ఇసుక మాఫియాకు అడ్డాగా
గజపతినగరం నియోజకవర్గం
ఒంపిల్లిలో చెరువును సైతం
వదలని పరిస్థితి
మట్టిని సైతం మనీగా మార్చేసుకుంటున్నారు. గెడ్డలు, చెరువులు, నదులు ఇలా కనిపించిన వాటన్నింటినీ కొల్లగొట్టి కాసులు పండించుకుంటున్నారు. తవ్విన ఇసుకను గ్రామాల సమీపంలో తిన్నెలు వేసి, రవాణా చేస్తున్నారు నాణ్యతలేని మట్టి ఇసుకతో నిర్మించే భవనాలు కూలిపోయే అవకాశం ఉంది. అయినా తమ జేబులు నిండుతున్నాయి... ఎవరు ఎలా పోతే తమకేంటన్న రీతిలో గజపతినగరంలో కొందరు నాయకులు దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా దొంగనిద్ర నటిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో దర్జాగా దోపిడీకి పాల్పడుతున్నారు. నదులను గుల్ల చేసేస్తున్నారు. గెడ్డలు, చెరువులను సైతం కొల్లగొడుతున్నారు. మట్టి, ఇసుక తీసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వారి జోలికెళ్లితే తమనెక్కడ ఇరికిస్తారనో, బదిలీ చేసేస్తారనో భయంతో చోద్యం చూస్తున్నారు. పత్రికల్లో కథనాలొస్తున్నా ఉన్నతాధికారులు కిమ్మనడం లేదు. ఆ నియోజకవర్గమైతే అంతే అంటూ చేతులెత్తేస్తున్నారు. ఎవర్ని చూసి భయపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గారి నిర్వాకం జిల్లా అంతా మార్మోగుతోంది. ఈ నియోజకవర్గంలో జరిగినంతగా ఎక్కడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగలేదు. మొన్న గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి ఆనుకుని ఉన్న చంపావతి నదిలో ఎంత అడ్డగోలుగా తవ్వకాలు జరిపి, రవాణా చేస్తున్నారో ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కానీ అధికారులు స్పందించలేదు. పెద్దలకు భయపడి చర్యలు తీసుకోలేదు.
చాకిరేవు బంద చెరువులో అక్రమ తవ్వకాలు
తాజాగా బొండపల్లి మండలం ఒంపిల్లి గ్రామంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా మరో ఆసక్తికరమైన వ్యవహారం వెలుగు చూసింది. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చాకిరేవు బంద చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు జరిపిన దృశ్యాలు కనిపించాయి. ఊరి సమీపంలో ఎక్కడికక్కడ డంపింగ్ చేసిన ఇసుక దిబ్బలు దర్శనమిచ్చాయి. ఇదంతా చూస్తుంటే మట్టి ఇసుకను తవ్వేసి, గ్రామ సమీపంలో డంపింగ్ చేసి, అక్కడి నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక్కడెవరు చేస్తున్నారో ఆ గ్రామస్తులందరికీ తెలుసు. కానీ, అధికార అండతో ఏం చేస్తారోనన్న భయంతో బయట పడటం లేదు. అయితే, గతంలో సర్పంచ్‌గా పనిచేసిన భోగాపురం కన్నంనాయుడు మాత్రం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను అందజేశారు.
మట్టి ఇసుకతోనే నిర్మాణాలు
మట్టి ఇసుకలో నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉంటాయి. సిమెంట్ సరిగా పట్టదు. దీంతో నిర్మాణాలకు ముప్పు వాటిల్లనుంది. కానీ, ఇక్కడ లభ్యమవుతున్న మట్టి ఇసుకతోనే బొండపల్లి మండలంలో గల పలు గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఉపాధి పథకం నిర్మాణ పనులు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. గృహ నిర్మాణ దారులకు ఈ ఇసుక లోగుట్టు తెలియకపోవడంతో తమ దగ్గరికొచ్చిన ఇసుకను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో గల దత్తిరాజేరు మండలం ఏడొంపుల గెడ్డలో కూడా ఇదే తరహాలో తవ్వకాలు జరిపేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతీరోజూ రాత్రిపూట వందల లోడులు తరలిపోతున్నాయి.
గుల్లవుతున్న చంపావతి,గోస్తని నదులు
నియోజకవర్గ పరిధిలో గల చంపావతి, గోస్తని నదులు గుల్లవుతున్నాయి. యథేచ్ఛగా తవ్వకాలు జరిగిపోతున్నాయి. పెదకాద, లోగిస, లింగాలవలసలోని అధికారిక ఇసుక రీచ్‌ల నుంచి రాత్రిపూట అక్రమ రవాణా జరుగుతోంది. ఆ రీచ్‌ల వద్ద నిఘా లేకపోవడంతో రాత్రి సమయంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపి, వందలాది ట్రాక్టర్ల లోడులు రవాణా చేస్తున్నారు. పైసా ఖర్చు పెట్టకుండా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
చంపావతి నదీ పరివాహాక ప్రాంతాలైన గంగచోళ్లపెంట, పురిటిపెంట, కొణిస, చిట్టియ్యవలస, శ్రీ రంగరాజపురం, గుమడాం,బొండపల్లి, ముద్దూరు, కనిమెరక, అలాగే గోస్తని నది పరిహాక ప్రాంతాలైన తాటిపుడి, మధుపాడ గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాలు జరిపి, అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా వ్యవహరించడం లేదు. అక్కడ వేలిపెడితే అధికారిక సమావేశాల్లో ఏదొక లోపంతో నిలదీసి, ఇబ్బంది పెడతారని, అవసరమైతే బదిలీ చేయించేస్తారని భయపడుతున్నారు.
ఇసుకాయ స్వాహా!
Published Sat, Jun 6 2015 12:52 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement