ఇది అవకాశాల కేంద్రం: చంద్రబాబు
* మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి
* ప్రవాస భారతీయ దివస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
* ప్రవాస భారతీయులతో ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గం, అవకాశాలకు కేంద్రమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో శుక్రవారం ప్రవాస భారతీయ సమ్మేళనంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌సింగ్‌సహా పలువురు కేంద్ర మంత్రులతోపాటు తొమ్మిది రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో ఏపీలో గల వనరులు, పెట్టుబడి అవకాశాలపై సీఎం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అని పిలుపునివ్వగా, అందులో భాగంగానే తాను మేకిన్ ఆంధ్రప్రదేశ్ అని పిలుపునిచ్చానని చెప్పారు. తూర్పుతీరంలో ఏపీ భారతదేశానికి సింహద్వారమని, దేశంలో రెండో పెద్ద తీర ప్రాంతం ఏపీకి సొంతమని, విలువైన ఖనిజ సంపదకు ఆలవాలమని అన్నారు. ఫిబ్రవరి నుంచి ఈ-బిజినెస్‌ను ప్రారంభిస్తున్నామని, ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ, వల్లభాయ్ పటేల్ పుట్టిన రాష్ట్రం గుజరాత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రావటం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు.
ఎన్‌ఆర్‌ఐలతో ప్రత్యేక భేటీ
ప్రవాస భారతీయ దివస్‌లో భాగంగా చంద్రబాబు ఎన్‌ఆర్‌ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు మెడికల్ హబ్‌గా హైదరాబాద్‌ను రూపొం దించేందుకు శ్రమపడ్డానని, అందువల్లే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అత్యున్నత వైద్యానికి రోగులు వస్తున్నారని చెప్పారు. ఏపీని మెడికల్ హబ్‌గా తయారు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక త యారు చేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న సీఎం వినతికి స్క్రానింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీఈవో రాజన్ శాంతి సదానందం స్పందించారు. ఏపీలో వరల్డ్ క్లాస్ హెల్త్ వర్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.