money collections
-
‘ఫార్మా’లిటీస్ దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొందరు ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) దందా జోరుగా కొనసాగుతోంది. మందుల దుకాణాల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ దుకాణాలకు వెళ్లారంటే చాలు లోపాలను సరిచేయాల్సింది పోయి, వాటిని అడ్డంపెట్టుకొని అడ్డంగా తినేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదే అదనుగా కొన్ని ఔషధ దుకాణ దారులు కూడా నాసిరకం మందులు, అనుమతిలేని విక్ర యాలు, ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నియంత్రణ గాలికి.. దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. పలు దేశాలకు ఇక్కడి నుంచే మందులు ఎగుమతి అవుతున్నాయి. ముడిసరుకును ఉత్పత్తి చేసే ఔషధ సంస్థలు సైతం రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అటు ఉత్పత్తి, ఇటు విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లే చూడాలి. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఔషధ నియంత్రణ గాల్లో దీపం చందంగా మారింది. దేశంలో 3.16 శాతం, తెలంగాణలో 2.90 శాతం ఔషధాలు నాసిరకమని జాతీయ ఔషధ సర్వే తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మందుల్లో 12.57 శాతం ఔషధాలకు నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు వెల్లడించింది. వేధిస్తున్న అధికారుల కొరత... రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 36 వేల మందుల దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి 100 మందుల దుకాణాలకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంటే రాష్ట్రంలో దాదాపు 360 మంది అవసరం. మరోవైపు రాష్ట్రంలోని 560 ఔషధ ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25 మంది అధికారులు కావాలి. ఇలా మొత్తంగా 385 మంది నియంత్రణాధికారుల అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు 71 మంది మాత్రమే. ఇందులోనూ 18 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే 53 మందే ఉన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల చేతుల్లో ఎక్కువ మందుల దుకాణాలు ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానరాని నిబంధనల అమలు... వాస్తవానికి ఉత్పత్తి సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు చేయాలి. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన లేబరేటరీల్లో వాటిని పరీక్షించాలి. ఫార్మసిస్టులకూ మందులను నిల్వ చేయడంపై శిక్షణ ఇవ్వాలి. అలాగే ఫార్మసిస్టుల సమక్షంలోనే మందులు విక్రయించాలి. కానీ రాష్ట్రంలో 70 శాతం మందుల దుకాణాల్లో ఫార్మసిస్టులు లేరని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. అలాగే డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను అమ్మడానికి వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించాలి. బిల్లుల నిర్వహణ ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచరాదు. ఔషధ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే శాంపిల్ మందులు, ప్రభుత్వాసుపత్రుల్లో సరఫరా చేసే ఔషధాలను అమ్మకూడదు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ల దందా, వారి కొరత కారణంగా చాలా ఔషధ దుకాణాల్లో ఆ నిబంధనలు అమలు కావడంలేదు. బదిలీలు బంద్! ఒక్క హైదరాబాద్ నగరంలోనే 15 వేలకుపైగా మందుల దుకాణాలు ఉండగా ఇక్కడ 20 మందే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వారు జిల్లాలకు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. అలాగే జిల్లాల నుంచి బదిలీపై ఎవరైనా హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవానికి మూడేళ్లకోసారి బదిలీ జరగాల్సి ఉన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏడెనిమిదేళ్లుగా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ నగరంలోనే పాతుకుపోయారు. -
ద్వారకాతిరుమల కొండపై టోల్ మాయాజాలం!
ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్ గేట్ రుసుం కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్ టెండర్ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. అసలు షరతులు ఇవీ.. టెండర్ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో టోల్గేట్ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో టోల్ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా తగ్గిన టోల్ ధరలు టోల్ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ పెంచిన ధరలను తగ్గించి, టెండర్ షరతుల్లోని టోల్ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కుమ్మక్కయ్యారు బహిరంగ వేలం పాట, సీల్ టెండర్ నిర్వహించిన సమయంలో టోల్ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల, -
దందాలు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ
హిమాయత్‌నగర్: ఆయన మధ్య మండలానికి స్పెషాలాఫీసర్. ఆయన పేరు చెప్పినా, ఆయన ఎదురు పడినా ఇటు పోలీసులు, అటు వ్యాపారవేత్తలు హడలెత్తిపోతున్నారు. తాను స్పెషలాఫీసర్ అంటూ ఫోన్ చేస్తే పనవ్వాలి లేకపోతే వారి పనిపడతాడు. ఇలా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సెంట్రల్‌జోన్ పరిధిలో పని చేస్తున్న స్పెషల్‌బ్రాంచ్ ఏఎస్సై. ఆరేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సినిమా టిక్కెట్లు మొదలు అన్ని చోట్లా దందా చేస్తున్నాడు. ఎస్బీ వాళ్లతోనే పెట్టుకుంటారా అంటూ.. సెంట్రల్‌జోన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో గత ఏడాది జనవరిలో జైనుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు బందోబస్తు కావాలంటూ వారు పోలీసులకు ఆర్జీ ఇచ్చారు. అదేరోజు ఎస్బీ ఏఎస్సై ఆ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆర్జీ ఇవ్వాలన్నాడు. ఎస్హెచ్ఓ అనుమతి లేకుండా ఇవ్వడం కుదరదన్న పాపానికి ‘నేను అడిగితే ఇవ్వరా? ఎస్బీ వాళ్లతోనే పెట్టుకుంటారా? వారం రోజుల్లో నేనెం టో చూపిస్తానంటూ పోలీసులను భయభ్రాంతులకు గురి చేశాడు. కొద్దిరోజులకే సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడంటూ ఆ పోలీ సు స్టేషన్‌లోని ఓ ఎస్సైకు మెమో వచ్చింది. నేను చెప్పినా పట్టించుకోరా? ఈ నెల 16వ తేదీన ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢికొన్నాయి. ఈ ఘటనలో రాంగ్రూట్లో వచ్చిన వ్యక్తి వాహనదారుడిపై దాడికి పాల్పడి పిడిగుద్దులు గుద్దాడు. బాధితుడు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ సీసీకెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. నిందితుడి తరుపున ఎస్బీ ఏఎస్సై పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నుంచి మా వాడ్ని తప్పించాలంటూ కోరాడు. తప్పు చేసినట్లు స్పష్టంగా సీసీకెమెరాల్లో కనిపిస్తుంది ఈ విషయంలో మేం ఏమీ చేయలేమని పోలీసులు చెప్పారు. ‘నేను చెప్పినా చేయరా? నాక్కూడా టైం వస్తుదంటూ’ లా అండ్ ఆర్డర్ పోలీసులను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది జరిగిన వారానికి అదే పోలీసు స్టేషన్ నుంచి ఓ పోలీసు అధికారి హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ అయ్యారు. మసాజ్సెంటర్లపై దాడులు చేశారని.. ఇటీవల ఓ పోలీసు స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు మహిళలు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదలివేశారు.తాను వెనుదన్ను నిలస్తున్న మసాజ్ సెంటర్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడులు చేశారనే కోపంతో..పోలీసులు మసాజ్ సెంటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలకు దిగాడు. ఈ ఆరోపణలపై ఓ పోలీసు అధికారి హెడ్ క్వార్టర్స్‌కి అటాచ్ కూడా అయ్యారు. ఆస్పత్రిలోనూ అంతే.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన సమీప బంధువులకు బిల్లు రూ.1.50లక్షలు వేశారు. ‘నేను స్పెషలాఫీసర్‌ని, వాళ్లు నా బంధువులు ఓ రూ.50వేలు తగ్గించంటూ’ ఒత్తిడి తెచ్చి రూ.50వేలు డిస్కౌంట్ చేపించుకున్నాడు. మరో పది నిమిషాల్లో విడుదలబోతున్న సినిమాకు ఐదు టిక్కెట్లు కావాలంటూ ఓ కానిస్టేబుల్ని అడిగాడు. ఇప్పుడు సాధ్యం కాదన్నందుకు..ఆ కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ ఎస్బీ రిపోర్ట్ ఇచ్చాడు. హోటల్ వద్ద చికెన్ బిర్యానీ..స్వీట్స్ షాప్స్ వద్ద స్వీట్ బాక్సులు. తీసికెళ్లగం షరా మామూలైయ్యింది. ఆరేళ్లుగా ఒకే పోస్టింగులో సీసీఎస్ నుంచి సెంట్రల్‌జోన్ స్పెషల్‌బ్రాంచ్‌కు ఆరేళ్ల క్రితం ఆయన బదిలీ అయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్‌జోన్‌లో పలువురు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఈయన మాత్రం ఇక్కడే తిష్టవేసుకుని కూర్చున్నారు. ధర్నాలు, మీటింగ్‌లు, సమావేశాలు వంటి విషయాలు పోలీసులు ఈయనకు ముందుగా చెప్పకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అతను పోలీసు స్టేషన్లోకి అడుగుపెడితేనే హోం గార్డు నుంచి ఎస్హెచ్ఓ వరకు ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. -
పాప పుడితే రూ.1500, బాబు అయితే 2వేలు
చేవెళ్లకు చెందిన ఆదినారాయణ భార్య రజిత నిండుగర్భిణి. ఆమెకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఈ నెల 12న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది. నడవలేని పరిస్థితిలో ఉంది. కాన్పు చేసేందుకు స్టెచర్‌పై లేబర్‌రూమ్‌కు తీసుకెళ్లేందుకు రూ.100, ప్రసవం తర్వాత తిరిగి వార్డుకు చేర్చేందుకు రూ.100, పుట్టిన బిడ్డను శుభ్రం చేసేందుకు రూ.200, బిడ్డను అప్పగించేందుకు రూ.2 వేలు చె ల్లించుకోవాల్సి వచ్చింది. ఇలా ఒక్క రజిత భర్త మాత్రమే కాదు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చినవారి నుంచి కొంతమంది సిబ్బంది రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో :ఇక్కడ ఆడ, మగ బిడ్డల జననంపై ధరలు నిర్ణయిస్తారు. పురిటి బిడ్డను కళ్లారా చూసుకునేందుకు సైతం రేట్లు నిర్ణయించారు. లేదంటే చీత్కారాలు.. చీదరింపులు ఎదుర్కొవాల్సిందే. ‘తమ వద్ద డబ్బుల్లేవ్.. మమ్మల్ని వదిలే యండి’ అంటూ కాళ్లావేళ్లా పడినా కనికరించే వారే ఉండరంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ కిట్‌లో భాగంగా పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ బజార్, పేట్లబురుజు, నిలోఫర్, గాంధీ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య 40 శాతం పెరిగింది. అయితే ఆయా ఆస్పత్రుల్లోని లేబర్రూముల్లో పని చేస్తున్న సిబ్బంది ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రిలో చేరి.. ప్రసవం తర్వాత డిశ్చార్జి అయ్యేంతవరకూ సిబ్బందికి రూ.4 వేలకుపైగా సమర్పించుకోవాల్సి వస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన రోగులను పట్టించుకోకపోవడమే కాకుండా సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. పేట్లబురుజులో వసూళ్ల దందా.. ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 60కిపైగా ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ పుట్టిన బిడ్డను చూసేందుకే కాదు, నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను లేబర్‌వార్డుకు తరలించాలన్నా.. ప్రసవం తర్వాత థియేటర్ నుంచి బాలింతను లేబర్‌రూమ్ నుంచి స్టెచర్‌పై వార్డుకు తరలించేందుకు రూ.100, పుట్టిన శిశువును శుభ్రం చేసినందుకు రూ.100, శిశువును అప్పగించేందుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. బాలింతను పరామర్శించేందుకు వచ్చే బంధువులు ప్రధానగేటు వద్ద రూ.20, ఆ తర్వాత రెండో గేటు వద్ద రూ.20, మూడో గేటు వద్ద రూ.20 చొప్పున చెల్లించుకోవాల్సివస్తోంది. వార్డులను శుభ్రం చేసే శానిటేషన్ సిబ్బందికి రోజుకు రూ.20 చెల్లించాల్సిందే. ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చని భావించి ఆస్పత్రికి వచ్చిన వారిని నిలువునా దోచుకుంటుండటంతో రోగులు, వారివెంట వచ్చిన బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా వార్డుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన ఆర్‌ఎంఓలు, సూపరింటెండెంట్లు తమ గదులు దాటి బయటికి రావడం లేదు. సిబ్బంది వసూలు చేసిన అక్రమ సొమ్ములో ఆర్ఎంఓలకు కూడా వాటాలు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వసూల్ రాజాలకే వంత.. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 25 కాన్పులు జరుగుతాయి. కీలకమైన విభాగాల్లో సైతం రెగ్యులర్ ఉద్యోగులను పక్కనపెట్టి, కాంట్రాక్టు కార్మికులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా కాంట్రాక్టు సిబ్బంది వసూలు చేసిన మొత్తం నుంచి ఆయా విభాగాల ఇన్చార్జిలకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. ఎంతోకొంత ఇష్టంతో ఇస్తే తీసుకొని, అంతటితో సంతృప్తి చెందాలి కానీ ఇంతే ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక నిలోఫర్ ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రసవం తర్వాత బంధువులెవరైనా బాలింతలను పరామర్శించాలన్నా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా.. అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. ఎవరైనా ఇందుకు నిరాకరించి, అవుట్ పోస్టింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. నీవేమైనా లక్షలిస్తున్నావా.. ఇచ్చి పోరాదు..! అంటూ వారూ వసూల్ రాజాలకే వంత పాడుతుండటం కొసమెరుపు. -
లేడీ డాన్ హల్చల్!
