special branch officer
-
దందాలు చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ
హిమాయత్‌నగర్: ఆయన మధ్య మండలానికి స్పెషాలాఫీసర్. ఆయన పేరు చెప్పినా, ఆయన ఎదురు పడినా ఇటు పోలీసులు, అటు వ్యాపారవేత్తలు హడలెత్తిపోతున్నారు. తాను స్పెషలాఫీసర్ అంటూ ఫోన్ చేస్తే పనవ్వాలి లేకపోతే వారి పనిపడతాడు. ఇలా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సెంట్రల్‌జోన్ పరిధిలో పని చేస్తున్న స్పెషల్‌బ్రాంచ్ ఏఎస్సై. ఆరేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సినిమా టిక్కెట్లు మొదలు అన్ని చోట్లా దందా చేస్తున్నాడు. ఎస్బీ వాళ్లతోనే పెట్టుకుంటారా అంటూ.. సెంట్రల్‌జోన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో గత ఏడాది జనవరిలో జైనుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు బందోబస్తు కావాలంటూ వారు పోలీసులకు ఆర్జీ ఇచ్చారు. అదేరోజు ఎస్బీ ఏఎస్సై ఆ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆర్జీ ఇవ్వాలన్నాడు. ఎస్హెచ్ఓ అనుమతి లేకుండా ఇవ్వడం కుదరదన్న పాపానికి ‘నేను అడిగితే ఇవ్వరా? ఎస్బీ వాళ్లతోనే పెట్టుకుంటారా? వారం రోజుల్లో నేనెం టో చూపిస్తానంటూ పోలీసులను భయభ్రాంతులకు గురి చేశాడు. కొద్దిరోజులకే సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడంటూ ఆ పోలీ సు స్టేషన్‌లోని ఓ ఎస్సైకు మెమో వచ్చింది. నేను చెప్పినా పట్టించుకోరా? ఈ నెల 16వ తేదీన ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢికొన్నాయి. ఈ ఘటనలో రాంగ్రూట్లో వచ్చిన వ్యక్తి వాహనదారుడిపై దాడికి పాల్పడి పిడిగుద్దులు గుద్దాడు. బాధితుడు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ సీసీకెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. నిందితుడి తరుపున ఎస్బీ ఏఎస్సై పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నుంచి మా వాడ్ని తప్పించాలంటూ కోరాడు. తప్పు చేసినట్లు స్పష్టంగా సీసీకెమెరాల్లో కనిపిస్తుంది ఈ విషయంలో మేం ఏమీ చేయలేమని పోలీసులు చెప్పారు. ‘నేను చెప్పినా చేయరా? నాక్కూడా టైం వస్తుదంటూ’ లా అండ్ ఆర్డర్ పోలీసులను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది జరిగిన వారానికి అదే పోలీసు స్టేషన్ నుంచి ఓ పోలీసు అధికారి హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ అయ్యారు. మసాజ్సెంటర్లపై దాడులు చేశారని.. ఇటీవల ఓ పోలీసు స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. వారు మహిళలు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదలివేశారు.తాను వెనుదన్ను నిలస్తున్న మసాజ్ సెంటర్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడులు చేశారనే కోపంతో..పోలీసులు మసాజ్ సెంటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలకు దిగాడు. ఈ ఆరోపణలపై ఓ పోలీసు అధికారి హెడ్ క్వార్టర్స్‌కి అటాచ్ కూడా అయ్యారు. ఆస్పత్రిలోనూ అంతే.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన సమీప బంధువులకు బిల్లు రూ.1.50లక్షలు వేశారు. ‘నేను స్పెషలాఫీసర్‌ని, వాళ్లు నా బంధువులు ఓ రూ.50వేలు తగ్గించంటూ’ ఒత్తిడి తెచ్చి రూ.50వేలు డిస్కౌంట్ చేపించుకున్నాడు. మరో పది నిమిషాల్లో విడుదలబోతున్న సినిమాకు ఐదు టిక్కెట్లు కావాలంటూ ఓ కానిస్టేబుల్ని అడిగాడు. ఇప్పుడు సాధ్యం కాదన్నందుకు..ఆ కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ ఎస్బీ రిపోర్ట్ ఇచ్చాడు. హోటల్ వద్ద చికెన్ బిర్యానీ..స్వీట్స్ షాప్స్ వద్ద స్వీట్ బాక్సులు. తీసికెళ్లగం షరా మామూలైయ్యింది. ఆరేళ్లుగా ఒకే పోస్టింగులో సీసీఎస్ నుంచి సెంట్రల్‌జోన్ స్పెషల్‌బ్రాంచ్‌కు ఆరేళ్ల క్రితం ఆయన బదిలీ అయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్‌జోన్‌లో పలువురు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఈయన మాత్రం ఇక్కడే తిష్టవేసుకుని కూర్చున్నారు. ధర్నాలు, మీటింగ్‌లు, సమావేశాలు వంటి విషయాలు పోలీసులు ఈయనకు ముందుగా చెప్పకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అతను పోలీసు స్టేషన్లోకి అడుగుపెడితేనే హోం గార్డు నుంచి ఎస్హెచ్ఓ వరకు ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. -
