రూ. వంద చెల్లించాల్సిందే
► ఒక్కో ట్రాక్టర్ నుంచి బలవంతపు వసూలు
► పోలీసులు, రెవెన్యూ, మైనింగ్
అధికారులకు ఫిర్యాదు చేయనున్న సర్పంచ్
డీ.శిర్లాం: మండలంలోని డీ.శిర్లాం గ్రామ సమీపంలో సువర్ణముఖీ, గోముఖీ నదుల కలయిక వద్దనున్న నదీ పరీవాహకప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది పంచాయతీ ప్రజల నిర్ణయం. అయితే ఈ చర్యను సర్పంచ్ వెలమల వనజాక్షి వర్గం వ్యతిరేకిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. వారం రోజుల కిందట గ్రామస్తులందరూ 11 నెలల కాలానికి ఇసుక వేలంపాట నిర్వహించారు. ఇసుక తీసుకెళ్లే వాహనాల నుంచి కొంత సొమ్ము వసూలు చేసి గ్రామంలోని సంగమేశ్వరాలయం అభివృద్ధికి కేటాయించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే సర్పంచ్ వనజాక్షి, ఆమె భర్త జగన్నాథం మాత్రం ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసిన తర్వాత వేలంపాట నిర్వహిద్దామని సూచించారు. ప్రభుత్వం ఇసుక ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఈ నేపథ్యంలో నగదు వసూలు చేయడం సబబు కాదని చెప్పారు. అయినప్పటికీ గ్రామానికి చెందిన కొంతమంది సర్పంచ్ మాటను పెడచెవిన పెట్టి వేలంపాట నిర్వహించగా, గ్రామానికి చెందిన సిరికి కృష్ణ పాట దక్కించుకున్నాడు.
ట్రాక్టర్‌కు రూ. వంద
గ్రామం మీదుగా ఇసుక తరలించే ఒక్కో ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నిసార్లు వెళితే అన్ని వందలు చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెబుతుంటే డబ్బులు ఎలా వసూలు చేస్తారని కొంతమంది వాహన యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులెవ్వరైనా గ్రామానికి వస్తే ఇసుక దందాపై తననే ప్రశ్నిస్తారని, అందుకే తామే ముందుగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేయనున్నామని సర్పంచ్ వనజాక్షి, జగన్నాథం ఆదివారం విలేకరులకు తెలిపారు.
ఫిర్యాదు చేస్తా..
ట్రాక్టర్ లోడుకు రూ. వంద వసూలు చేస్తున్నారు. అధికారులకు తెలియజేసిన తర్వాత వేలంపాట నిర్వహిద్దామన్నా నా మాట వినలేదు. అందుకే అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. – వెలమల వనజాక్షి, డీ.శిర్లాం సర్పంచ్
డబ్బులు తీసుకుంటున్నారు..
నది నుంచి ఇసుక తీసుకువస్తున్న ఒక్కో ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు వెళితే అన్ని వందలు తీసుకోవడం అన్యాయం. –సత్యనారాయణ, ట్రాక్టర్ యజమాని, జమదాల
ఆలయ అభివృద్ధికే..
గ్రామస్తుల సమక్షంలో ఇసుక తరలింపుపై వేలంపాట చేపట్టాం. 11 నెలల కాలానికి రూ. 50 వేలకు పాట ఖరారైంది. వచ్చిన ఆదాయంతో గ్రామంలోని సంగమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తాం. – సిరికి కృష్ట, వేలంపాటదారుడు.