కృష్ణాజిల్లా, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రాజధాని పరిధిలోని తాడేపల్లి మున్సిపాలిటీలో ఓ లేడీ డాన్ హల్చల్ చేస్తోంది. దాదాపుగా రెండు ప్రాంతాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో దౌర్జన్యం చేస్తూ, పేద బలహీన వర్గాల వారిని టార్గెట్ చేస్తోంది. అవసరాల నిమిత్తం రూ.10 వేలు, రూ.20 వేలు ఇచ్చి వడ్డీకి చక్రవడ్డీ వేసి రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తోంది. సకాలంలో ఇవ్వకపోతే వారిపై దౌర్జన్యం చేయడమే కాకుండా చితకబాది మరీ వారి వద్ద ఉన్న ఆస్తులను కబ్జా చేసి తన వశం చేసుకుంటోంది. ఇలాంటి సంఘటనే తాజాగా నులకపేటలో సదరు లేడీ డాన్ దెబ్బకు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను అప్పజెప్పి, ఏం చేయాలో అర్థంకాక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల ప్రకారం.. నులకపేట ప్రాంతంలో నివసించే నాంచారయ్య వద్ద డ్రైవర్‌గా పనిచేసే విజయ్, అతని స్నేహితుడు సదరు మహిళ వద్ద రూ.10 వేలు నగదు తీసుకున్నారు. సకాలంలో ఆ నగదు చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం విజయ్ తోలుతున్న ఆటోను సదరు మహిళ లాక్కొని, వడ్డీతో సహా రూ.20 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్ విజయ్ జరిగిన విషయాన్ని ఆటో యజమాని నాంచారయ్యకు చెప్పగా, నాంచారయ్య నా ఆటో నాకు ఇవ్వాలని సదరు లేడీ డాన్‌ను అడగ్గా, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీకు చేతనైంది నువ్వు చేస్కో అని తేల్చి చెప్పింది. జరిగిన సంఘటనపై నాంచారయ్య శుక్రవారం నుంచి ఆది వారం వరకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పడిగాపులు గాచినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్, అతని స్నేహితుడు డబ్బులు తీసుకుంటే మేమేం చేయాలి.., మా ఆటో లాక్కోవడం ఏమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేదని నాంచారయ్య తెలియజేశాడు. గతంలో ఈ మహిళ నులకపేట ప్రాం తంలో ఓ ఆటో ఓనర్‌ను కరెంటు స్తంభానికి కట్టేయగా, పోలీసులు వెళ్లడంతో అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు కూడా ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు మహిళ నులకపేట, పరిసర ప్రాం తాల్లోని రోజువారీ కూలీలు, కార్మికులను టార్గెట్ చేసి, వారి అవసరాల దృష్ట్యా రూ.10 వేలు, రూ. 20 వేలు ఇచ్చి, వారానికి రూ.10 వేలైతే రూ.1000 వడ్డీ, రూ.20 వేలైతే రూ.2000లు వడ్డీ వసూలు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దృష్టికి వచ్చినా మీరెందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా అస్వస్థత చేసినప్పుడు, ఆటోలు రిపేర్ అయినప్పుడు ఆమె బారిన పడక తప్పట్లేదని, అయితే ఆమె చెప్పిన నగదు మొత్తం చెల్లిస్తున్నప్పటికీ 2, 3 రోజులు ఆలస్యమైతే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతోందని స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న లేడీ డాన్‌పై రాజధాని పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేక ఎందుకొచ్చిందిలే అని వదిలేస్తారో వేచిచూడాల్సిందే. -
‘మామూలోడు’ కాదు..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈనెల మొత్తం మామూళ్లు నాకే ఇవ్వాలంటూ ఒక అధికారి వేసిన ఆర్డర్ ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి బాధరా బాబూ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టే..! సంక్రాంతి సీజన్ కావడంతో కోడిపందేలు, ఇతరత్రా జూదాలు, పేకాట, గుండాట తదితర నిర్వాహకుల నుంచి ఈనెల ప్రతి స్టేషన్‌కు పెద్దమొత్తంలో మామూళ్లు వస్తాయి. ఇది ఏటా జరిగే తంతే.. అయితే ఈసారి ఆ మొత్తాన్ని తనకే ఇవ్వాలని ఓ సబ్‌డివిజనల్ అధికారి అడగటంతోనే వివాదం మొదలైంది. ఆ డివిజన్లో సంక్రాంతికి కోడి పందేలు పెద్దస్థాయిలో జరుగుతాయి. హైకోర్టు జోక్యం చేసుకున్నా పండగ మూడు రోజులూపందేలు జరిగిపోతాయి. వాటిని నిర్వహించినందుకు ప్రతి నిర్వాహకుడు తన పరిధిలోని స్టేషన్‌కు మామూళ్లు ఇవ్వడం సర్వసాధారణం. కొన్ని కీలకమైన స్టేషన్లకు ఈ మొత్తం రూ.లక్షల్లోఉంటుంది. అందుకే ఆ స్టేషన్ పోస్టింగ్‌లకు డిమాండ్ ఎక్కువ. ఇటీవల ఒక స్టేషన్ కోసం ఇద్దరు సీఐల మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో కోడిపందేలకు అడ్డు ఉండదని జూదరులు భావిస్తున్నారు. పోలీసులు స్పెషల్ టీమ్‌లు వేసినా, రెవెన్యూ విభాగం నుంచి సమావేశాలు పెట్టి బైండోవర్లు చేసినా పండగ మూడు రోజులు యథేచ్ఛగా కోడిపందేలు, జూదం జరగడం పరిపాటి. ఈ నేపథ్యంలో ఈనెల వచ్చే ఆదాయంపై ఆ సబ్‌డివిజనల్ అధికారి కన్నుపడింది. మద్యం షాపులు ఇతరత్రా ప్రతినెలా స్టేషన్‌కు వచ్చే మామూళ్లను డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఇలా నాలుగు వాటాలు వేయడం ఆనవాయితీ. అయితే ఈ సబ్‌డివిజనల్ అధికారి మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే మామూళ్లన్నీ ఈనెల తనకే ఇవ్వాలని కిందస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమావేశం