పోలీసుశాఖ బదిలీల్లో సందిగ్ధత
అయోమయంలో సిబ్బంది
అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వ శాఖలన్నింటిలో ఉద్యోగుల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. పోలీస్‌శాఖలో మాత్రం అదిగో ఇదిగో అంటూ ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో పోలీసులు టెన్షన్ టెన్షన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో సివిల్‌లో కానిస్టేబుళ్లు 1649 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 420, ఏఎస్‌ఐలు 197, ఎస్‌ఐలు 155, సీఐలు 39, డీఎస్పీలు 17 మంది, ఏఆర్‌లో కానిస్టేబుళ్లు 538, హెడ్‌కానిస్టేబుళ్లు 153, ఏఆర్‌ఎస్‌ఐలు 48, ఆర్‌ఎస్‌ఐలు 18, ఆర్‌ఐలు 11, ఒక డీఎస్పీ, ఒక ఏఎస్పీ ఉన్నారు.
మిగతా ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీస్‌శాఖ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎస్‌ఐలకు కేవలం రెండు సంవత్సరాల మాత్రమే ఒక చోట పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన సిబ్బందిని కూడా కాలపరిమితి దాటితే బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు పోలీసుల్లో 20 శాతం ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అన్నిశాఖల్లో గత నెల 22కు బదిలీలను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బదిలీలు పూర్తి అయ్యాయి. కానీ పోలీస్ శాఖలో బదిలీల ప్రస్తావన లేదు.
సాధారణంగా బదిలీలు మే, జూన్ మొదటి వారంలోగా నిర్వహిస్తే ఉద్యోగుల పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఉద్యోగులు భావిస్తారు. వెంటనే ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సదరు స్థానంలో పనిచేయడానికి మక్కువ చూపుతారు. ప్రస్తుతం పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో బదిలీలు చేపడితే ఇబ్బందులు పడుతామనే అభిప్రాయం కొంత మంది పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు జిల్లా కేంద్రానికి సమీపంలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల ప్రక్రియ ఎప్పుడు చేపడతారో ఏమోనని అందరూ అయోమంలో ఉన్నారు.