చికాగో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు
సాక్షి,అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాదరణ కోల్పోయి, టీడీపీ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారని ఎన్నారైలు ధ్వజమెత్తారు. అమెరికాలోని చికాగోలో తెలుగు ఎన్నారైలు మంగళవారం జనాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎన్నారై నేత కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు రకరకాల పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు.
ఏపీ గంజాయి రాష్ట్రం అంటూ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ముద్ర వేసే ప్రయత్నం ఢిల్లీ వేదికగా మొదలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. పట్టాభితో సీఎం వైఎస్ జగన్‌ను బూతులు తిట్టించడం, తర్వాత జరిగిన పరిణామాలను ఒక ఉద్యమంగా మార్చటం, ఆ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అంతా ఏపీకి చేటు చేసేందుకేనని ఆయన విమర్శించారు.
ప్రజల సాక్షిగా సీఎం జగన్‌కు ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బోసిడీకే అన్న పదంతో సీఎంను దూషించిన టీడీపీ నేత పట్టాభిని తెలుగు జాతి క్షమించదన్నారు. చికాగోలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో యత్తపు శరత్, యారసాని పరమేశ్వర్, పూల కిషోర్, నరసింహారెడ్డి, పిచాలా వెంకటేశ్వర్, వెంకట్, శ్రీధర్ అలవాలా, విజయ్ సంకెపల్లి, రమేష్ తమ్మూరి, రామిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment