హిమాయత్‌నగర్: ఆయన మధ్య మండలానికి స్పెషాలాఫీసర్. ఆయన పేరు చెప్పినా, ఆయన ఎదురు పడినా ఇటు పోలీసులు, అటు వ్యాపారవేత్తలు హడలెత్తిపోతున్నారు. తాను స్పెషలాఫీసర్ అంటూ ఫోన్ చేస్తే పనవ్వాలి లేకపోతే వారి పనిపడతాడు. ఇలా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సెంట్రల్‌జోన్ పరిధిలో పని చేస్తున్న స్పెషల్‌బ్రాంచ్ ఏఎస్సై. ఆరేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సినిమా టిక్కెట్లు మొదలు అన్ని చోట్లా దందా చేస్తున్నాడు.
ఎస్‌బీ వాళ్లతోనే పెట్టుకుంటారా అంటూ..
సెంట్రల్‌జోన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో గత ఏడాది జనవరిలో జైనుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు బందోబస్తు కావాలంటూ వారు పోలీసులకు ఆర్జీ ఇచ్చారు. అదేరోజు ఎస్‌బీ ఏఎస్సై ఆ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆర్జీ ఇవ్వాలన్నాడు. ఎస్‌హెచ్‌ఓ అనుమతి లేకుండా ఇవ్వడం కుదరదన్న పాపానికి ‘నేను అడిగితే ఇవ్వరా? ఎస్‌బీ వాళ్లతోనే పెట్టుకుంటారా? వారం రోజుల్లో నేనెం టో చూపిస్తానంటూ పోలీసులను భయభ్రాంతులకు గురి చేశాడు. కొద్దిరోజులకే సివిల్ మ్యాటర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడంటూ ఆ పోలీ సు స్టేషన్‌లోని ఓ ఎస్సైకు మెమో వచ్చింది.
నేను చెప్పినా పట్టించుకోరా?
ఈ నెల 16వ తేదీన ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢికొన్నాయి. ఈ ఘటనలో రాంగ్‌రూట్‌లో వచ్చిన వ్యక్తి వాహనదారుడిపై దాడికి పాల్పడి పిడిగుద్దులు గుద్దాడు. బాధితుడు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ సీసీకెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. నిందితుడి తరుపున ఎస్‌బీ ఏఎస్సై పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నుంచి మా వాడ్ని తప్పించాలంటూ కోరాడు. తప్పు చేసినట్లు స్పష్టంగా సీసీకెమెరాల్లో కనిపిస్తుంది ఈ విషయంలో మేం ఏమీ చేయలేమని పోలీసులు చెప్పారు. ‘నేను చెప్పినా చేయరా? నాక్కూడా టైం వస్తుదంటూ’ లా అండ్ ఆర్డర్ పోలీసులను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది జరిగిన వారానికి అదే పోలీసు స్టేషన్ నుంచి ఓ పోలీసు అధికారి హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ అయ్యారు.
మసాజ్‌సెంటర్లపై దాడులు చేశారని..
ఇటీవల ఓ పోలీసు స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు మహిళలు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదలివేశారు.తాను వెనుదన్ను నిలస్తున్న మసాజ్ సెంటర్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడులు చేశారనే కోపంతో..పోలీసులు మసాజ్ సెంటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలకు దిగాడు. ఈ ఆరోపణలపై ఓ పోలీసు అధికారి హెడ్ క్వార్టర్స్‌కి అటాచ్ కూడా అయ్యారు.
ఆస్పత్రిలోనూ అంతే..
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన సమీప బంధువులకు బిల్లు రూ.1.50లక్షలు వేశారు. ‘నేను స్పెషలాఫీసర్‌ని, వాళ్లు నా బంధువులు ఓ రూ.50వేలు తగ్గించంటూ’ ఒత్తిడి తెచ్చి రూ.50వేలు డిస్కౌంట్ చేపించుకున్నాడు. మరో పది నిమిషాల్లో విడుదలబోతున్న సినిమాకు ఐదు టిక్కెట్లు కావాలంటూ ఓ కానిస్టేబుల్‌ని అడిగాడు. ఇప్పుడు సాధ్యం కాదన్నందుకు..ఆ కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ ఎస్‌బీ రిపోర్ట్ ఇచ్చాడు. హోటల్ వద్ద చికెన్ బిర్యానీ..స్వీట్స్ షాప్స్ వద్ద స్వీట్ బాక్సులు. తీసికెళ్లగం షరా మామూలైయ్యింది.
ఆరేళ్లుగా ఒకే పోస్టింగులో
సీసీఎస్ నుంచి సెంట్రల్‌జోన్ స్పెషల్‌బ్రాంచ్‌కు ఆరేళ్ల క్రితం ఆయన బదిలీ అయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్‌జోన్‌లో పలువురు ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ ఈయన మాత్రం ఇక్కడే తిష్టవేసుకుని కూర్చున్నారు. ధర్నాలు, మీటింగ్‌లు, సమావేశాలు వంటి విషయాలు పోలీసులు ఈయనకు ముందుగా చెప్పకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అతను పోలీసు స్టేషన్‌లోకి అడుగుపెడితేనే హోం గార్డు నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment