ఆంధ్రా అధికారుల పరిస్థితి అయోమయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ట్రవిభజన తర్వాత ఇది ఒకవిధంగా సంధికాలమే. గత ప్రభుత్వంలో చేపట్టిన ఏ పథకమూ ప్రస్తుతం అమలులో లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలేవీ అమలు చేయడం లేదు. కొత్త ప్రభుత్వం, కొత్త లక్ష్యాలతో నూతన పథకాలకు రూపకల్పన చేసే అవకాశం ఉండడంతో ఆయా ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీనికి తోడు తెలంగాణేతర ప్రాంతానికి చెందిన అధికారులను సైతం ఇక్కడే ఉంచుతారా, లేక ఆంధ్రప్రదేశ్‌కు పంపుతారా అన్న విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో వారూ ఎలాంటి కార్యక్రమాల జోలికి వెళ్లడం లేదు. ‘‘జిల్లాలో దాదాపు నలబైమంది దాకా అధికారులు ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ పెట్టి ఉన్నారు. వారికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కొత్త పాలసీలేవీ ఇంకా రూపొందలేదు. ఇదే పరిస్థితి మరో నెల రోజుల దాకా కొనసాగే పరిస్థితే కనిపిస్తోంది..’’ అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
వీరే... ఆ అధికారులు
జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ మొదలుకుని డివిజనల్ స్థాయి అధికారుల వరకు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 33మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారున్నారు. ఇంకా, వీరిలో అదనపు జేసీ ఎస్.వెంక ట్రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆమోస్, జిల్లా కోశాధికారి నాగఫణిరాజు, జిల్లా ప్రణాళిక శాఖ డీడీ మోహన్‌రావు, డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎంఎం.వరకుమార్, హౌసింగ్ పీడీ వి.శరత్‌కుమార్, డీపీఆర్వో డి.నాగార్జున, ఐసీడీఎస్ పీడీ వి.ఉమాదేవి, పలు ఇంజినీరింగ్ విభాగంలో పలువురు అధికారులున్నారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు పశుసంవర్థక శాఖలో ఏడీలు 13 మంది ఉన్నారు. వీరంతా, డివిజన్ ప్రధాన కేంద్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారుల్లో అయోమయం ఉంది. ‘ ఇప్పుడంటే ... ఇప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో ఆప్షన్ ఇచ్చాం. ఏ నిర్ణయమూ రాలేదు..’ అని ఓ జిల్లాస్థాయి అధికారి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని కారణాలు కలిసి జిల్లాలో పాలన స్తంభించింది.