రెండు రోజుల క్రితం తన పరిధిలోని అధికారులందరినీ పిలిచిన ఆ అధికారి రాత్రి ఒంటిగంట వరకూ సమావేశం పెట్టినట్లు తెలిసింది. మామూళ్లన్నీ తనకే ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. అయితే కిందిస్థాయి అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మంగళవారం నాలుగు స్టేషన్లను తనిఖీలు చేసి వారి రికార్డులను తనతో పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారశైలితో తాము ఇబ్బందులు పడుతున్నామని కిందిస్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారి దీపావళి మందుగుండు సామగ్రి షాపుల నుంచీ ఇలాగే వసూళ్లు చేశారని చెబుతున్నారు. గత ఏడాది కొత్తగా వచ్చిన సమయంలో ఆయా స్టేషన్లలో అధికారులు ఫలానా బరిలో ఈస్థాయిలో పందెం జరుగుతుంది.. ఇంత మామూళ్లు వస్తాయని చెబితే, ఆ అధికారి మఫ్టీలో బైక్‌పై వెళ్లి అధికారులు చెప్పింది నిజమా కాదా అని తనిఖీ చేసి వచ్చినట్లు సమాచారం. ఈ అధికారిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. -
విజిలెన్స్ అధికారులమంటూ కాంగ్రెస్ నాయకుల హల్చల్
పులివెందుల : పులివెందులలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చార్లెస్‌తోపాటు పులివెందులకు చెందిన ఆ పార్టీ నాయకులు విజిలెన్స్ అధికారులమంటూ పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం పట్టణంలోని వినాయకుడి విగ్రహం వద్ద హోటల్లో విజిలెన్స్ అధికారులమంటూ కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు పాల్పడుతుండటంతో.. హోటల్ యజమాని వారితో వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు నెలలుగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలోని హోటళ్ల యజమానులు, వ్యాపారస్తులతో కలసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చార్లెస్‌తోపాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంకెన్నాళ్లు..
వరంగల్ క్రైం : నిబంధనలకు విరుద్దంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కొంత మంది కానిస్టేబుళ్లు వసూళ్లుకు పా ల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువ కాలంగా పనిచేయడంతో అక్కడ ఉన్న లోటుపాటులను తెలుసుకొని సమస్యలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అనేక అసాంఘిక కార్యకలాపాలకు సదరు కానిస్టేబుళ్లకు కొంతమంది అక్రమార్కులు కూడా సాయం చేస్తున్నారు. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో పాలన పట్టు తప్పుతుంది. నగరంలో ఉన్న నాలుగు పీఎస్‌లో కొంత మంది కానిస్టేబుళ్లు ఎనిమిది ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇందులో కొంత మంది ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సాంకేతిక పొరపాట్లు ఆసరాగా.. 2013లో అర్బన్, రూరల్ జిల్లాల పోలీసు వ్యవస్థ ఏర్పడింది. ఆ సమయంలో నిర్వహించిన పోలీ సుల కేటాయింపు, సాధారణ బదిలీల్లో జరిగిన సాంకేతిక పొరపాట్లు ఆసరాగా చేసుకొని కొంత మంది కానిస్టేబుళ్లు బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు 42 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేయవద్దని తీర్పు విడుదల చేసింది. కానీ తీర్పు వచ్చే సమయానికే కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లల్లో చాలా మంది వారికి బదిలీ అయిన పీఎస్‌లో విధుల్లో చేరారు. కాని సుమారు 12 నుంచి 16 మంది కానిస్టేబుళ్లు మాత్రం మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు మరోసారి వీరిని బదిలీ చేయవద్దని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రెండోసారి కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు గత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలుగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. సీనియర్ల పేరిట దందా... కోర్టు ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ఒకే పీఎస్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కానిస్టేబు ళ్లలలో కొంతమంది డబ్బులను సంపాదించడమే ధ్యేయంగా వసూళ్లుకు పాల్పడుతున్నారు. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులు ఉన్నందున సదరు కానిస్టేబుళ్లను అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. పోలీసు కమిషనరేట్ ఏర్పాటుతో... వరంగల్ పోలీసు కమిషనరేట్ 2015 జూన్ 12న ఏర్పడింది. అనంతరం నూతన జిల్లాల ఏర్పాటుతో 2016 అక్టోబర్ నెలలో వరంగల్ పోలీసు కమి షనరేట్ వరంగల్ రూరల్ జిల్లా, జనగామ జిల్లా కు విస్తరించింది. దీంతో పాటు కరీంనగర్ నుంచి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు వరంగల్ కమిషనరేట్ విస్తరించింది. కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు కోర్టు ద్వారా పొందిన బదిలీ మినహాయింపు కమిషనరేట్‌లో వర్తించదని కొంత మంది సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆ కానిస్టుబుళ్లను బదిలీ చేయడం లేదు. దీంతో మిగతా కానిస్టేబుళ్లు ఒక్కొక్కరికి ఒ క్కో విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలకు బదిలీలు... సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి సాధారణ బదిలీలు జరగాలి. కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లకు ఇప్పటి వరకు స్థాన చలనం జరుగలేదు. జిల్లాల విభజన తర్వాత బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడలేదు. పదోన్నతుల విషయంలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆధారంగా సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిర్వహించారు. కమిషనరేట్‌లో ఇటీవల సుమారు 269 మందికి కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఐదు సం వత్సరాలు పూర్తవుతున్నందున ప్రస్తుతం బదిలీ లు జరగాల్సి ఉంది. ఈ సమయంలో అయిన ఆ కానిస్టేబుళ్లకు స్థాన చలనం జరిగేనా? అనే సందేహం చాలా మంది కానిస్టేబుళ్లలో కలుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసు శాఖలో ఏళ్ల తరబడి ఒకే చోట ఉంచడంతో పోలీసుశాఖకు చెడ్డ పేరు తెస్తున్నారనే ఆరోపణాలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు ఇప్పటికైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీ చే యాలని పలువురు కానిస్టేబుళ్లు కోరుతున్నారు రెండు వారాల్లో బదిలీలు కమిషనరేట్ పరిధిలో పనిచేసే కానిస్టేబుళ్లకు 2018 ఏప్రిల్ 30 నాటికి నాలుగున్నర సంవత్సరాలు దాటిన వారందరికీ బదిలీలు రెండు వారాల్లో చేస్తాం. గతంలో కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిని కూడా ఈ బదిలీల్లో స్థానచలనం ఉంటుంది. బదిలీలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. –డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అక్రమార్కుల హవా వరంగల్ బస్టాండ్ కేంద్రంగా పాన్ షాపులు, టీకొట్టులు, ఇడ్లీ బండీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంతేజార్గంజ్ కానిస్టేబుల్ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు నగరంలోని మరికొన్ని పోలీస్స్టేషన్లలో కూడా ఈవిధమైన అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
ఇంటి పన్నులకు..పింఛన్ డబ్బు
చీమకుర్తి రూరల్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చెల్లించాల్సిన పింఛన్ల డబ్బును గ్రామ కార్యదర్శులు ఇంటి పన్నులకు జమ చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చండ్రపాడు గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ సందర్భంగా బకాయిలున్న ఇంటి పన్నుల కింద పింఛన్ సొమ్ము ను జమ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వల్లంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చిన వెయ్యి రూపాయల పింఛ న్లో ఇంటి పన్ను కింద రూ.250 జమ చేసుకున్నారని అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో మరో వృద్ధురాలికి ఇల్లు కూడా లేదు. బంధువుల ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తోంది. ఆ వృద్ధురాలికి వచ్చిన పింఛను డబ్బును బంధువులు చెల్లించాల్సిన ఇంటిపన్ను కింద కార్యదర్శి జమ చేసుకున్నారు. అదేమని అడిగితే ఇంటిపన్ను చెల్లించాల్సిన వాళ్లు మీకు బంధువులే కాబట్టి వారి దగ్గర వసూలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా ఒక్క సోమవారం 80 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే వారిలో 50 మంది వద్ద నుంచి ఇంటి పన్నుల కింద ఇచ్చిన పింఛన్లను జమ చేసుకున్నారని పింఛనుదారులు వాపోతున్నారు. ఆసరగా ఉంటుందనుకుంటే పన్ను కింద జమ ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరాగా ఉంటుందనుకుంటే వారి అవసరాలను గుర్తించకుండా వచ్చిన పింఛన్లను ఇంటి యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్నుల కింద జమ చేసుకోవడాన్ని పింఛనుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పింఛన్లతో నెలంతా కాస్త ఉపశమనం పొందే వృద్ధులకు పన్నుల పేరుతో అది కూడా లేకుండా అధికారులు ముక్కుపిండి వసూలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు వస్తున్నాయి కాబట్టే తమను కాస్త గౌరవంగా ఇంట్లో చూస్తున్నారని, వచ్చిన పింఛన్లను ఇలా జమ చేసుకోవడం ఏంటని వృద్ధులు వాపోతున్నారు. మార్చి నెలాఖరు దాటిపోయినా పింఛన్లు వసూలు చేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం ఇంటి పన్ను జమ చేసేందుకు గడువు ఇచ్చింది. దానిలో భాగంగా గ్రామాల్లో ఇంటి పన్ను టార్గెట్ వంద శాతం చేసేందుకు గాను కార్యదర్శులు గ్రామాల్లో పింఛన్లు జమ చేసుకుంటున్నారు. నచ్చజెప్పే తీసుకుంటున్నాం ఇంటి పన్నుల బకాయిలున్నాయని, పింఛన్ల డబ్బును జమ చేయమని నచ్చజెప్పిన తర్వాతే పింఛన్ల డబ్బును ఇంటిపన్ను కింద వసూలు చేసుకుంటున్నాం. ఇంటి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని అధికారుల ఆదేశాలున్నాయి. పింఛనుదారులకు వివరించి వారిని ఒప్పించిన తర్వాతే తీసుకుంటున్నాం. – షేక్.జాన్ బాషా, కార్యదర్శి, చండ్రపాడు -
పైసా వసూల్..
ప్రొద్దుటూరు క్రైం :చేయి తడిపితేనే అక్కడ మద్యం కేసులు వాహనాల్లోకి వెళ్తాయి. లేదంటే మాత్రం వాహనంతో పడిగాపులు కాయాల్సిందే. డిపో అధికారులు ఒక రేటు నిర్ణయించి మద్యం షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ డబ్బు ఇవ్వకుంటే తమకు మద్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఇస్తున్నామని వారు అంటున్నారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో 134 మద్యం షాపులు ప్రొద్దుటూరు శివారులోని లింగాపురం సమీపంలో ఇటీవల కొత్తగా ఏఎంఎఫ్ఎల్ డిపో (లిక్కర్ డిపో)ను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులకు కడప ఎక్కువ దూరం అవుతుందనే ఉద్దేశంతో.. ప్రొద్దుటూరులో నూతనంగా లిక్కర్ డిపో ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో సుమారు 134 మద్యం షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపు నిర్వాహకులు వారంలో రెండు–మూడు సార్లు డిపో నుంచి స్టాకు తీసుకెళ్తారు. ఇలా నెలలో 10–12 సార్లు స్టాకు తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారులు చలానా రూపంలో డబ్బు చెల్లించి సరుకు తెచ్చుకుంటారు. డబ్బు తీసుకోలేదు మద్యం డిపోలో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని డిపో ఇన్చార్జి మేనేజన్ చెన్నప్ప అన్నారు. మద్యం కోసం యజమానులు ఎవ్వరూ రారని, ట్రాన్స్‌పోర్టు ద్వారా చలానా పంపిస్తారని ఆయన చెప్పారు. డబ్బు వసూలు చేయడం కోసం ఎవ్వరినీ నియమించలేదని పేర్కొన్నారు. ప్రారంభంలో డబ్బుఇవ్వబోమన్న వ్యాపారులు లిక్కర్ డిపో ప్రారంభంలో ఒక్కో చలానాకు రూ. 300 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా మద్యం వ్యాపారులు ఇవ్వబోమని కరాఖండిగా చెప్పేశారు. అయితే తిరిగి మద్యం దుకాణదారులు సమావేశమై రూ.250 ఇచ్చేలా తీర్మానం చేసినట్లు తెలిసింది. కాగా వసూలు చేసిన డబ్బులో అధికారులతోపాటు ఎక్సైజ్ స్టేషన్లకు పంపిస్తున్నామని డిపోలోని ఒక అధికారి చెప్పడం గమనార్హం. ప్రత్యేక సిబ్బందిచే వసూలు తమకు దగ్గరలో మద్యం డిపో ఏర్పాటైందని, ఖర్చులు తగ్గుతాయని తొలుత వ్యాపారులు భావించారు. అయితే డిపోలోని అధికారుల ధన దాహానికి తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణ యజమానులు చెబుతున్నారు. అసలే అంతంత మాత్రంగా వ్యాపారాలు ఉన్నాయని, స్టాకు కోసం వెళ్లినప్పుడు డిపో సిబ్బంది అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో చలానాకు రూ. 250 కచ్చితంగా ఇవ్వాల్సిందేనని వారు అంటున్నారు. డబ్బు లేదంటే మాత్రం వారి వాహనాలకు స్టాకు ఎత్తరని, ఒక వేళ స్టాకు లోడ్ చేసినా తీవ్ర జాప్యం చేస్తారని వాపోతున్నారు. రెండు మూడు కేసుల మద్యం తీసుకున్నా రూ.250 చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఇలా నెలకు మద్యం షాపుల నుంచి రూ.4 లక్షలు పైగా వసూలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డబ్బు వసూలు కోసం అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబును చూడటానికి వెయ్యి డాలర్లా?
- అమెరికాలో చంద్రన్న దర్శనానికి తెలుగోళ్ల జేబులకు చిల్లు - అధికారిక పర్యటనలో వసూళ్ల వ్యవహారంపై ఎన్నారైల విస్మయం డాలస్: 'అమరావతిని సింగపూర్‌లా కడతా.. ఏపీని అమెరికాలా మార్చేస్తా.. బిల్‌గేట్స్ నావల్లే హైదరాబాద్ వచ్చాడు.. సత్య నాదెళ్ళని నేనే ప్రోత్సహించా.. ' ఈ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఎవరివో తెలుసుకదా! అవును. ఆ ఘనత వహించిన చంద్రబాబుగారు మరోసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఇందులో వింతేమీలేదు. కానీ ఆయన పర్యటన కోసం తెలుగుతమ్ముళ్లుగా చెప్పుకునే కొందరు చేస్తోన్న ఏర్పాట్ల విన్యాసాలు చూస్తే మాత్రం హవ్వ అని విస్తుపోవాల్సిందే! పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం.. మే 3 నుంచి 12 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఈ క్రమంలోనే బాబు పాల్గొనే సభలకు ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రవేశం ఉచితం అంటూనే. మరోవైపు 'వెయ్యి డాలర్లు చెల్లిస్తే బాబుగారి సభలో ముందు వరస సీట్లలో కూర్చోవచ్చు' లాంటి బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్లు చూసి ఎన్నారైలంతా విస్తుపోతున్నారు! 'ఇదేమైనా నిధుల సేకరణ సభా? మరొకటా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రవేశానికి కూడా బోలెడంత తంతు ఉంది. సదరు ఎన్నారైలు ఏ ఊర్లో పుట్టారు? ఫోన్‌నంబర్, ఈ-మెయిల్ తదితర వివరాలన్నీ విధిగా సమర్పిస్తే తప్ప ఉచిత ప్రవేశానికి అవకాశం లేదు. ప్రభుత్వ నిధులతో ముఖ్యమంత్రి అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుంటే.. సభ నిర్వాహకుల రూపంలో తెలుగుతమ్ముళ్ళు అత్యుత్సాహం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. 'బ్రాడ్వే షో తరహాలో చంద్రబాబుని దగ్గరనుండి చూడడానికి ముందువరస సీట్లకి ధర కట్టడమనే ఐడియా సృష్టికర్త ఎవరోగానీ, చూడబోతే హైటెక్ బాబుగారికి తగినట్లే పరమానందయ్య శిష్యుల్లా తయారయ్యారులా ఉంది' అని ప్రవాసాంధ్రులు నవ్వుకుంటున్నారు. -
రూ. వంద చెల్లించాల్సిందే
► ఒక్కో ట్రాక్టర్ నుంచి బలవంతపు వసూలు ► పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్న సర్పంచ్ డీ.శిర్లాం: మండలంలోని డీ.శిర్లాం గ్రామ సమీపంలో సువర్ణముఖీ, గోముఖీ నదుల కలయిక వద్దనున్న నదీ పరీవాహకప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది పంచాయతీ ప్రజల నిర్ణయం. అయితే ఈ చర్యను సర్పంచ్ వెలమల వనజాక్షి వర్గం వ్యతిరేకిస్తోంది. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల కిందట గ్రామస్తులందరూ 11 నెలల కాలానికి ఇసుక వేలంపాట నిర్వహించారు. ఇసుక తీసుకెళ్లే వాహనాల నుంచి కొంత సొమ్ము వసూలు చేసి గ్రామంలోని సంగమేశ్వరాలయం అభివృద్ధికి కేటాయించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే సర్పంచ్ వనజాక్షి, ఆమె భర్త జగన్నాథం మాత్రం ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసిన తర్వాత వేలంపాట నిర్వహిద్దామని సూచించారు. ప్రభుత్వం ఇసుక ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఈ నేపథ్యంలో నగదు వసూలు చేయడం సబబు కాదని చెప్పారు. అయినప్పటికీ గ్రామానికి చెందిన కొంతమంది సర్పంచ్ మాటను పెడచెవిన పెట్టి వేలంపాట నిర్వహించగా, గ్రామానికి చెందిన సిరికి కృష్ణ పాట దక్కించుకున్నాడు. ట్రాక్టర్‌కు రూ. వంద గ్రామం మీదుగా ఇసుక తరలించే ఒక్కో ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నిసార్లు వెళితే అన్ని వందలు చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెబుతుంటే డబ్బులు ఎలా వసూలు చేస్తారని కొంతమంది వాహన యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులెవ్వరైనా గ్రామానికి వస్తే ఇసుక దందాపై తననే ప్రశ్నిస్తారని, అందుకే తామే ముందుగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేయనున్నామని సర్పంచ్ వనజాక్షి, జగన్నాథం ఆదివారం విలేకరులకు తెలిపారు. ఫిర్యాదు చేస్తా.. ట్రాక్టర్ లోడుకు రూ. వంద వసూలు చేస్తున్నారు. అధికారులకు తెలియజేసిన తర్వాత వేలంపాట నిర్వహిద్దామన్నా నా మాట వినలేదు. అందుకే అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. – వెలమల వనజాక్షి, డీ.శిర్లాం సర్పంచ్ డబ్బులు తీసుకుంటున్నారు.. నది నుంచి ఇసుక తీసుకువస్తున్న ఒక్కో ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు వెళితే అన్ని వందలు తీసుకోవడం అన్యాయం. –సత్యనారాయణ, ట్రాక్టర్ యజమాని, జమదాల ఆలయ అభివృద్ధికే.. గ్రామస్తుల సమక్షంలో ఇసుక తరలింపుపై వేలంపాట చేపట్టాం. 11 నెలల కాలానికి రూ. 50 వేలకు పాట ఖరారైంది. వచ్చిన ఆదాయంతో గ్రామంలోని సంగమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తాం. – సిరికి కృష్ట, వేలంపాటదారుడు. -
పోలీసులమంటూ వసూళ్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
చిట్యాల(నల్లగొండ): పోలీసులమని చెప్పుకుంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఆంజనేయులు, రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు లారీ డ్రైవర్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి బక్రీద్ పండగ సందర్భంగా.. లారీలో తరలుతున్న గొర్రెలు, ఆవులను లక్ష్యంగా చేసుకొని పోలీసులమంటూ చెప్తూ.. వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.