
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆక్సిజన్ ప్రవాహం తక్కువ కావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో అధికారులు స్పందించి, 15 మంది రోగులను వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే ఇద్దరు చనిపోయారని స్పష్టం చేశారు. ఖాళీ అయిన సిలిండర్లు ఎప్పటికప్పుడు నింపుతున్నామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు
అదే విధంగా ఈ ఘటనపై డీప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో 296 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 150మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా