no transfer
-
ఇంకెన్నాళ్లు..
వరంగల్ క్రైం : నిబంధనలకు విరుద్దంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కొంత మంది కానిస్టేబుళ్లు వసూళ్లుకు పా ల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువ కాలంగా పనిచేయడంతో అక్కడ ఉన్న లోటుపాటులను తెలుసుకొని సమస్యలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అనేక అసాంఘిక కార్యకలాపాలకు సదరు కానిస్టేబుళ్లకు కొంతమంది అక్రమార్కులు కూడా సాయం చేస్తున్నారు. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో పాలన పట్టు తప్పుతుంది. నగరంలో ఉన్న నాలుగు పీఎస్‌లో కొంత మంది కానిస్టేబుళ్లు ఎనిమిది ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇందులో కొంత మంది ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సాంకేతిక పొరపాట్లు ఆసరాగా.. 2013లో అర్బన్, రూరల్ జిల్లాల పోలీసు వ్యవస్థ ఏర్పడింది. ఆ సమయంలో నిర్వహించిన పోలీ సుల కేటాయింపు, సాధారణ బదిలీల్లో జరిగిన సాంకేతిక పొరపాట్లు ఆసరాగా చేసుకొని కొంత మంది కానిస్టేబుళ్లు బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు 42 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేయవద్దని తీర్పు విడుదల చేసింది. కానీ తీర్పు వచ్చే సమయానికే కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లల్లో చాలా మంది వారికి బదిలీ అయిన పీఎస్‌లో విధుల్లో చేరారు. కాని సుమారు 12 నుంచి 16 మంది కానిస్టేబుళ్లు మాత్రం మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు మరోసారి వీరిని బదిలీ చేయవద్దని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రెండోసారి కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు గత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలుగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. సీనియర్ల పేరిట దందా... కోర్టు ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ఒకే పీఎస్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న కానిస్టేబు ళ్లలలో కొంతమంది డబ్బులను సంపాదించడమే ధ్యేయంగా వసూళ్లుకు పాల్పడుతున్నారు. ఈ సమస్య అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులు ఉన్నందున సదరు కానిస్టేబుళ్లను అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. పోలీసు కమిషనరేట్ ఏర్పాటుతో... వరంగల్ పోలీసు కమిషనరేట్ 2015 జూన్ 12న ఏర్పడింది. అనంతరం నూతన జిల్లాల ఏర్పాటుతో 2016 అక్టోబర్ నెలలో వరంగల్ పోలీసు కమి షనరేట్ వరంగల్ రూరల్ జిల్లా, జనగామ జిల్లా కు విస్తరించింది. దీంతో పాటు కరీంనగర్ నుంచి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలకు వరంగల్ కమిషనరేట్ విస్తరించింది. కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లు కోర్టు ద్వారా పొందిన బదిలీ మినహాయింపు కమిషనరేట్‌లో వర్తించదని కొంత మంది సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆ కానిస్టుబుళ్లను బదిలీ చేయడం లేదు. దీంతో మిగతా కానిస్టేబుళ్లు ఒక్కొక్కరికి ఒ క్కో విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలకు బదిలీలు... సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి సాధారణ బదిలీలు జరగాలి. కోర్టును ఆశ్రయించిన కానిస్టేబుళ్లకు ఇప్పటి వరకు స్థాన చలనం జరుగలేదు. జిల్లాల విభజన తర్వాత బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడలేదు. పదోన్నతుల విషయంలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆధారంగా సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిర్వహించారు. కమిషనరేట్‌లో ఇటీవల సుమారు 269 మందికి కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఐదు సం వత్సరాలు పూర్తవుతున్నందున ప్రస్తుతం బదిలీ లు జరగాల్సి ఉంది. ఈ సమయంలో అయిన ఆ కానిస్టేబుళ్లకు స్థాన చలనం జరిగేనా? అనే సందేహం చాలా మంది కానిస్టేబుళ్లలో కలుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసు శాఖలో ఏళ్ల తరబడి ఒకే చోట ఉంచడంతో పోలీసుశాఖకు చెడ్డ పేరు తెస్తున్నారనే ఆరోపణాలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు ఇప్పటికైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీ చే యాలని పలువురు కానిస్టేబుళ్లు కోరుతున్నారు రెండు వారాల్లో బదిలీలు కమిషనరేట్ పరిధిలో పనిచేసే కానిస్టేబుళ్లకు 2018 ఏప్రిల్ 30 నాటికి నాలుగున్నర సంవత్సరాలు దాటిన వారందరికీ బదిలీలు రెండు వారాల్లో చేస్తాం. గతంలో కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిని కూడా ఈ బదిలీల్లో స్థానచలనం ఉంటుంది. బదిలీలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. –డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అక్రమార్కుల హవా వరంగల్ బస్టాండ్ కేంద్రంగా పాన్ షాపులు, టీకొట్టులు, ఇడ్లీ బండీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంతేజార్గంజ్ కానిస్టేబుల్ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు నగరంలోని మరికొన్ని పోలీస్స్టేషన్లలో కూడా ఈవిధమైన అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
ఇంకెన్నడో ?!
పోలీసుశాఖ బదిలీల్లో సందిగ్ధత అయోమయంలో సిబ్బంది అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వ శాఖలన్నింటిలో ఉద్యోగుల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. పోలీస్‌శాఖలో మాత్రం అదిగో ఇదిగో అంటూ ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో పోలీసులు టెన్షన్ టెన్షన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో సివిల్‌లో కానిస్టేబుళ్లు 1649 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 420, ఏఎస్ఐలు 197, ఎస్ఐలు 155, సీఐలు 39, డీఎస్పీలు 17 మంది, ఏఆర్‌లో కానిస్టేబుళ్లు 538, హెడ్‌కానిస్టేబుళ్లు 153, ఏఆర్ఎస్ఐలు 48, ఆర్ఎస్ఐలు 18, ఆర్ఐలు 11, ఒక డీఎస్పీ, ఒక ఏఎస్పీ ఉన్నారు. మిగతా ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీస్‌శాఖ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎస్ఐలకు కేవలం రెండు సంవత్సరాల మాత్రమే ఒక చోట పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన సిబ్బందిని కూడా కాలపరిమితి దాటితే బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు పోలీసుల్లో 20 శాతం ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అన్నిశాఖల్లో గత నెల 22కు బదిలీలను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బదిలీలు పూర్తి అయ్యాయి. కానీ పోలీస్ శాఖలో బదిలీల ప్రస్తావన లేదు. సాధారణంగా బదిలీలు మే, జూన్ మొదటి వారంలోగా నిర్వహిస్తే ఉద్యోగుల పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఉద్యోగులు భావిస్తారు. వెంటనే ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సదరు స్థానంలో పనిచేయడానికి మక్కువ చూపుతారు. ప్రస్తుతం పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో బదిలీలు చేపడితే ఇబ్బందులు పడుతామనే అభిప్రాయం కొంత మంది పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు జిల్లా కేంద్రానికి సమీపంలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల ప్రక్రియ ఎప్పుడు చేపడతారో ఏమోనని అందరూ అయోమంలో ఉన్నారు. -
రోడ్డెక్కిన విభేదాలు
సాక్షి, నెల్లూరు: రోడ్లు, భవనాల శాఖలోని అధికారుల మధ్య నెలకొన్న వర్గవిభేదాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. అధికారుల అండతో కొందరు వర్క్ఇన్స్పెక్టర్లు ఏళ్ల తరబడి బదిలీ కాకుండా ఒకే చోట మకాం వేయడాన్ని మరోవర్గం వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)కి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) వివేకానందరెడ్డి సోమవారం ఆర్అండ్బీ కార్యాలయంలో విచారణ చేపట్టడంతో విభేదాల గుట్టురట్టయింది. ఏళ్ల తరబడి ఒకే చోట జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండటంతో నెల్లూరు నగరంలో ఇబ్బడిముబ్బడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్డు మీద రోడ్డు వేస్తుండటంతో కాంట్రాక్టర్లతో పాటు కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కొందరు వర్క్ఇన్ స్పెక్టర్లు ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల అండతో ఏళ్లతరబడి నెల్లూరులోనే తిష్టవేశారు. జిల్లాలోని మూడు డివిజన్లు, 10 సబ్డివిజన్లలో 60 మంది వర్క్ఇన్స్పెక్టర్లు ఉండగా వీరిలో 25 మంది నెల్లూరులోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. కొందరు 18 ఏళ్లుగా ఒకే చోట తిష్టవేయడం విశేషం. పలువురు ఓవైపు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, మరోవైపు 20 శాతం హెచ్ఆర్ఏ పొందుతున్నారు. పనుల వద్దకు వెళ్లి పర్యవేక్షించకపోవడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు కూడా పొందినట్లు ఈఎన్సీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొందరిని మాత్రం ఐదేళ్లు పూర్తికాకుండానే బదిలీ చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు కొందరు ఉన్నతాధికారులే ఈ విధంగా బదిలీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్ల పేరుతో.. కొందరు అధికారులు, వర్క్ఇన్స్పెక్టర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతూ మొత్తం తతంగం నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు యూనియన్ల పేరుతో, మరోవైపు అధికార పార్టీ నేతల అండతో చాలా మంది వర్క్ఇన్స్పెక్టర్లు బదిలీ చేసినా వెళ్లడం లేదని, నేతలతో ఒత్తిడి తెస్తున్నారని ఆర్అండ్బీ ఉన్నతాధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన వారు కూడా నెల్లూరులోనే ఉండి పనుల పర్యవేక్షణకు వెళ్లడంలేదని, ఏమని అడిగితే యూనియన్ల పేరుతో బెదిరిస్తున్నారని ఓ అధికారి వాపోయారు. అధికారులే నాటకాలు ఆడుతున్నారని, తమకు అనుకూలంగా ఉండి సొంత పనులు చేసిపెట్టేవారిని ఏళ్ల తరబడి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచుతున్నారని, మిగిలిన వారిని వేధిస్తూ ఐదేళ్లు పూర్తికాకముందే అక్రమంగా బదిలీ చేస్తున్నారని ఓ వర్క్ఇన్స్పెక్టర్ ఆరోపించాడు. విచారణ..ఫిర్యాదుల స్వీకరణ అధికారులు, వర్క్ఇన్స్పెక్టర్లు గ్రూపులుగా విడిపోవడంతో ఆర్అండ్బీ శాఖలోని విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. ఓ వర్గం వారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ విభాగంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపాలంటూ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ వివేకానందరెడ్డిని ఆదేశించింది. ఆయన క్వాలిటీ కంట్రోల్ ఈఈ మురళీకృష్ణతో కలిసి సోమవారం నెల్లూరులోని రోడ్ల భవనాల శాఖ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ నిర్వహించారు. జిల్లాలో వర్క్ఇన్స్పెక్టర్లు ఎక్కడ పని చేస్తున్నది? నెల్లూరు పరిధిలో ఎంత మంది పనిచేస్తున్నారు? ఎన్ని ఏళ్లుగా బదిలీ లేకుండా ఇక్కడే ఉన్నారు? అనే విషయాలపై విచారణ జరిపి వివరాలు సేకరించారు. అదే సమయంలో అధికారులపై కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదులను సైతం స్వీకరించినట్లు సమాచారం.