ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్‌లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు.
Comments
Please login to add a commentAdd a comment