డాక్టర్ విశ్వనాథ రవీందర్ వరంగల్ పోలీస్ కమిషనర్
వరంగల్ క్రైం : నిబంధనలకు విరుద్దంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కొంత మంది కానిస్టేబుళ్లు వసూళ్లుకు పా ల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువ కాలంగా పనిచేయడంతో అక్కడ ఉన్న లోటుపాటులను తెలుసుకొని సమస్యలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అనేక అసాంఘిక కార్యకలాపాలకు సదరు కానిస్టేబుళ్లకు కొంతమంది అక్రమార్కులు కూడా సాయం చేస్తున్నారు.
దీంతో చాలా పోలీస్‌స్టేషన్‌లలో పాలన పట్టు తప్పుతుంది. నగరంలో ఉన్న నాలుగు పీఎస్‌లో కొంత మంది కానిస్టేబుళ్లు ఎనిమిది ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇందులో కొంత మంది ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
సాంకేతిక పొరపాట్లు ఆసరాగా..
2013లో అర్బన్, రూరల్ జిల్లాల పోలీసు వ్యవస్థ ఏర్పడింది. ఆ సమయంలో నిర్వహించిన పోలీ సుల కేటాయింపు, సాధారణ బదిలీల్లో జరిగిన సాంకేతిక పొరపాట్లు ఆసరాగా చేసుకొని కొంత మంది కానిస్టేబుళ్లు బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు 42 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేయవద్దని తీర్పు విడుదల చేసింది. కానీ తీర్పు వచ్చే సమయానికే కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లల్లో చాలా మంది వారికి బదిలీ అయిన పీఎస్‌లో విధుల్లో చేరారు.
కాని సుమారు 12 నుంచి 16 మంది కానిస్టేబుళ్లు మాత్రం మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు మరోసారి వీరిని బదిలీ చేయవద్దని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రెండోసారి కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు గత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలుగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు.
సీనియర్ల పేరిట దందా...
కోర్టు ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ఒకే పీఎస్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కానిస్టేబు ళ్లలలో కొంతమంది డబ్బులను సంపాదించడమే ధ్యేయంగా వసూళ్లుకు పాల్పడుతున్నారు. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులు ఉన్నందున సదరు కానిస్టేబుళ్లను అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.
పోలీసు కమిషనరేట్ ఏర్పాటుతో...
వరంగల్ పోలీసు కమిషనరేట్ 2015 జూన్ 12న ఏర్పడింది. అనంతరం నూతన జిల్లాల ఏర్పాటుతో 2016 అక్టోబర్ నెలలో వరంగల్ పోలీసు కమి షనరేట్ వరంగల్ రూరల్ జిల్లా, జనగామ జిల్లా కు విస్తరించింది. దీంతో పాటు కరీంనగర్ నుంచి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు వరంగల్ కమిషనరేట్ విస్తరించింది.
కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు కోర్టు ద్వారా పొందిన బదిలీ మినహాయింపు కమిషనరేట్‌లో వర్తించదని కొంత మంది సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆ కానిస్టుబుళ్లను బదిలీ చేయడం లేదు. దీంతో మిగతా కానిస్టేబుళ్లు ఒక్కొక్కరికి ఒ క్కో విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు సంవత్సరాలకు బదిలీలు...
సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి సాధారణ బదిలీలు జరగాలి. కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లకు ఇప్పటి వరకు స్థాన చలనం జరుగలేదు. జిల్లాల విభజన తర్వాత బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడలేదు. పదోన్నతుల విషయంలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆధారంగా సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిర్వహించారు. కమిషనరేట్‌లో ఇటీవల సుమారు 269 మందికి కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి.
2013లో పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఐదు సం వత్సరాలు పూర్తవుతున్నందున ప్రస్తుతం బదిలీ లు జరగాల్సి ఉంది. ఈ సమయంలో అయిన ఆ కానిస్టేబుళ్లకు స్థాన చలనం జరిగేనా? అనే సందేహం చాలా మంది కానిస్టేబుళ్లలో కలుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసు శాఖలో ఏళ్ల తరబడి ఒకే చోట ఉంచడంతో పోలీసుశాఖకు చెడ్డ పేరు తెస్తున్నారనే ఆరోపణాలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు ఇప్పటికైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీ చే యాలని పలువురు కానిస్టేబుళ్లు కోరుతున్నారు
రెండు వారాల్లో బదిలీలు
కమిషనరేట్ పరిధిలో పనిచేసే కానిస్టేబుళ్లకు 2018 ఏప్రిల్ 30 నాటికి నాలుగున్నర సంవత్సరాలు దాటిన వారందరికీ బదిలీలు రెండు వారాల్లో చేస్తాం. గతంలో కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిని కూడా ఈ బదిలీల్లో స్థానచలనం ఉంటుంది. బదిలీలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
–డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీస్ కమిషనర్
అక్రమార్కుల హవా
వరంగల్ బస్టాండ్ కేంద్రంగా పాన్ షాపులు, టీకొట్టులు, ఇడ్లీ బండీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంతేజార్‌గంజ్ కానిస్టేబుల్ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు నగరంలోని మరికొన్ని పోలీస్‌స్టేషన్లలో కూడా ఈవిధమైన అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment