Womens groups
-
పొదుపు మహిళే బ్యాంకర్! సంఘాలే బ్యాంకులు
పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహిళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటున్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బులను అవసరమైన వారికి నామమాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయిలోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది. ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్ సీహెచ్ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొకరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు. సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్‌లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్‌లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి. 3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం. గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.386 కోట్లు, అక్టోబర్‌లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవస్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు. రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటిదాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్ ఖాతాలలో నిరుపయోగంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టోబర్‌లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండిపోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మహిళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బులతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్ఎల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
మహిళల్ని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
పిఠాపురం: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘చేయూత మహిళా మార్టు’లకు శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఏర్పాటు చేసిన ‘చేయూత మహిళా మార్టు’ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు సమీపంలో ఉండేలా.. తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించే మార్టులు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం జగన్ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులను పెద్ద వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి మార్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్థానికులంతా మహిళా మార్టును వినియోగించుకుని మహిళా సంఘాలకు తోడ్పాటునివ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే లక్షాధికారులుగా మారిన అక్కాచెల్లెమ్మలు.. ఈ మార్టుల ద్వారా కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. టీడీపీ హయాంలో లంచాలిస్తే గాని ప్రజలకు పథకాలు మంజూరు చేసేవారు కాదని.. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం 28,682 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.83.46 కోట్ల శ్రీనిధి రుణాలను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, జిల్లా పరిషత్ చైర్మన్ వి.వేణుగోపాలరావు, స్త్రీ నిధి ఎండీ నాంచారయ్య, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా
సాక్షి, అమరావతి: అమ్మవారిని కొలిచే నవరాత్రులు ప్రారంభమవుతున్న రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించడం దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూసి ఒక మాటిచ్చానని.. ఆ మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ ఆసరా పథకానికి మీ అందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నందుకు మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా ఉంది. స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ఆరంభం రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ఆరంభంరోజు అక్కచెల్లెమ్మల మధ్య #YSRAasara కార్యక్రమం ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి నేను మీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. 1/2 pic.twitter.com/mgoNDadg2C — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2021 పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి నేను మీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ ఆసరా ద్వారా 7.97 లక్షల పొదుపు సంఘాల ఖాతాలకు రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని’ అందులో పేర్కొన్నారు. -
మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో అన్ని వ్యాపారాలను మహిళా సంఘాలే నిర్వహిం చేలా, ఆర్థిక పరిపుష్టిని సాధించేలా కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిల్లో వివిధ ప్రైవేట్ వ్యాపారులు, ఇతరులు నిర్వహించే పరిశ్రమలన్నీ మహిళా సంఘాలే నిర్వహించేలా ఈ వ్యవస్థ బలోపేతం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ కోరిక అని పేర్కొన్నారు. కల్తీలను నిరోధించేందుకు ఆయా వ్యాపారాలన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా చేయించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకైనా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పీఆర్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమి బసు, ఎస్ఎల్డీసీ చైర్మన్ ఓంప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ మేనేజర్ శంకర్, నాబార్డ్ సీజీఎం విజయ్‌కుమార్‌లతో కలిసి 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ. 6,584 కోట్లకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ అందించేందుకు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా మంత్రి రుణ ప్రణాళిక లక్ష్యాలను వివరించడంతోపాటు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. రుణ లక్ష్యాలకు మించి తమ ప్రభుత్వం సంఘాలకు కార్యక్రమాలు ఇస్తుందని, అందువల్ల అంతకు మించి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సహకరించాలని కోరా రు. ప్రతి గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయబోతోందన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌ను నియమిస్తున్నట్టు, సంఘాల్లోని ప్రతి మహిళ ఏయే కార్యకలాపాలు చేపడుతుందో తెలుసుకోవడంతో పాటు ప్రతి ఇంటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయా రు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, తదితర అంశాలను గురించి సీఈవో పౌసమి బసు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ, సహకారాలను అందిస్తామని ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా వెల్లడించారు. సంఘం లోని ఒక్కో మహిళకు ఇచ్చే రుణాల్లో రూ. 25 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయరా దని ఆర్బీఐ నిర్దేశించిందని ఆర్బీఐ మేనేజర్ శంకర్ తెలిపారు. కొన్ని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీలు తగ్గించాలని కోరినపుడు ఆయనపై విధంగా స్పందించారు. 1992లో 500 గ్రూపులతో మొదలైన స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 లక్షల గ్రూపులకు విస్తరించిందని నాబార్డ్ సీజీఎం విజయ్‌కుమార్ తెలిపారు. -
ఏ సభకైనా రావాల్సిందే!
అధికార, అనధికార సభలకు రావాలని డ్వాక్రా సంఘాలకు టీడీపీ హుకుం రాకుంటే రుణ సాయం ఉండదని హెచ్చరిక బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ బెదిరింపులు దిక్కుతోచని స్థితిలో మహిళా సంఘాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మెప్మా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు టీడీపీ సభలకు హాజరు కావాలని డ్వాక్రా సంఘాలకు హుకుం జారీచేస్తున్నారు. సభలకు రాని సంఘాలు, సభ్యులను గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగక రుణసాయాన్నీ ఆపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తీవ్ర వ్యయప్రయాస లకోర్చి మహిళలు టీడీపీ సభలకు తరలిరావాల్సి వస్తోంది. తిరుపతి, తుడా: జిల్లాలో 12 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1.3 లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. తిరుపతిలో 3,850 డ్వాక్రా సంఘాల్లో 39 వేల మంది ఉన్నారు. అభ్యుదయ, స్పందన గ్రూపు లీడర్లు వీరిని లీడ్ చేస్తున్నారు. ఏదైనా సభ జరిగితే ప్రజలు రాకపోయినా వీరు వస్తే చాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అనధికారికంగా వీరిపై ఒత్తిడి తీసుకొచ్చి సభలకు రావాలని ఇబ్బందులు పెడుతున్నారు. రానివారిని సంఘం నుంచి తప్పిస్తామని, 10 మందితో కూడిన సంఘంలో ఒకరిద్దరు రాకపోయినా ఆ సంఘానికి ఇబ్బం దులు తప్పవనే హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ మెప్పుకోసం కొంత మంది లీడర్లు సభ్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. సంఘాల ఏర్పాటు ఉద్దేశమిది? మహిళలు ఆర్థికంగా ఎదిగి, సొంతంగా వ్యాపారాలు చేసుకుని, అవసరాలకు రుణ సాయం అందిచేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాల మంజూరు సభలు, సభ్యుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసే సమావేశాలు, స్వయం ఉపాధి అవగాహన, రుణ సద్వినియోగం వంటి సమావేశాలకు సభ్యు లు హాజరుకావాలి. వీటికి మినహా మరే సభలకు పిలవకూడదు. ఎప్పుడూ లేని విధంగా అధికారి పార్టీ నేతలు ప్రతి కార్యక్రమానికీ వీరిపైనే ఆధారపడుతున్నారు. ఒత్తిడి.. హెచ్చరికలు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలతో పాటు టీడీపీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ డ్వాక్రా సంఘాల సభ్యులు హాజరుకావాలని ఒత్తిడి తెస్తున్నారు. సమావేశాలకు, సభలకు రానిపక్షంలో అలాంటి సంఘాల సభ్యులకు రుణ సాయం ఉండదని సంఘాల లీడర్ల చేత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లీడర్లూ మెప్పు పొందేందుకు సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఖర్చులకు వెనకాడి.. ప్రభుత్వం, టీడీపీ నాయకులు నిర్వహించే సభలకు ప్రజలను తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రాకపోకలకు, భోజనం, ఇతర ఖర్చులు ఉంటా రుు. ఇవన్నీ భరించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో అధికారి పార్టీ నేత లు డ్వాక్రా సంఘాలపై దృష్టి సారించా రు. జిల్లావ్యాప్తంగా 1.3 లక్షల మందిలో కనీసం సభ జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల మండలాల నుంచి 5-10 వేల మంది వచ్చినా సభ విజవంతమవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాదితోపాటు గత ఏడాది అంతకుముందు జరి గిన సీఎం సభలకు అత్యధికంగా సంఘాల సభ్యులనే తరలించి సఫలీకృతులయ్యారు. నొక్కేస్తున్న సంఘాల లీడర్లు సభలకు, సమావేశాలకు సభ్యులను తీసుకురావడానికి అధికార పార్టీ నేతల నుంచి సంఘాల లీడర్లు లెక్క నొక్కేస్తున్నారు. రాను పోను ఖర్చులు, భోజనం తో పాటు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.500 వరకు సభను బట్టి సభ్యులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని లీడర్లే బొక్కేస్తున్నట్టు సమాచారం. పనులు వదులుకుని.. పస్తులుంటూ డ్వాక్రా సంఘాల్లో రోజూ కూలీనాలీ చేసుకుని బతికేవారే ఎక్కువ. మరి కొందరు ఏదో చిన్నపనులు చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి. ఇలాంటి వారిని సభలు, సమావేశాలకు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. సభలు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో తెలియక వంటలు వండలేక, పిల్లలకు భోజనం పెట్టలేక సభలకు రాలేమని చెప్పలేక మహిళలు మదనపడుతున్నారు. డ్వాక్రా అధికారులపై ఒత్తిళ్లు డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తుడులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన ఓ సభకు వెయి మందిని తీసుకురావాలని ఓ మంత్రి, ఓ ఉన్నతాధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. సంఘాల లీడర్లతో సమావేశమై ఒక్కో సంఘం నుంచి 500 మందికి తగ్గకుండా సభ్యులను సభకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు. వారు సభ్యులపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి సభకు రావాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించి సభకు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో జరిగే ప్రతి సభలోనూ ఇదే ఇదే తంతు. -
ఇసుకాసురులు
ర్యాంపుల్లో భారీగా లారీలు, ట్రాక్టర్లు రాత్రి వేళల్లో నాటు బళ్లు లెక్క, పత్రం లేని ఇసుక రవాణా అధికారపార్టీ నాయకుల అండతోనే నిర్వహణ రూ. 9వేల విలువైన ఇసుక మార్కెట్ ధర రూ.25 నుంచి రూ.40వేలు అధికారం అండతో ఇసుకాసురులు రెచ్చిపోతు న్నారు. అధికారుల కళ్లుగప్పి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధన లకు పాతర వేసి అడ్డంగా తవ్వేస్తున్నారు. పేరుకే మహిళా సంఘాలకు కేటాయించినా పెత్తనం అంతా అధికారపార్టీ నాయకులదే. జిల్లాలో గతంలో 26చోట్ల ఇసుక తవ్వకాలకు రీచ్‌లు కేటాయించినప్పటికీ ప్రస్తుతం 9చోట్ల రేవులు నడుస్తున్నాయి. పర్లాం, పొన్నాడ, మబగాం, గోపాలపెంట, చేనులవలస, కిల్లిపాలెం, హయాతినగరం, సింగూరు, ముద్దాడపేట ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు నడుస్తున్నా అన్నింటా అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. శ్రీకాకుళం : జిల్లాలో ఇసుక రీచ్‌లు అక్రమాలకు వేదికలువుతున్నాయి. అధికార పార్టీ అండతో తమ్ముళ్లే సొమ్ము చేసుకుంటున్నా రు. రేవులో 10నుంచి 12మంది మహిళలు నిర్వహించా ల్సి ఉండగా ఐదుగురు, ఆరుగురు కంటే మహిళలు ఉండడం లేదు. ఇసుక అమ్మకాలపై వారికి అందాల్సిన కమీషన్‌నూ బొక్కేస్తున్నారు. ప్రతీ రీచ్‌లోనూ అధికారపార్టీ నాయకుల అనుచరులతోపాటు మెప్మా, డీఆర్డీఏ సిబ్బంది ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కొలమానం ఎక్కడ? కొనుగోలు దారులు తమకు కావాల్సిన పరిమాణం మేర కు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.500చొప్పున మీసేవ సెంటర్లో డబ్బు చెల్లించి రశీదు తీసుకువచ్చి ఇస్తే కొల త లు తీసి లెక్క ప్రకారం ఇసుక ఇవ్వాలి. ఇక్కడే అక్రమా లు చోటు చేసుకుంటున్నాయి. డీడీకి సరిపడా ఇసు క కంటే అదనంగా ఇస్తూ వాహనదారులనుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నా రు. ఒక్కో రేవులో రోజుకు కనీసం 70 ట్రాక్టర్ల ఇసుక (ఒక్కో ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది) రవా ణా అవుతోంది. అంతే కాకుండా ఒక్కో వాహనం నుంచీ కనీసం రూ.300లకు తక్కువ లేకుండా నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. చాలాచోట్ల నాయకులే వాహనా లు తెప్పించి బినామీల పేరిట డీడీలు తీయిం చి విశాఖకు తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 18నుంచి 21క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఒకలారీ ఇసుక 10 నుంచి 12 ట్రాక్టర్లకు సమానం. వాహనాలను కేటగిరీగా బి భజించి ఓ కోడ్ కేటాయిస్తున్నారు. ఫలానా వాహనం వచ్చిందంటే చాలు డీడీ తీసుకొని లెక్క కంటే ఎక్కువగానే ఇసుకను ఇచ్చేస్తున్నారు. లారీల్లో ఇసుకపై అనుమానం వస్తే వే బ్రిడ్జి ద్వారా తూయించాలి. అదే విధంగా తోపుడుబళ్లు, నాటుబళ్లపై ఇసుక రవాణా నిషిద్ధం. దీనివల్ల బళ్లయజమానుల జీవనోపాధి దెబ్బతింటోందని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులకు ఇప్పుడు డబ్బు కురిపించే ఆయుధంగా మారింది. ప్రభుత్వం తోపుడు, నాటు బళ్లకు అనుమతి ఇవ్వకున్నా రాత్రి వేళల్లో వీటిపై భారీగా రవాణా చేస్తున్నారు. వాటినుంచి అనధికారికంగా ఆశీలు వసూలు చేస్తున్నారు. లారీ ఇసుకకు కేవలం రూ.9వేలు చెల్లిస్తే ఆ ఇసుక మార్కెట్లో రూ.30నుంచి 40వేల వరకు అమ్ముడవుతోంది. మధ్యలో ఎవరైనా ఆపితే రూ.500నుంచి రూ.1000లంచం ఇస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500. క్వారీ లారీ ఇసుక ధర రూ.4750. ఇవన్నీ ప్రభుత్వ ధరలే. అయితే మార్కెట్లో డిమాండ్ బట్టీ ఇసుకను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యార్డులు నిర్మించి నిల్వ చేస్తున్నా అధికార పార్టీ నాయకుల అండదండలుండడంతో అధికారులు కిమ్మనడంలేదు. బల్క్ పేరిట వాహనాల రద్దీ ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు బల్క్ ఆర్డర్ వస్తోంది. వీటికి కలెక్టర్ అనుమతి తప్పనిసరి. కానీ పొరుగు జిల్లాలకు చెందిన బిల్డర్లు, అధికంగా వాహనాలున్న వ్యక్తులూ ఇతరుల పేరిట డీడీలు తీసి బయట ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. ఇందుకు అన్ని స్థాయిల్లోనూ కమీషన్లు వెళ్తుంటాయి. ఇవేవీ కలెక్టర్ దృష్టికి వెళ్లడంలేదు. మహిళా సంఘాల సభ్యులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరుగంటలవరకే విధుల్లో ఉంటారు. మిగతా సమయాల్లో బినామీలే రాజ్యమేలుతున్నారు. ఇలా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 9రీచ్‌ల ద్వారా ఒక్క నెలలోనే రూ.25కోట్లు చేతులు మారాయన్న విషయం అధికారులకూ తెలుసు. హయాతినగరంలో గత నెల 16న ప్రారంభమైన రేవు పేరుకు శ్రీమహలక్ష్మి మహిళా సంఘానిదే అయినా దీని వెనుక జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు మేనల్లుడు దాసునాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆమె అనుచరులు గుమ్మానాగరాజు తదితరులు, ఆమె పీఏ, ఎంపీ రామ్మోహన్నాయుడు అనుచరులు పెత్తనం వహిస్తున్నారు. -
రూ.1,050 కోట్లతో స్త్రీ ‘నిధి’
ఆమోదం తెలిపిన స్త్రీనిధి బ్యాంకు పాలకమండలి బినామీ రుణాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం జీవనోపాధి ప్రాజెక్టులకు అధికంగా రుణాలివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణ రుణాల కింద రూ.1,050 కోట్లు అందించాలని స్త్రీనిధి బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళిక (క్రెడిట్ ప్లాన్)కు బ్యాంకు పాలకమండలి ఆమోదం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో క్రెడిట్ ప్లాన్ అమలుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రుణ ప్రణాళికలో రూ.950 కోట్లు సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు, రూ.100 కోట్లు మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. జీవనోపాధికి అధిక ప్రాధాన్యం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు తక్షణ అవసరాల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా రుణం పొందే వీలుంది. ఒక్కో మహిళా సంఘం రూ.25 వేల వరకు రుణం పొందవచ్చు. జీవనోపాధి కోసం రూ.25 వేలకుపైగా రుణాలను అందిస్తారు. గ్రామ సమాఖ్యల పనితీరును బట్టి రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించారు. పనితీరు బాగున్న సమాఖ్యలకు రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఒక్కో సంఘం రుణం పొందేందుకు ఆరుగురు మహిళలకు మాత్రమే ఉన్న పరిమితిని తాజాగా తొమ్మిది మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహాలు, సూచనలను స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతేడాది రుణ ప్రణాళిక రూ.753 కోట్లలో రూ.705 కోట్లు రుణాలుగా అందించామని, 99 శాతం రికవరీ కూడా జరిగిందని స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాలకమండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 1.62 లక్షల సంఘాలకు చెందిన 7.71 లక్షల మంది మహిళలకు రుణాలను అందించామని వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి, మెప్మా డెరైక్టర్ జనార్ధ్దన్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల, జిల్లా సమాఖ్యల డెరైక్టర్లు పాల్గొన్నారు. రుణ మంజూరులో బయోమెట్రిక్ బినామీలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ద్వారా మహిళలకు రుణాల మంజూరు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 50 మండలాల్లో బయోమెట్రిక్ బేస్డ్ లెండింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లోని 2,784 గ్రామాల్లో ‘వన్ స్టాప్ షాప్’లను స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో ఒకేచోట అన్ని రకాల (ఈ సేవ, మీ సేవల్లో లభించే సేవలు, ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తులు, ఫిర్యాదులు, ఉపాధి వేతన చెల్లిం పులు) సేవలు అందించడమే వన్ స్టాప్ షాప్ ఉద్దేశం. -
బాబూ.. ఇదేం న్యాయం!
సాక్షి, కడప : ప్రభుత్వానికి ఏ రూపంలో ఆదాయం వచ్చినా విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. అది ఇంటి పన్నైనా...నీటి పన్నైనా.. ఇసుక, ఎర్రచందనం, తదితర వాటి ద్వారా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం చివరకు మహిళా సంఘాలను సైతం వదిలిపెట్టలేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం మాఫీ మాటను మరిచిపోయి ఆదాయంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు మరింత మేలు చేస్తానని పేర్కొన్న బాబు... కనీసం రూ. 10 వేలు రుణమాఫీ కూడా చేయకపోగా డ్వాక్రా రుణాలపై సేవా పన్ను విధించేందుకు సిద్ధమవుతున్నారు. డ్వాక్రా బృందం తీసుకున్న మొత్తంలో ఒక శాతం చొప్పున సేవా పన్ను విధించేందుకు సిద్ధమవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేది బ్యాంకులు....చెల్లించేది గ్రూపులైతే పన్నులెందుకు? జిల్లాలో సుమారు 35 వేల పైచిలుకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ పేదరిక నిర్మూలన పథకంతోపాటు పట్టణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. వీటికి సంబంధించి వివిధ బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల రుణాలు మహిళలు తీసుకున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 3404 గ్రూపులకు గాను రూ.7942.58 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 30 వేల గ్రూపులకు గాను రెండేళ్లుగా దాదాపు రూ. 500 కోట్లు రుణాలు ఇచ్చినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే, రుణాలు ఇచ్చేది బ్యాంకులు...వాటిని సక్రమంగా చెల్లించేది మహిళా గ్రూపులైనప్పుడు సేవా పన్ను ఎందుకు చెల్లించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. సేవా పన్ను వసూలుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక జీఓను కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా సాధికారత సంస్థను ఏర్పాటు చేసి సేవా పన్నుల వసూలు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా మహిళలకు మాత్రం భారం తప్పదు. మహిళల్లో ఆగ్రహం.. అది చేస్తాం...ఇది చేస్తామంటూ ఇంతవరకు కాలం గడుపుతూ వచ్చిన ప్రభుత్వం తీరా డ్వాక్రా సంఘాలపై పన్నుల భారానికి తెర లేపడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయకున్నా ఫర్వాలేదు....ఇలాంటి భారం వద్దు మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పన్నులు కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆందోళనకు ఉపక్రమిస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వడ్డీ మీద వడ్డీలు కడుతున్నాం ఇప్పటికే వడ్డీల మీద వడ్డీలు కట్టి అల్లాడి పోతున్నాం. మళ్లీ సేవా పన్ను పేరుతో ఇదేం వడ్డింపు. ఇలా అయితే రుణాలు తీసుకొనేవారే ఉండరు. మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు మాటమార్చారు. మళ్లీ ఇలాచేస్తే నమ్మేవారే ఉండరు. రుణాలపై వడ్డీ భారంతో మహిళలు సతమతమవుతున్నారు. ఇప్పుడు పన్ను వసూలు చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. పంబ మేరి (నీలాపురం, మైదుకూరు) మండల సమాఖ్య అధ్యక్షురాలు -
న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట ధర్నా
తిరుపతి: న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డు వద్ద పద్మావతీనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. న్యాయం కోసం మూడేళ్ల కొడుకుతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే.. 2010లో భాస్కర్‌రాజు, రాధికలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే 5 నెలల కిందట భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ రాధిక ఆరోపిస్తోంది. తాను ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భైఠాయించింది. రాధికకు మద్దతుగా మహిళ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అవని(త)కి వందనం
ఘనంగా మహిళా దినోత్సవం సాక్షి, ముంబై: అమ్మ, అక్క, చెల్లి, భార్య.... ఇలా బాధ్యత ఏదైనా నూటికి నూరుపాళ్లూ న్యాయం చేయగల అపూర్వ వ్యక్తి మహిళ. అనధికారికంగా ఆమెను ప్రతిరోజూ పూజిస్తాం, ఆరాధిస్తాం. అధికారికంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. నగరంలోని పలు మహిళా సంఘాలు ఈ రోజును ఓ వేడుకలా జరుపుకున్నాయి. వడాలాలో...: వడాలా తెలుగు మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వడాల తెలుగు సంఘం హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా మండలి సీనియర్ సభ్యురాలు సవ్వుళ్ల బాలమ్మ పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విద్యారంగంలో మహిళలు మెరుగ్గా రాణించాలనీ, తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే జీవిత విలువలు నేర్పించాలని సూచించారు. గొంగిడి భాగ్య లక్ష్మి బృందం చిన్న పిల్లల గీతాలాపనతో మహిళా సభ్యులు ఉత్తేజం పొందారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షులు గొంగిడి మల్లేశ్వరి, కల్కూరి లక్ష్మి, గంగుల పద్మ, భీమ గోయిన సోమమ్మ, పులిచెర్ల చంద్రకళతోపాటు తెలుగు సంఘం అధ్యక్షుడు కార్యదర్శిరాములు కల్కూరి పాల్గొన్నారు. సైన్లో...: బెస్త గంగపుత్ర సంఘం (బీజీఎస్‌ఎం) మహిళా శాఖ ఆధ్వర్యంలో సైన్‌లోని శివాజీ నగర్ సొసైటి హాలులో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరప్‌లో 1907లోని మహిళలు తమ హక్కుల కోసం చేసిన కృషి ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని బీజీఎస్‌ఎం మహిళా శాఖ అధ్యక్షురాలు మంగెలిపెల్లి రేణుకదేవి వివరించారు. అనంతరం మహిళలు పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భివండీలో...: కోమల్ సమాచార్, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సావిత్రిమాయి ఫూలే వర్ధంతిని స్థానిక యువక మండలి హాలులో నిర్వహించారు. మహిళల కోసం సావిత్రి మాయి ఫూలే చేసిన కృషి ఎంతో గొప్పదని తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ సీహెచ్ గణేష్ ముదిరాజ్ కొనియాడారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. తె.వి.వి. భీవండీ శాఖ కన్వీనర్ కట్టా బ్రహ్మయ్యచారి మహిళలపై కవితలు చదివారు. అత్యాచారాల నివారణోపాయాలను కోమల్ సమాచార్ సంపాదకులు సిరిమల్లె శ్రీనివాస్ తెలియజేశారు. వాషిలో...: మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ‘స్వరమాధురి’ సంగీత సంస్థ వాషిలోని మరాఠీ సాహిత్య మందిర్‌లో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వరమాధురి ప్రత్యేక గీతంతో ఈ కార్యక్రమాన్ని భానుమతి శర్మ ప్రారంభించారు. అపూర్వ గజ్జెల, భావన సరిపల్లి, సరోమిత రాయ్, అదితి నేరుర్కర్, గిరిజ ద్విభాష్యం, భానుమతి, వసంత అలనాటి హిందీ, మరాఠీ, తెలుగు పాటలు, కొత్త పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాయనీమణులు, వాద్యకారులు , ఫోటోగ్రఫర్ ఇలా అందరూ మహిళలే కావడం విశేషంగా నిర్వాహకులు తెలిపారు. -
వసూలు సరే.. వడ్డింపులేవీ?
- మూడేళ్లుగా వడ్డీ రాయితీ విదల్చని సర్కారు - పేరుకుపోయిన రూ.49.74 కోట్ల బకాయిలు - ఆందోళనలో మహిళా సంఘాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయంసహాయక సంఘాలు సంకటంలో పడ్డాయి. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన వడ్డీ లేని రుణాల పథకం.. ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేశాయి. దీంతో జిల్లాలోని మహిళలు గత మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు లింకు రుణాలకు వడ్డీ చెల్లిస్తుండడంతో ఆర్థిక బలోపేతం సంగతేమో గాని అసలుకే ఎసరు వచ్చింది. జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు పొందిన బ్యాంకులకు గత మూడేళ్లకాలంలో రూ. 106.36 కోట్ల మేర వడ్డీ చెల్లించాయి. కానీ ఈ వడ్డీ మొత్తాన్ని సర్కారు రద్దు చేసి నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 56.59 కోట్లు చెల్లించి మమ అనిపించింది. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వడ్డీ నిధులు రాకపోవడంతో మహిళలు సొంతంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్పందించని సర్కారు.. జిల్లాలో 31,719 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 3.35లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి లింకు రుణాలందిస్తోంది. ఈ రుణాన్ని పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఈ రుణాలను ఏవిధమైన వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సంఘాలు సైతం మొగ్గుచూపాయి. దీంతో జిల్లాలో దాదాపు అన్ని సంఘాలు అర్హత ప్రకారం రుణాలు పొందాయి. అయితే రుణ చెల్లింపుల్లో భాగంగా సంఘాలు ముందుగా వడ్డీ డబ్బులు సైతం బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేసిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు వడ్డీ రూపంలో రూ.106.36 కోట్లు చెల్లించినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడేళ్లకు సంబంధించి కేవలం రూ. 56.59 కోట్లు మాత్రమే విడుదల చేసి మమ అనిపించింది. ఇంకా రూ. 49.74 కోట్లు రావాల్సి ఉండగా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. వడ్డీపై వడ్డీ.. లింకు రుణాలు పొందిన సంఘాల నుంచి బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూళ్లకు ఉపక్రమిస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ లేని రుణాలను ముందస్తుగా మంజూరు చేస్తే సంఘాల సభ్యులకు ఊరట లభించేంది. అదేవిధంగా తిరిగి చెల్లింపులు సైతం ఉత్సాహంతో చేసేవారు. కానీ రుణ మొత్తానికి సంబంధించి చెల్లింపులు వందశాతం పూర్తయిన తర్వాత వడ్డీ రాయితీ కల్పించడం సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం రాయితీ ప్రక్రియతో సంబంధం లేకుండా వడ్డీని కలిపి వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సరిగ్గా చెల్లింపులు చేయని సంఘాలపై వడ్డీ డబ్బులపైనా అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు. -
లక్ష్యం కష్టమే..
ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు రుణాలందక అల్లాడుతున్న మహిళా సంఘాలు బకాయిలు చెల్లిస్తేనే కొత్తరుణాలంటున్న బ్యాంకర్లు లక్ష్యం అధిగమించలేక చతికలపడిన యంత్రాంగం ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు అన్న చందంగా తయారైంది జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణలక్ష్యం తీరు. రుణమాఫీ మహిళాసంఘాలనే కాదు అధికారులను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. అప్పులుపుట్టక మహిళలు గగ్గోలు పెడుతుంటే లక్ష్యం చేరే పరిస్థితి లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొక పక్క కొండలా పేరుకు పోయిన బకాయిలు వసూలు కాక బ్యాంకర్లు ఇబ్బందులపాలవుతున్నారు. విశాఖపట్నం: పొదుపు ఉద్యమాన్ని రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. గద్దెనెక్కి ఎనిమిది నెలలైనా మాఫీకాదు కదా కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఊసెత్తకుండా కాలయాపన చేస్తు న్న ప్రభుత్వం.. ఏది ఏమైనా రుణలక్ష్యం చేరాలంటూ అధికారుల మెడపై కత్తి పెడుతోంది. వడ్డీలతో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలివ్వలేమని బ్యాంకర్లు తెగేసి చెబుతుండగా.. కనీసం కొత్త సంఘాలకైనా రుణాలివ్వాలంటూ వారి కాళ్లా వేళ్లాపడుతున్నారు అధికారులు. గ్రామీణ జిల్లాలోని 44,211 సంఘాల్లో 5,08,782 మంది సభ్యులున్నారు. వీటిలో 21,386సంఘాలకు రూ.641.42కోట్లుఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 5వేల సంఘాలకు రూ.195కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.జీవీఎంసీపరిధిలోని 21,660 డ్వాక్రా సంఘాల్లో 2,30,656 మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్విశాఖలో 7468సంఘాలకు రూ.175.96కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వ రకు కేవలం 2045సంఘాలకు రూ.65 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లోని 2032 సంఘాల్లో 23వేల మంది సభ్యులున్నారు. ఈ రెండు మున్సిపాల్టీల్లో 732 సంఘాలకు రూ.19.05కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకుకేవలం 185 సంఘాలకు కేవలం రూ.6.36కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 32 శాతం మాత్రమే చేరుకోగలిగారు. గతంలో ఏటా నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవడమేకాదు.. లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అతికష్టమ్మీద రూ.270కోట్లకు మించి అప్పులివ్వలేని దుస్థితిలో బ్యాంకర్లు ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీపుణ్యమే పొదుపు సంఘాల నేటి దుస్థితికి కారణమని అధికారులే బాహాటంగా చెబుతున్నారు. వడ్డీ లేని రుణ పథకం కింద పొందే రాయితీతో పాటు పావలా వడ్డీ రాయితీని కూడాసంఘాలు కోల్పోయాయి. మరొక పక్క 14 శాతం వడ్డీతో బకాయిలు తడిసిమోపెడయ్యాయి. ఒక్కో సంఘానికి గడిచిన ఏడాదిలో వడ్డీయే 50 వేల వరకు పడినట్టుగా బ్యాంకర్లు చెబుతున్నారు. వడ్డీతో అసలు చెల్లించ లేక ఇంకా లక్షలాది సంఘాలు ప్రభుత్వ రుణమాఫీకోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. సంక్రాంతికి ప్రతీ మహిళకు రూ.10వేల చొప్పునసంఘానికి లక్ష చొప్పున జమ చేస్తామని గతేడాది విశాఖ పునరుద్ధరణ వేడుకల్లో చంద్రబాబు ప్రకటించిన హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. బ్యాంకర్లు ముఖం చాటేయడంతో వడ్డీలకు అప్పులు తె చ్చుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు. -
స్తూపంతో భర్తకు కనువిప్పు!
చౌటుప్పల్: సమాజంలో మరో మహిళ దారుణ హత్యకు గురి కావొద్దని, కిరాతకంగా హత్య చేసే వారికి ఇదో గుణపాఠం కావాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే భార్యను కడతేర్చిన భర్త వ్యవసాయ క్షే-తంలోనే ఆమె స్మారక స్థూపాన్ని నిర్మించి, ఆవిష్కరించారు. ఈ సంఘటన నల్లొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సరిగ్గా నెల రోజుల క్రితం గత జనవరి 4వ తేదీన చౌటుప్పల్ మండలం పంతంగిలో మిర్యాల శ్రీశైలం (28) తన భార్య పార్వతమ్మ (24)ను రోకలిబండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. న్యాయం కోసం మృతురాలి బంధువులు పోరాడారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. కిరాతకానికి ఒడిగట్టే భర్తలకు కనువిప్పు కలిగించాలని అప్పట్లోనే గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు నిర్ణయించారు. భర్త ఇంటి ఎదుటే భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సమాధి నిర్మించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో ఇంటి పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో ఆమె మృతికి స్మారకంగా స్తూపాన్ని నిర్మించి బుధవారం ఆవిష్కరించారు. మహిళలను హత్య చేసే కిరాతకులకు ఈ సంఘటన గుణపాఠం కావాలని నినదించారు. ఆ స్థలంలో ఆమె పేరుతో పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. -
‘నారా’జకీయంపై నారీభేరి
రుణ మాఫీ మాటెత్తని చంద్రబాబు మండిపడుతన్న మహిళా సంఘాలు ‘మహిళలంటే నాకెంతో అభిమానం. వారు వేసిన ఓట్లే నా గెలుపునకు కారణం. వారిని జీవితంలో మరిచిపోను. మహిళల కోసం ఏమైనా చేస్తాను’.. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, అధికార దండం అందుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పుకొన్న గొప్పలివి. ఆయన ప్రముఖంగా ప్రచారం చేసుకున్న డ్వాక్రా మహిళల రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అధికారం చేపట్టి ఆరు నెలలైనా హామీని అమలు చేయలేదు. చంద్రబాబు కప్పదాటు వైఖరిపై జిల్లాకు చెందిన 6 లక్షల 20 వేల మంది డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ఏలూరు (టూటౌన్) : డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే గ్రూపునకు రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తానని మాట మార్చారు. కనీసం ఆ హామీనైనా నిలబెట్టుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ ఎవరూ రుణాలు కట్టొద్దన్న బాబు బ్యాంకుల వల్ల డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా కనీసం పరిష్కరించలేకపోయారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును బ్యాంకు అధికారులు రుణం కింద జమ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 మండలాలు కలిపి 62 వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. దీనిలో 6 లక్షల 20 వేల మంది మహిళలున్నారు. వీరందరూ వివిధ బ్యాంకుల ద్వారా రూ.1163 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబె ట్టుకోవాలంటే జిల్లాలోని డ్వాక్రా గ్రూపులకు రూ.620 కోట్లు అవసరం. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిన నేపధ్యంలో మరో 6 నెలలు గడిచినా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అయ్యే అవకాశాల్లేవు. ఈ సందర్భంగా జిల్లాలోని కొందరు డ్వాక్రా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. అన్నీ అబద్దాలే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అబద్దాలు చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించారు. మేం పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారు. అదేమని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. తీసుకున్న రుణాలు కట్టొద్దా? అని ప్రశ్నిస్తున్నారు. - అంబటి ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ద్వారకాతిరుమల మాట తప్పిన బాబు డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పగానే నమ్మకంతో ఓట్లేశాం. ఆరు నెలలవుతున్నా మాఫీ కాలేదు. రుణాలు కట్టి తీరాలంటూ బ్యాంకు అధికారులు ఆదేశించటంతో కడుతున్నాం. చంద్రబాబు మాట తప్పారు. - పెద్దపులి సుధ, డ్వాక్రా మహిళ, చింతలపూడి పస్తులుండి చెల్లిస్తున్నాం చంద్రబాబు హామీని న మ్మి డ్వాక్రా రుణాన్ని సకాలంలో చెల్లించలేదు. వాయిదాలు మీరడంతో బ్యాంక్ అధికారులు ము క్కుపిండి వసూలు చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో చెల్లించలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన మోసంతో పస్తులుండి చెల్లించాల్సి వస్తోంది. - గంటా రమణ, ఆర్జావారిగూడెం, భీమడోలు, డ్వాక్రా సంఘం నాయకురాలు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏడాదిగా 500కు పైగా సంఘాలకు డ్వాక్రా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్తే డ్వాక్రాసంఘాల మహిళలకు రుణం లభించకపోగా, అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరో ఏడాది రుణం చెల్లించకపోతే వడ్డీలు అసలును మించిపోతాయి. - వనమా భాగ్యలక్ష్మి, మండల మహిళా సమాఖ్య సభ్యురాలు, కుక్కునూరు అప్పుల్లో మహిళా సంఘాలు డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ అసలు మించిపోయింది. రూ.3 లక్షలు తీసుకున్న సంఘాలకు రూ.లక్షకుపైగా బకాయిలున్నాయి. - బెజ్జంకి లక్ష్మి, వీఓ, రామసింగారం, కుక్కునూరు -
సంఘటితం చేస్తా
* మహిళా సంఘాలకు మెప్మా పీడీ సర్వేశ్వర్‌రెడ్డి భరోసా విఐపి రిపోర్టర్,విట్టా సర్వేశ్వరరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలు మొత్తం 21 వేలు ఉన్నాయి. దీంట్లో కేవలం పట్టణ ప్రాంతంలోనే 1626 సంఘాలు ఉన్నాయి. మండల పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత గ్రామీణ సంఘాలు కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోకి వచ్చాయి. అయితే గ్రామాలు విలీనం కాకముందు నల్లగొండ పట్టణంలో ఉన్న సంఘాలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. పావలా వడ్డీ రుణాలు, బుక్కీపింగ్, స్వయం ఉపాధి కల్పన వంటి అనేక సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతంలోని సంఘాల సమస్యలు, వారికి కావాల్సిన అవసరాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వారికి అందుతున్నాయా..? లేదా?. బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది నుంచి వారికి సహాయ,సహకారాలు అందుతున్నాయా..? లేదా ఇబ్బందులు ఏమైన పడుతున్నారా..? అనే విషయాలను తెలుసుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వరరెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారారు. నల్లగొండ పట్టణంలోని 34 వ వార్డులో సంఘాలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ పట్టణంలోని 34వ వార్డునుంచి సర్వేశ్వరెడ్డి వీఐపీ రిపోర్ట్. సర్వేశ్వర్‌రెడ్డి : అందరికీ నమస్కారం..? బాగున్నారా..? మహిళా సంఘాల సభ్యులు : నమస్కారం సార్..? బాగున్నాం. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాలు ఏవిధంగా పనిచేస్తున్నాయ్..? మహిళలు : సంఘాల నిర్వహణ బేషుగ్గానే ఉంది. సభ్యులందరం కలిసిగట్టుగానే పనిచేస్తున్నాం. (అందులో లక్ష్మి అనే సభ్యురాలి దగ్గరికి వెళ్లి మాట్లాడారు.) సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో ఎప్పటినుంచి సభ్యురాలిగా ఉన్నారు..? లక్ష్మి : 14 సంవత్సరాల నుంచి సంఘంలో కొనసాగుతున్నాను. గతంలో రూరల్ సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు అర్బన్‌లో మారాను. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో చేరిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు..? లక్ష్మి : మా సంఘంలో సభ్యులు తలోపని చేసుకుంటున్నాం. సభ్యులందరు స్వయం ఉపాధి పొందుతున్నారు. (అక్కడే ఉన్న మరో సభ్యురాలు సరస్వతితో మాట్లాడారు) సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంక ర్ల నుంచి, మెప్మా సిబ్బంది నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా...? సరస్వతి : బ్యాంకులు దశలవారీగా రుణాలు ఇస్తున్నారు. మెప్మా నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. సర్వేశ్వర్‌రెడ్డి : మీ సంఘం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంది? సరస్వతి : మా సంఘం ‘ఏ’గ్రేడ్‌లో ఉంది. పుస్తకాల నిర్వహణ, కంప్యూటర్ శిక్షణ పొందుతున్నాం. బుక్కీపింగ్ ఏ విధంగా చేయాలనే దా నిపై శిక్షణలు తీసుకున్నాం. సభ్యులు తీసుకున్న రుణాలు కూడా తిరిగి చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. (అక్కడే ఉన్న మరో మహిళా సభ్యురాలు రశీదను పలకరించారు) సర్వేశ్వర్‌రెడ్డి : ముస్లిం మహిళలు సాధారణంగా బయటకు వచ్చి వ్యాపారులు చేసేందుకు ఆసక్తి చూపరు..అలాంటిది సంఘాల ద్వారా ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు..? రశీద : మొదట్లో మేం చాలా పేదవాళ్లం. కానీ ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాం. ఇండ్లీ బండి, మటన్, చికెన్, పాల వ్యాపారం పెట్టుకుంటున్నాం. సంఘం ఏర్పడిన మొదట్లో రూ.30 వేలు మాత్రమే రుణం తీసుకున్నాం. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే స్థితికి మేం ఎదిగాం. సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంకర్లు లింకేజీలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి..? (ధనమ్మ అనే మహిళతో) ధనమ్మ : బ్యాంకర్ల నుంచి మొదట్లో ఇబ్బంది ఉంది. వార్డుల వారీగా సంఘాలు విభజన జరిగిన తర్వాత నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరిస్తున్నారు. సర్వేశ్వర్‌రెడ్డి : మెప్మా నుంచి అమలవుతున్న పథకాలు మీకు ఏవిధంగా ఉపయోగపతున్నాయి...? (మరో మహిళ యాదమ్మతో) యాదమ్మ : జనశ్రీయోజన బీమా మా కుటుంబాన్ని కాపాడింది. మాకుటుంబంలో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా పథకం నుంచి రూ.30 వేలు సాయం పొందాం. (గుంపులో ఉన్న మరో మహిళ దగ్గరికి వెళ్లారు. విజయారాణి అనే మహిళను పలకరిస్తూ..) సర్వేశ్వర్‌రెడ్డి : మగవాళ్ల దాడుల నుంచి మహిళలను కాపాడేందుకు ఏమైన కమిటీలు ఏర్పాటు చేశారా..? విజయారాణి : టీవీల్లో చూస్తున్నాం. అలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తే మంచిది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలి. మా సమస్యలపై అక్కడ చర్చించుకుని పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే బాగుటుంది. సర్వేశ్వర్‌రెడ్డి : త్వరలో సోషల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. దానిపై మీ స్పందన..? (మహిళలందరినీ కలిపి) మహిళలు : కమిటీలో మహిళలు సభ్యులుగా ఉండాలి. మగవాళ్ల దాడుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన రక్షణ చర్యలను పోలీస్ శాఖ కల్పిస్తే బాగుంటుంది. నాటుసారాకు అలవాటు పడి 60 ఏళ్లు బతకాల్సిన మగవాళ్లు 40 ఏళ్లకే చనిపోతున్నారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి. సర్వేశ్వర్‌రెడ్డి : అంగన్ వాడీ కేంద్రాలకు శనగపప్పు, కందిపప్పు సప్లయ్ చేశారు కదా..? సంఘాలకు ఏమైన ప్రయోజనం కలిగిందా..? మహిళలు : అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల మాకు కొంతమేర కమీషన్ వచ్చింది. అన్ని పట్టణాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. వాటిన్నింటికీ ప్రయోజనం కలిగేలా అంగన్వాడీ కేంద్రాలతో పాటు, హాస్టల్స్‌కు సరఫరా చేసే నిత్యావసరాలు, విద్యార్థులకు దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని కూడా పట్టణ సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. తద్వారా మేం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. సర్వేశ్వర్‌రెడ్డి : స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పిస్తే నేర్చుకుంటారా..? మహిళలు : సంఘాల్లో చదువుకున్న సభ్యులు ఉన్నారు. వారికి సెల్‌ఫోన్ రిపేరింగ్, అల్లికలు, టైలరింగ్, పూల అలంకరణ వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తే నేర్చుకుంటారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే స్వయంగా ఉపాధి పొందుతాం. సర్వేశ్వర్‌రెడ్డి : గతంలో సంఘాలకు సీఐఎఫ్ రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. వాటిని సక్రమంగా వినియోగంచుకోలేదని ఫిర్యాదులొచ్చాయి..? మహిళలు : సీఐఎఫ్ ఫండ్‌ను సంఘాలు వివిధ అవసరాలకు ఉపయోగించుకున్నారు. సంఘాలకు తిరిగి చెల్లించడంతోపాటు వాటిని రుణాల రూపంలో మిగతావాటికి అందజేస్తున్నాం. మెప్మా పీడీ హామీలు.. * నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు ఒక్కటే పట్టణ సమైక్య ఉంది. కొత్తగా మరో సమైక్యను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. * పట్టణాల్లో సంఘాలను విస్తరింపజేస్తాం. * సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణలు, ఉపాధి కల్పనకు కృషి. * పట్టణాల్లో వీధి వ్యాపారులకు చేయూత. * సంఘాలకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీ, ఉపకారవేతనాలు వీలైనంత త్వరలో విడుదల. * జాతీయ జీవనోపాధుల మిషన్ కింద నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాల్టీలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. -
ఇసుక రవాణా బాధ్యత మహిళా సంఘాలదే
శ్రీకాకుళం: మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ల నుంచి నిర్వాహకులే స్వయంగా వాహనాలను సమకూర్చి వినియోగదారులకు ఇసుక చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్ కృష్ణారావు తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇసుకరీచ్‌ల వద్ద రవాణా శాఖ భాగస్వామ్యంతో నిర్వాహకులు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ వాహనాల ద్వారా వినియోగదారుల గృహాల వద్దకే ఇసుక చేర్చాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగరాదని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఇసుకతో సహా రవాణా చార్జీలను ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంకుల్లో చలానా ద్వారా చెల్లించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమంగా ఇసుక రవాణా జరగరాదని, అందుకు రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కొత్త రీచ్‌లను గుర్తించడంలో జాప్యం చేయరాదన్నారు. జిల్లాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు తదితర సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జె.వి. రాముడు మాట్లాడుతూ పోలీస్‌శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండి ఇసుక అక్రమ రవాణా జరగకుండానివారించాలన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 40 కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించామని, వాటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. వినియోగదారులకు ప్రభుత్వం నుంచే రవాణా సౌకర్యం కల్పించేందుకు ఇప్పటి వరకు 562 వాహనాలను నమోదు చేశామని, కొద్ది రోజుల్లో అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఎస్‌ఎస్‌ఖాన్, జేసీ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఏజేసీ పి. రజనీకాంతారావు, డీఆర్డీఏ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా
కమీషన్ ఇవ్వాలని బెదిరింపులు కమిటీల్లో తమ వారినే నియమించాలని హుకుం కుదరదన్న కార్యదర్శిపై దౌర్జన్యం, సెలవుపై పంపేందుకు చర్యలు అర్ధాంతరంగా అమ్మకాలు నిలిపేస్తున్నమహిళా సంఘాలు చిత్తూరు (అగ్రికల్చర్) : అక్రమ రవాణా అరికట్టేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఇసుక అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అరుుతే తెలుగు తమ్ముళ్లే అందుకు విరుద్ధంగా ఇసుక దందాలకు పాల్పడుతున్నారు. రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలంటే తమకు కమీషన్ ఇవ్వాలని, రీచ్‌ల వద్ద మహిళా కమిటీల్లో తాము చెప్పిన వారినే నియమించాలని, లేదంటే అంతు చూస్తామంటూ అధికారులపై దౌర్జన్యాలకు పూనుకుంటున్నారు. సెలవుపై వెళ్లాలని కూడా అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ఇటు అధికారులు, అటు రీచ్ కమిటీల్లోని సంఘాల మహిళలు భయభ్రాంతులకు గురై ఇసుక అమ్మకాలను అర్ధాంతరంగా నిలిపేస్తున్నారు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తరలింపును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల చేత ఇసుక తరలింపును చేపట్టేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాపం్తంగా అనువుగా ఉన్న 39 ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. అందులో 19 రీచ్‌లలో ఇసుక తరలింపునకు డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో కమిటీలను డీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఇసుక తరలింపు పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రారంభించి వారాలు కూడా గడవకనే పలుచోట్ల ఇసుక రవాణా పనులను మహిళలు నిలిపేస్తున్నారు. ఇప్పటికే 5 ప్రదేశాల్లో నిలిపి వేయడంతో 14 రీచ్‌ల్లోనే ఇసుక అమ్మకాలు, రవాణా సాగుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల బెదిరింపులే కారణం మహిళా సంఘాల ద్వారా ఇసుక తరలింపు అర్ధాంతరంగా నిలిచిపోవడానికి అధికార చెందిన తెలుగు తమ్ముళ్ల బెదిరింపులే కారణమనేది స్పష్టమవుతోంది. చిత్తూరు రూరల్ మండలం ఆనగల్లు వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌కు ఆ గ్రామానికి చెందిన కొందరి సొంత స్థలాల్లో ట్రాక్టర్లు వె ళ్లాలి. అందుకుగాను తెలుగు తమ్ముళ్లకు ప్రతి ట్రిప్పునకు రూ. 