ఖాకీ వనంలో కాబూలీ వాలా
గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఖాకీ దుస్తులు వేసుకున్న నాలుగో తరగతి మునిసిపల్ ఉద్యోగుల్ని చూస్తేనే సామాన్యుడు పోలీసోళ్లేమోనని ఒకింత కంగారుపడుతుంటాడు. పోలీసులు మర్యాద రామన్నల్లా ఉన్నామని ఎంత చెప్పుకున్నా ఖాకీలను చూస్తే భయమనే ముద్ర సమాజంలో చెరిగిపోలేదనేది అందరూ అంగీకరించే వాస్తవం. అటువంటి పోలీసులనే హడలెత్తిస్తున్నాడు ఓ కాబూలీ వాలా. ఇక్కడ విషయమేమిటంటే సదరు వడ్డీ వ్యాపారి కూడా పోలీసేకావడం. వృత్తి పోలీసు ఉద్యోగమైనా వడ్డీ వ్యాపారాన్ని ప్రవృత్తిగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు పోలీస్ శాఖకు గుండెకాయ వంటి స్పెషల్ బ్రాంచ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడట. వడ్డీ వ్యాపారంతోపాటు ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్లు చేయడం, భార్య పేరిట భవన నిర్మాణాలు చేపట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లాంటి దందాలో నిత్యం మునిగితేలే ఇతను ఇప్పుడు కీలకమైన విభాగంలో పనిచేస్తూ పోలీసులనే ముప్పుతిప్పలు పెడుతున్నాడని అంటున్నారు. పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా తన స్వదస్తూరితో రూ.లక్షలకు లక్షలు వడ్డీలకు ఇచ్చినట్టు నిర్భీతిగా ప్రాంసరీ నోట్లు రాయించుకుంటాడు. వడ్డీ కట్టడం ఆలస్యమైనా, చెల్లింపుల్లో రూపాయి తక్కువొచ్చినా.. ఖాళీ స్టాంపు పేపర్లు, నోట్లు, డాక్యుమెంట్లతో పలు ప్రాంతాల్లోని కోర్టులలో భార్య పేరిట దావాలు వేయడం ఇతనికి షరా మామూలే. ఇక డబ్బు కట్టలేని వాళ్ల ఆస్తులను నయానో భయానో స్వాధీనం చేసుకుంటాడు. ఇది బయట వ్యక్తుల వరకే కాదు.. పోలీసు శాఖలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడే కానిస్టేబుళ్లు, కుటుంబ అవసరాలతో సతమతమయ్యే పై ఉద్యోగులకు కూడా వడ్డీలకిచ్చి ఆస్తుల పత్రాలు దగ్గర పెట్టుకుని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. తనను ఎదిరించిన లేదా గట్టిగా అడిగిన కానిస్టేబుళ్లపైన, ఆపై ఉద్యోగులపైన ఉన్నతాధికారులకు పిటిషన్ల మీద పిటిషన్లు పంపిస్తాడు. ఆరోపణల్లో మచ్చుకు కొన్ని.. ఏలూరులోని రెండు అపార్ట్మెంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి తన భార్య పేరున రిజిస్టర్ చేయించాడు. వంద చదరపు గజాల స్థలంతోపాటు కార్పొరేషన్‌కు చెందిన రోడ్డును ఆక్రమించి అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టాడని కార్పొరేషన్ అధికారులు గగ్గోలు పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ బాధ్యుడిగా పనిచేస్తున్న కాలంలో బినామీల పేరిట లెక్కకు మించిన ప్లాట్లు సొంతం చేసుకున్నాడన్న ఆరోపణలు మూటకట్టుకున్నాడు. ఓ ఇంజినీర్‌కు రూ.6 లక్షల రుణమిచ్చి వడ్డీల మీద వడ్డీలు వేసి రూ.15 లక్షలు కట్టించుకుని ఇంకా డబ్బులు రావాలంటూ భార్య పేరిట ఏలూరు కోర్టులో దావా వేసి డిక్రీ పొందాడు. టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలు అప్పిచ్చి రూ. 6లక్షల 30వేలు కట్టించుకుని ఇంకా తన బాకీ తీరలేదని, ఏలూరు సివిల్ జడ్జి కోర్టులో డిక్రీ పొందాడు. విచారణల మీద విచారణలు ఇప్పటికే సదరు ఉద్యోగి అరాచకాల మీద శాఖాపరమైన విచారణలే కాదు ఏసీబీ, విజిలెన్స్, విచారణ, లోకాయుక్తా విచారణలు కొనసాగుతున్నాయి. పదిహేనేళ్ల కిందట తాడేపల్లిగూడెంలో కానిస్టేబుల్‌గా పనిచేసే రోజులలో హోంగార్డుల జీతాలు కాజేసి సస్పెండైన చరిత్ర ఉంది. విజయవాడ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేసిన కాలంలో చోరీ సొత్తు మాయం చేసి దొంగలను వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గతంలో నిర్భయ కేసునూ ఎదుర్కొన్నాడు. ఇంతటి చరిత్ర ఉన్న అతన్ని కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కి ఎలా తీసుకువచ్చారు.. ఎవరి ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాడన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. రాజకీయాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేస్తూ జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని తమదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు తమ పంచలోనే ఉన్న సదరు కాబూలీ వాలాపై ఓ కన్నేయాలన్నదే ఖాకీవనం నుంచి వచ్చిన విన్నపం.