జిల్లాలో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. సామాన్యుల పేరు చెప్పి కాంట్రాక్టర్‌లు, అధికారబలం ఉన్న నేతలు రీచ్‌లపై పడి అడ్డంగా సొమ్ము చేసుకుంటున్నారు. వే బిల్లులు రాయడానికి, నిర్వహణకే స్వయం సహాయక సంఘాలు పరిమితమవుతున్నాయి. వారి ముసుగులో అధికారపార్టీ పెద్దలు పెత్తనం చెలాయిస్తున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ ఇసుకపై రోజు విడిచి రోజు సమావేశాలు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు లేదు. రాజమండ్రి నుంచి కోనసీమలోని సోంపల్లి వరకు ఏ రీచ్‌ను పరిశీలించినా అడ్డగోలు వ్యవహారమే సాక్షాత్కరిస్తోంది.
* మహిళా సంఘాల పాత్ర నిమిత్తమాత్రమే
* రీచ్‌లలో పెత్తనమంతా టీడీపీ నేతలదే
* నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రవాణా
* దండిగా సొమ్ములు దండుకుంటున్న వైనం
* జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించడం ముందు అనుకున్నట్టే ఓ ప్రహసనంగా మారింది. రాజమండ్రి కుమారి టాకీస్ రీచ్ వద్ద అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్ బంధువు అన్నీ తానై మహిళా సంఘాలను ప్రేక్షకపాత్రకే పరిమితం చేశారు. ప్రభుత్వ పనులకోసం అంటూ బోర్డు పెట్టి ఇసుకను బిల్డర్‌లు, కాంట్రాక్టర్‌లకు తరలిస్తున్నారు. రీచ్‌ల్లోకి వ్యాన్‌లు, ట్రాక్టర్లకే అనుమతి ఉండగా 10 టైర్ల లారీలతో కూడా ఇసుక తరలిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకకు రూ.4,000 డీడీ తీసి రీచ్‌లో కొనుగోలుచేసి బయట మార్కెట్‌లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అదే నాయకుడు స్థానికుల పేర్లతో డీడీలు తీసి పశ్చిమగోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలకు తరలించుకు పోతున్నారు. ఈ రీచ్ నుంచి సుమారు 200 లారీల ఇసుక రవాణా జరుపుతున్నారు. వీటిలో 30 లారీల ఇసుక ఒకటి, రెండు పర్మిట్‌లపై తరలిపోతుండగా, సుమారు 40 లారీల ఇసుక పర్మిట్ లేకుండానే తరలిపోతోంది.
రాజోలు మండలం సోంపల్లి, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం రీచ్‌లు అక్రమాలకు చిరునామాగా మారాయి. ఈ రీచ్‌లలో 70 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారు. గత 20 రోజుల్లో సుమారు రూ.30 లక్షల మేర అక్రమార్కుల జేబుల్లోకి పోయింది. డ్వాక్రా సంఘాలు వే బిల్లు రాయకుండానే రీచ్‌లలో ట్రాక్టర్లకు లోడ్ చేసేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, స్థానిక సంస్థలకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి అక్రమార్కులు వాటాలు పంపేస్తున్నారు. సోంపల్లిలో వేబిల్లు ఒకటే ట్రిప్పులు ఐదారు అన్నట్టు ఇసుక తరలిపోతోంది. ఒక వే బిల్లు రాయించుకున్న ట్రాక్టరుతో రోజుకు 10 ట్రాక్టర్ల ఇసుక దొడ్డిదారిన తరలిస్తున్నారు. రాజోలు దీవి ఇసుక రీచ్‌లలో ప్రభుత్వానికి చెల్లించే రూ.2 వేల డీడీ కాక ట్రాక్టరు ఇసుకను లోడ్ చేశాక రూ.650 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ అధికారులకు తెలిసినా ఒత్తిళ్లతో మిన్నకుంటున్నారు.
నదీగర్భంలోకి భారీ వాహనాలు..
ఇదే పరిస్థితి మందపల్లి, జొన్నాడ రీచ్‌లలో కనిపిస్తోంది. భారీ వాహనాలను నదీ గర్భంలోకి దింపి మరీ ఎగుమతి చేస్తున్నారు. నేతల కనుసన్నల్లోనే డ్వాక్రా సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేయడంతో వారు మాట్లాడలేకపోతున్నారు. క్వారీ లారీకి రెండు యూనిట్ల ఇసుక(ఆరు క్యూబిక్ మీటర్లు) మాత్రమే పడుతుంది. యూనిట్ రూ.2000 వంతున రెండు యూనిట్లకు రూ.4000 చెల్లించి వాహనాన్ని తీసుకువెళితే ఇసుక ఎగుమతి చేస్తున్నారు. క్వారీ లారీలో రవాణా 10 టన్నుల వరకు ఉంటుంది. అదే మార్కెట్ లారీ, 10 టైర్ల లారీ(పెద్ద టిప్పరు)లకి రవాణాశాఖ 17 టన్నుల పరిమితిని విధించింది. ఈ ర్యాంపుల్లో మార్కెట్ లారీలు, పెద్ద టిప్పర్లలో ఐదు యూనిట్ల ఇసుకను నింపుతున్నారు. అంటే ఒక లారీలో 30 టన్నుల సరుకు వెళుతోంది. కళ్లెదుటే ఈ తంతు జరుగుతున్నా కేసుల నమోదుకు వెనుకంజ వేయడంతో స్థానికులు విస్తుబోతున్నారు.
అక్కమాలకు అధికారుల ఊతం
మందపల్లి రీచ్‌పై కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రీచ్‌లో రోజుకు సుమారు 50 మార్కెట్ లారీల్లో ఇసుక ఎగుమతవుతోంది. నిబంధనలకు భిన్నంగా నిత్యం 650 టన్నుల ఇసుక తరలిపోతోందని అంచనా. లారీకి రూ.4 వేల చొప్పున రూ.2.60 లక్షలు ఈ ఒక్క రీచ్‌లోనే ప్రతి రోజు ఇసుక తరలిపోతోందని అంచనా. పాత వే బిల్లులతో ఇసుక తరలించుకుపోతుండగా శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు.
ఈ విషయాన్ని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో మరో కొత్త వేబిల్లు తీసుకువచ్చి పొరపాటున పాత బిల్లు ఇచ్చారని సమర్థించేందుకు ప్రయత్నించడం, ఇందుకు అధికారులు కూడా వత్తాసు పలకడాన్ని బట్టి వారు ఏ రకంగా అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోంది. జొన్నాడ రీచ్‌లో ఒక బిల్లుపై నాలుగైదు ట్రిప్పులు తరలించేస్తున్నారు.ఆ రీచ్‌లో 10 టైర్ల లారీల్లో రోజుకు 20 ట్రిప్పుల ఇసుక ఎగుమతి అవుతోంది. లారీకి రూ.10 వేల వంతున రోజుకు రూ.2 లక్షల విలువైన ఇసుక దొడ్డిదారిన మళ్లించేస్తున్నారని అంచనా.
అనధికారికంగానే ర్యాంపుల నిర్వహణ
గోదావరి పరీవాహక ప్రాంతమైన కె.గంగవరం మండలం మసకపల్లి, పెదలంక, కోటిపల్లి వద్ద కోట గ్రామాలను అనుకుని అనధికార ర్యాంపులను తెలుగుతమ్ముళ్లు నిర్వహిస్తున్నారు. మసకపల్లి, పెదలంకల పరిధిలో గోదావరి తీరంలో కె.గంగవరం మండ లానికి చెందిన అధికారపార్టీ స్థానిక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధి దగ్గరుండి రాత్రి వేళల్లో ఇసుక తరలించి సొమ్ములు దండుకుంటున్నారు.
కోట వద్ద కూడా ఇదే పరిస్థితి. ఆ రెండు ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక రీచ్ అనేదే లేనప్పుడు రూ.70 వేలు వెచ్చించి రాకపోకలకు అనువుగా ర్యాంపు నిర్మించడం, ఇసుక నిల్వ కోసం గోదావరిని అనుకుని 10 ఎకరాల లంక భూములను లీజుకు తీసుకోవడాన్ని పరిశీలిస్తే ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. నది కడుపులోని ఇసుకతో ఇలా అక్రమార్కులు లాభాలు పిండుకోవడమేనా.. సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవడం అన్న ప్రశ్నకు సర్కారే సమాధానం చెప్పాలి.
అక్రమార్కులకు ఇసు‘కాసుల’ పంట
Published Sat, Nov 29 2014 1:03 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement