అధికారం అండతో దోచేస్తున్నారు..
ప్రస్తుత పరిస్థితి...
ఇసుక మాఫియా మరింత విశృంఖలంగా తయారైంది. కాసుల కక్కుర్తితో జల వనరులను నాశనం చేస్తున్నారు. అయితే ఇప్పుడా పని చేస్తున్నది తెలుగుతమ్ముళ్లు. నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలోని చంపావతి నదిలో టీడీపీ నేతలు చేస్తున్న ఇసుక దందా అంతాఇంతా కాదు. అధికారం అండతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. నదిని గుల్ల చేసేస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రూ.లక్షలు ఆర్జిస్తున్నారని, అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల ముందు..
‘ఇసుక, మద్యం మాఫియాలు విశృంఖలంగా తయారయ్యాయి. వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. దీనికంతటికీ కాంగ్రెస్ పార్టీ నేతలే కారణం. వారే ఈ దుర్మార్గపు పనులు చేస్తున్నారు.’
- టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోటి నుంచి వినిపించిన విమర్శ.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :చాలా మంది నేతలు ఉన్న ఫలంగా కోట్లు సంపాదించేయాలన్న ఆత్రంతో ఉన్నారు. దొరికిన అవకాశాలన్నీ క్యాష్ చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి వర్కుల వరకు, కాంట్రాక్ట్‌ల దగ్గర నుంచి ఉద్యోగుల బదిలీల వరకు పంచేసుకుని దోచేసుకుంటున్నారని సాక్షాత్తు ఆ పార్టీ కౌన్సిలరే ఇటీవల కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వద్ద ఏకరువు పెట్టారు. టీడీపీ నాయకుల అవినీతి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ కౌన్సిలర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అలా మాట్లాడటం తప్పని అభ్యంతరం వ్యక్తం చేశారే తప్ప...ఏ ఒక్కరూ ఖండించలేదు. దీన్ని బట్టి ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందా ఎంత విశృం ఖలంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఇసుక మాఫియా అవతారమెత్తారు.జిల్లాలో ఇసుక మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపూలేకుండా పోతోంది. రోజూ వేలాది ట్రాక్టర్లు, వందల కొద్దీ లారీలు, ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని చంపావతి నదిలో ఈ వ్యవహరం మరింత ఎక్కు వగా సాగుతోంది.
ఉదయం డంపింగ్- రాత్రి తరలింపు
ఇసుక అక్రమ భాగోతంలో నదీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచ్‌లు, మండల స్థాయిలో హవా సాగించే నాయకులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నిర్వహిస్తున్నారు. పగలైతే అందరిలో దృష్టిలో పడతామని నిశిరాత్రి వేళ యథేచ్ఛగా పనికానిచ్చేస్తున్నారు. పగటిపూట పొక్లెయినర్లతో నదిలో తవ్వకాలు జరి పించి, ఆ ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చి దిబ్బలు వేస్తున్నారు. ఇక్కడి నుంచి రాత్రి పూట వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రతిరోజూ 500 వాహనాలతో తరలింపు
నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం పరిధిలో సుమారు 500 లారీలు, ట్రాక్టర్లతో ప్రతిరోజూ ఇసుకను తరలించేస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వారికొచ్చిన దాంట్లో కొద్దిగా అధికారులకు ముట్టుజెపుతున్నారు. దీంతో అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
దాడుల సమాచారం ముందే లీక్
విశేషమేమిటంటే ఎవరైన ఫిర్యాదుచేస్తేనే సంబంధిత అధికారులు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాకపో తే, తాము దాడులకు వస్తున్న సమాచారాన్ని రవాణాదారులకు ముందే చేరవేస్తుండడంతో అప్రమత్తమైపోయి దొ రక్కండా పక్కననున్న తోటల్లోకి, గ్రామాల్లోకి జారుకుం టున్నారు.కొన్నిసార్లు నామమాత్రంగా దాడులు నిర్వహిం చి ఒకటి రెండు వాహనాలను సీజ్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇటీవల భోగాపురంలో అదే జరిగిందన్న ఆ రోపణలు ఉన్నాయి. దాదాపు 15 వాహనాలు పట్టుబడితే కేవలం మూడు వాహనాలే దొరికినట్టు చూపించారన్న వా దనలు విన్పించాయి. ఈవిధంగా అధికారులే అక్రమార్కులకు వంతపాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకిలా చే స్తున్నారని ఆరాతీస్తే అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే ఎక్కడికో బదిలీచేసేస్తారని, వాళ్లు చెప్పినట్టు నడుచుకుం టే ఏఇబ్బందులూ ఉండవనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది.