చంద్రబాబును చూడటానికి వెయ్యి డాలర్లా?
- అమెరికాలో చంద్రన్న దర్శనానికి తెలుగోళ్ల జేబులకు చిల్లు
- అధికారిక పర్యటనలో వసూళ్ల వ్యవహారంపై ఎన్నారైల విస్మయం
డాలస్: 'అమరావతిని సింగపూర్‌లా కడతా.. ఏపీని అమెరికాలా మార్చేస్తా.. బిల్‌గేట్స్ నావల్లే హైదరాబాద్ వచ్చాడు.. సత్య నాదెళ్ళని నేనే ప్రోత్సహించా.. ' ఈ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఎవరివో తెలుసుకదా! అవును. ఆ ఘనత వహించిన చంద్రబాబుగారు మరోసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఇందులో వింతేమీలేదు. కానీ ఆయన పర్యటన కోసం తెలుగుతమ్ముళ్లుగా చెప్పుకునే కొందరు చేస్తోన్న ఏర్పాట్ల విన్యాసాలు చూస్తే మాత్రం హవ్వ అని విస్తుపోవాల్సిందే!
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం.. మే 3 నుంచి 12 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఈ క్రమంలోనే బాబు పాల్గొనే సభలకు ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రవేశం ఉచితం అంటూనే. మరోవైపు 'వెయ్యి డాలర్లు చెల్లిస్తే బాబుగారి సభలో ముందు వరస సీట్లలో కూర్చోవచ్చు' లాంటి బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్లు చూసి ఎన్నారైలంతా విస్తుపోతున్నారు! 'ఇదేమైనా నిధుల సేకరణ సభా? మరొకటా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రవేశానికి కూడా బోలెడంత తంతు ఉంది. సదరు ఎన్నారైలు ఏ ఊర్లో పుట్టారు? ఫోన్‌నంబర్, ఈ-మెయిల్ తదితర వివరాలన్నీ విధిగా సమర్పిస్తే తప్ప ఉచిత ప్రవేశానికి అవకాశం లేదు.
ప్రభుత్వ నిధులతో ముఖ్యమంత్రి అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుంటే.. సభ నిర్వాహకుల రూపంలో తెలుగుతమ్ముళ్ళు అత్యుత్సాహం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. 'బ్రాడ్వే షో తరహాలో చంద్రబాబుని దగ్గరనుండి చూడడానికి ముందువరస సీట్లకి ధర కట్టడమనే ఐడియా సృష్టికర్త ఎవరోగానీ, చూడబోతే హైటెక్ బాబుగారికి తగినట్లే పరమానందయ్య శిష్యుల్లా తయారయ్యారులా ఉంది' అని ప్రవాసాంధ్రులు నవ్వుకుంటున్నారు.