డిపోలో ఉన్న మద్యం కేసులు
ప్రొద్దుటూరు క్రైం :చేయి తడిపితేనే అక్కడ మద్యం కేసులు వాహనాల్లోకి వెళ్తాయి. లేదంటే మాత్రం వాహనంతో పడిగాపులు కాయాల్సిందే. డిపో అధికారులు ఒక రేటు నిర్ణయించి మద్యం షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ డబ్బు ఇవ్వకుంటే తమకు మద్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఇస్తున్నామని వారు అంటున్నారు.
ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో 134 మద్యం షాపులు
ప్రొద్దుటూరు శివారులోని లింగాపురం సమీపంలో ఇటీవల కొత్తగా ఏఎంఎఫ్‌ఎల్ డిపో (లిక్కర్ డిపో)ను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులకు కడప ఎక్కువ దూరం అవుతుందనే ఉద్దేశంతో.. ప్రొద్దుటూరులో నూతనంగా లిక్కర్ డిపో ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు ఈఎస్ పరిధిలో సుమారు 134 మద్యం షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపు నిర్వాహకులు వారంలో రెండు–మూడు సార్లు డిపో నుంచి స్టాకు తీసుకెళ్తారు. ఇలా నెలలో 10–12 సార్లు స్టాకు తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారులు చలానా రూపంలో డబ్బు చెల్లించి సరుకు తెచ్చుకుంటారు.
డబ్బు తీసుకోలేదు
మద్యం డిపోలో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని డిపో ఇన్‌చార్జి మేనేజన్ చెన్నప్ప అన్నారు. మద్యం కోసం యజమానులు ఎవ్వరూ రారని, ట్రాన్స్‌పోర్టు ద్వారా చలానా పంపిస్తారని ఆయన చెప్పారు. డబ్బు వసూలు చేయడం కోసం ఎవ్వరినీ నియమించలేదని పేర్కొన్నారు.
ప్రారంభంలో డబ్బుఇవ్వబోమన్న వ్యాపారులు
లిక్కర్ డిపో ప్రారంభంలో ఒక్కో చలానాకు రూ. 300 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా మద్యం వ్యాపారులు ఇవ్వబోమని కరాఖండిగా చెప్పేశారు. అయితే తిరిగి మద్యం దుకాణదారులు సమావేశమై రూ.250 ఇచ్చేలా తీర్మానం చేసినట్లు తెలిసింది. కాగా వసూలు చేసిన డబ్బులో అధికారులతోపాటు ఎక్సైజ్ స్టేషన్లకు పంపిస్తున్నామని డిపోలోని ఒక అధికారి చెప్పడం గమనార్హం.
ప్రత్యేక సిబ్బందిచే వసూలు
తమకు దగ్గరలో మద్యం డిపో ఏర్పాటైందని, ఖర్చులు తగ్గుతాయని తొలుత వ్యాపారులు భావించారు. అయితే డిపోలోని అధికారుల ధన దాహానికి తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణ యజమానులు చెబుతున్నారు. అసలే అంతంత మాత్రంగా వ్యాపారాలు ఉన్నాయని, స్టాకు కోసం వెళ్లినప్పుడు డిపో సిబ్బంది అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో చలానాకు రూ. 250 కచ్చితంగా ఇవ్వాల్సిందేనని వారు అంటున్నారు. డబ్బు లేదంటే మాత్రం వారి వాహనాలకు స్టాకు ఎత్తరని, ఒక వేళ స్టాకు లోడ్ చేసినా తీవ్ర జాప్యం చేస్తారని వాపోతున్నారు. రెండు మూడు కేసుల మద్యం తీసుకున్నా రూ.250 చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఇలా నెలకు మద్యం షాపుల నుంచి రూ.4 లక్షలు పైగా వసూలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డబ్బు వసూలు కోసం అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment