సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈనెల మొత్తం మామూళ్లు నాకే ఇవ్వాలంటూ ఒక అధికారి వేసిన ఆర్డర్ ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి బాధరా బాబూ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సంక్రాంతి సీజన్ కాబట్టే..!
సంక్రాంతి సీజన్ కావడంతో కోడిపందేలు, ఇతరత్రా జూదాలు, పేకాట, గుండాట తదితర నిర్వాహకుల నుంచి ఈనెల ప్రతి స్టేషన్‌కు పెద్దమొత్తంలో మామూళ్లు వస్తాయి. ఇది ఏటా జరిగే తంతే.. అయితే ఈసారి ఆ మొత్తాన్ని తనకే ఇవ్వాలని ఓ సబ్‌డివిజనల్ అధికారి అడగటంతోనే వివాదం మొదలైంది. ఆ డివిజన్‌లో సంక్రాంతికి కోడి పందేలు పెద్దస్థాయిలో జరుగుతాయి. హైకోర్టు జోక్యం చేసుకున్నా పండగ మూడు రోజులూపందేలు జరిగిపోతాయి. వాటిని నిర్వహించినందుకు ప్రతి నిర్వాహకుడు తన పరిధిలోని స్టేషన్‌కు మామూళ్లు ఇవ్వడం సర్వసాధారణం. కొన్ని కీలకమైన స్టేషన్లకు ఈ మొత్తం రూ.లక్షల్లోఉంటుంది. అందుకే ఆ స్టేషన్ పోస్టింగ్‌లకు డిమాండ్ ఎక్కువ. ఇటీవల ఒక స్టేషన్ కోసం ఇద్దరు సీఐల మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో కోడిపందేలకు అడ్డు ఉండదని జూదరులు భావిస్తున్నారు. పోలీసులు స్పెషల్ టీమ్‌లు వేసినా, రెవెన్యూ విభాగం నుంచి సమావేశాలు పెట్టి బైండోవర్లు చేసినా పండగ మూడు రోజులు యథేచ్ఛగా కోడిపందేలు, జూదం జరగడం పరిపాటి. ఈ నేపథ్యంలో ఈనెల వచ్చే ఆదాయంపై ఆ సబ్‌డివిజనల్ అధికారి కన్నుపడింది. మద్యం షాపులు ఇతరత్రా ప్రతినెలా స్టేషన్‌కు వచ్చే మామూళ్లను డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఇలా నాలుగు వాటాలు వేయడం ఆనవాయితీ. అయితే ఈ సబ్‌డివిజనల్ అధికారి మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే మామూళ్లన్నీ ఈనెల తనకే ఇవ్వాలని కిందస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం.
అర్ధరాత్రి సమావేశం
రెండు రోజుల క్రితం తన పరిధిలోని అధికారులందరినీ పిలిచిన ఆ అధికారి రాత్రి ఒంటిగంట వరకూ సమావేశం పెట్టినట్లు తెలిసింది. మామూళ్లన్నీ తనకే ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. అయితే కిందిస్థాయి అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మంగళవారం నాలుగు స్టేషన్లను తనిఖీలు చేసి వారి రికార్డులను తనతో పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారశైలితో తాము ఇబ్బందులు పడుతున్నామని కిందిస్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారి దీపావళి మందుగుండు సామగ్రి షాపుల నుంచీ ఇలాగే వసూళ్లు చేశారని చెబుతున్నారు. గత ఏడాది కొత్తగా వచ్చిన సమయంలో ఆయా స్టేషన్లలో అధికారులు ఫలానా బరిలో ఈస్థాయిలో పందెం జరుగుతుంది.. ఇంత మామూళ్లు వస్తాయని చెబితే, ఆ అధికారి మఫ్టీలో బైక్‌పై వెళ్లి అధికారులు చెప్పింది నిజమా కాదా అని తనిఖీ చేసి వచ్చినట్లు సమాచారం. ఈ అధికారిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment