో వారూ ఎలాంటి కార్యక్రమాల జోలికి వెళ్లడం లేదు. ‘‘జిల్లాలో దాదాపు నలబైమంది దాకా అధికారులు ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ పెట్టి ఉన్నారు. వారికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కొత్త పాలసీలేవీ ఇంకా రూపొందలేదు. ఇదే పరిస్థితి మరో నెల రోజుల దాకా కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది..’’ అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. వీరే... ఆ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ మొదలుకుని డివిజనల్ స్థాయి అధికారుల వరకు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 33మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారు. ఇంకా, వీరిలో అదనపు జేసీ ఎస్.వెంక ట్రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఆమోస్, జిల్లా కోశాధికారి నాగఫణిరాజు, జిల్లా ప్రణాళిక శాఖ డీడీ మోహన్‌రావు, డీఎస్ఓ నాగేశ్వర్రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎంఎం.వరకుమార్, హౌసింగ్ పీడీ వి.శరత్‌కుమార్, డీపీఆర్వో డి.నాగార్జున, ఐసీడీఎస్ పీడీ వి.ఉమాదేవి, పలు ఇంజినీరింగ్ విభాగంలో పలువురు అధికారులున్నారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు పశుసంవర్థక శాఖలో ఏడీలు 13 మంది ఉన్నారు. వీరంతా, డివిజన్ ప్రధాన కేంద్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారుల్లో అయోమయం ఉంది. ‘ ఇప్పుడంటే ... ఇప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో ఆప్షన్ ఇచ్చాం. ఏ నిర్ణయమూ రాలేదు..’ అని ఓ జిల్లాస్థాయి అధికారి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని కారణాలు కలిసి జిల్లాలో పాలన స్తంభించింది. -
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి ఎంఆర్ఐలు, వీఆర్వోలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేం దుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏ మార్కెట్లోనైనా కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కువగా ఉంటే తడిచిపోకుం డా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. ధాన్యా న్ని మిల్లులకు తరలించే క్రమంలో వాహనాల ఇబ్బంది ఏర్పడితే అద్దెకు తీసుకోవాలన్నారు. వాటి బిల్లులను సంబంధిత ఆర్డీఓలకు పంపించాలని వివరించారు. మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే డీఎస్ఓకు, ఏఎస్‌ఓకు ఫోన్‌చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఎటువంటి సమస్యలున్నా శనివారంలోగా పరిష్కరించుకోవాలన్నారు. 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తేవొద్దు అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావద్దని జేసీ కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కొనుగోళ్లు నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని అధికారులు, ఐకేపీ సిబ్బంది రైతులకు తెలియజేయాలని కోరారు. ఈ సెట్ కాన్ఫరెన్సులో పీడీ డీఆర్డీఏ సుధాకర్, డీఎం సివిల్ సప్లయిస్ వరప్రసాద్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.