ఇసుక తిన్నెలో షాడో టీమ్‌లు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గత అనుభవాలు, ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న వాడే నిజమైన నాయకుడవుతాడు. అదే కొరవడితే పరిస్థితులు పునరావృతమవుతాయి. జిల్లాలో ఇప్పుడిదే జరుగుతోంది. కాంగ్రెస్ హాయంలో జిల్లా భ్రష్టుపట్టిపోయిందని, ఒక వైపు మద్యం మాఫియా, మరో వైపు ఇసుక మాఫియా, ఇంకో వైపు రాజ్యాంగేతర శక్తులు రెచ్చిపోయి జిల్లాను నాశనం చేశాయని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు... వాటిని కనీస స్థాయిలో కూడా అదుపుచేయలేకపోతున్నారు. దీంతో జిల్లాలో ఇసుకాసురులు మరింత విచ్చలవిడిగా తమ పని కానిస్తున్నారు.
చీకటి మాటున లోడుల కొద్దీ అక్రమంగా తరలించేస్తున్నారు. చెప్పడానికే మేమున్నాం....చేయడానికి కాదన్నట్టుగా ప్రజాప్రతినిధుల పని తయారైంది. అధికారికంగా ప్రకటించిన 24 రీచ్‌లనుంచే కాకుండా నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఇసుక కనిపించినా వదలడం లేదు. ఇలా అనధికార రీచ్‌లు 40 వరకూ ఉన్నాయి. అయితే ఇసుక దోపిడీని ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. రోజుకొక సమీక్షతో హడావుడి చేసే మంత్రి సైతం కిమ్మనడం లేదు. ఇంతవరకు ఇసుక వ్యవహారంపై సమీక్షించిన దాఖాల్లేవు. అధికారపార్టీ అండదండలున్న నేతలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అనధికార రీచ్‌లలో నిరంతరం, అధికారిక రీచ్‌ల వద్ద రాత్రిపూట దర్జాగా తవ్వకాలు జరిపి, అక్రమ రవాణా చేస్తున్నారు.
షాడో టీమ్‌లు...
తమకు అనుకూలంగా లేని, కచ్చితంగా వ్యవహరిస్తున్న అధికారుల రాకను ముందే పసిగట్టేందుకు ఇప్పుడు ఇసుక రీచ్‌ల వద్ద షాడో టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ టీమ్‌లు ఆ పాయింట్ కొచ్చే దారిలో తమతో సత్సంబంధాలు నెరపని అధికారులు గాని, పోలీసులు గాని ఉన్నారో లేదో పసిగడతారు. వారితో సంప్రదింపులు చేస్తారు. ముడుపులు ముట్టజెప్పి తమ దారికి తెచ్చుకుంటారు. ఒకవేళ దారికి రాకపోతే అధికారులున్న విషయాన్ని తమ సిబ్బందికి ముందుగానే తెలియజేస్తారు. దీంతో వారు అప్రమత్తమవుతారు.
ఇక ఇసుక వాహనాలు రోడ్డెక్కాక బీట్ కానిస్టేబుళ్లు ఎవరైనా అడ్డు పడితే వారికి కూడా నాలుగైదు వందలిచ్చి మేనేజ్ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదన్నప్పుడే కేసులు నమోదు అవుతున్నాయి. ఇంతజరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలైతే కనీసం పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు అందరి కంటే గొప్పగా ఇసుక అక్రమరవాణాదారులే పండగ చేసుకుంటున్నారు. అధికారులు సంక్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోగా, పోలీసులు శాంతిభద్రతలపై దృష్టిసారించారు. ముఖ్యంగా దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇసుక రవాణాపై కనీసం దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో ఇదే అవకాశంగా తీసుకుని ఇసుక అక్రమార్కులు మరింత చెలరేగిపోతున్నారు.