200 మేరకు కమీషన్ ఇవ్వాలి. వారు సూచించిన ట్రాక్టర్లకు మాత్రమే ఇసుక తరలింపునకు అవకాశం కల్పించాలి. ఇసుక తవ్వకంలో వాల్టాకు విరుద్ధంగా 3 మీటర్లలోతు వరకు తవ్వుకునేందుకు అవకాశం కల్పించాలని బెదిరించారు. డీఆర్డీఏ అధికారులు రీచ్ వద్దకు వంకలోనే ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్నారు. అయితే ప్రత్యేక దారిలో వెళ్లినా తమకు కమీషన్‌ను ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీనిపై గ్రామ కార్యదర్శి సమ్మతించక పోవడంతో, అతనిపై తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యాలకు దిగడమే కాకుండా, కార్యదర్శిని దీర్ఘకాల సెలవుపై పంపిచేందుకు ఎంపీడీవో ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడ ఇసుక రవాణాను చేపట్టలేక నిలిపేశారు. గంగాధరనెల్లూరు మండలం గారంపల్లి రీచ్ వద్ద ఇసుక తరలింపునకు మహిళా కమిటీల్లో తాము సూచించిన వారినే ఏర్పాటు చేయాలని ఆ గ్రామ తెలుగు తమ్ముళ్లు అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు అక్కడ కమిటీలను ఏర్పాటుచేయలేక ఇసుక రవాణాను చేపట్టలేక అర్ధాంతరంగా నిలిపేశారు. వాల్మీకిపురం మండలంలో కూడా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని ట్రిప్పునకు రూ. 100 కమీషన్ వసూలు చేస్తుండడంతో అక్కడి రీచ్‌లకు చెందిన కమిటీల్లోని మహిళలు కూడా ఇసుక తరలింపు చేపట్టలేమని అధికారులకు తెలిపారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల రీచ్‌లలో నెలకొనడంతో డీఆర్డీఏ అధికారులు ఇసుక తరలింపునకు కమిటీలను కూడా వేయలేక తలలు పట్టుకుంటున్నారు. -
మహిళలకు కేసీఆర్ చేసింది శూన్యం
దుబ్బాక రూరల్ : మహిళా సంఘాలు, వీఓఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది శూన్యమని ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తలపాక కిష్టయ్య అన్నారు. పెండింగ్ వేతనాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండల గ్రామాల వీఓఏలు, మహిళా సంఘాలు సీఐటీ యూ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని హబ్షీపూర్ చౌరస్తాలోని సిద్దిపేట - రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక వారికి రిక్త హస్తం ఇచ్చారని ఆరోపించారు. మిహళా సమాఖ్యలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దీంతో మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. వీఓఏలకు నెలకు రూ. 2000లు అందజేస్తామని గత ప్రభుత్వం జీఓ జారీ చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీఓఏలకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించి డిమాండ్ చేశారు. సీఐటీయూ దుబ్బాక డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ భాస్కర్ మాట్లాడుతూ వీఓఏల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తీర్చాలన్నారు. దుబ్బాక పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, మహేష్, జమున, లక్ష్మణ్, సత్తిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించాలి జోగిపేట : ఐకేపీ వీఏఓల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహిళలు గురువారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ, మానవహారం, రాస్తారోకోలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలోని శిబిరం నుంచి వందల సంఖ్యలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద మానవహారాన్ని నిర్వహించిన అనంతరం అరగంట పాటు జాతీయ రహదారిపై బైఠాయించారు. పీ మొగులయ్య మాట్లాడుతూ వీఓఏలకు రావాల్సిన 18 నెలల వేతనాలు చెల్లించాలని, వేతనం రూ.5 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీలేని స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 12 నెలల పావలా వడ్డీలు ఇవ్వాలని అభయ హ స్తం పింఛన్ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేసారు. కార్యక్రమంలో అందోలు మండల వీఓఏల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం అశోక్, గొల్ల మల్లయ్య, నాయకులు అనుసూయ, అనిత, మానస, స్వప్న, అశోక్, సువర్ణ, అరేందర్, లక్ష్మయ్య, మల్లేశం, కిష్టయ్య, బాలయ్యలు పాల్గొన్నారు. -
అక్రమార్కులకు ఇసు‘కాసుల’ పంట
జిల్లాలో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. సామాన్యుల పేరు చెప్పి కాంట్రాక్టర్లు, అధికారబలం ఉన్న నేతలు రీచ్‌లపై పడి అడ్డంగా సొమ్ము చేసుకుంటున్నారు. వే బిల్లులు రాయడానికి, నిర్వహణకే స్వయం సహాయక సంఘాలు పరిమితమవుతున్నాయి. వారి ముసుగులో అధికారపార్టీ పెద్దలు పెత్తనం చెలాయిస్తున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ ఇసుకపై రోజు విడిచి రోజు సమావేశాలు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు లేదు. రాజమండ్రి నుంచి కోనసీమలోని సోంపల్లి వరకు ఏ రీచ్‌ను పరిశీలించినా అడ్డగోలు వ్యవహారమే సాక్షాత్కరిస్తోంది. * మహిళా సంఘాల పాత్ర నిమిత్తమాత్రమే * రీచ్‌లలో పెత్తనమంతా టీడీపీ నేతలదే * నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రవాణా * దండిగా సొమ్ములు దండుకుంటున్న వైనం * జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే దందా సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించడం ముందు అనుకున్నట్టే ఓ ప్రహసనంగా మారింది. రాజమండ్రి కుమారి టాకీస్ రీచ్ వద్ద అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్ బంధువు అన్నీ తానై మహిళా సంఘాలను ప్రేక్షకపాత్రకే పరిమితం చేశారు. ప్రభుత్వ పనులకోసం అంటూ బోర్డు పెట్టి ఇసుకను బిల్డర్లు, కాంట్రాక్టర్లకు తరలిస్తున్నారు. రీచ్‌ల్లోకి వ్యాన్లు, ట్రాక్టర్లకే అనుమతి ఉండగా 10 టైర్ల లారీలతో కూడా ఇసుక తరలిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకకు రూ.4,000 డీడీ తీసి రీచ్‌లో కొనుగోలుచేసి బయట మార్కెట్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అదే నాయకుడు స్థానికుల పేర్లతో డీడీలు తీసి పశ్చిమగోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలకు తరలించుకు పోతున్నారు. ఈ రీచ్ నుంచి సుమారు 200 లారీల ఇసుక రవాణా జరుపుతున్నారు. వీటిలో 30 లారీల ఇసుక ఒకటి, రెండు పర్మిట్లపై తరలిపోతుండగా, సుమారు 40 లారీల ఇసుక పర్మిట్ లేకుండానే తరలిపోతోంది. రాజోలు మండలం సోంపల్లి, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం రీచ్‌లు అక్రమాలకు చిరునామాగా మారాయి. ఈ రీచ్‌లలో 70 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారు. గత 20 రోజుల్లో సుమారు రూ.30 లక్షల మేర అక్రమార్కుల జేబుల్లోకి పోయింది. డ్వాక్రా సంఘాలు వే బిల్లు రాయకుండానే రీచ్‌లలో ట్రాక్టర్లకు లోడ్ చేసేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, స్థానిక సంస్థలకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి అక్రమార్కులు వాటాలు పంపేస్తున్నారు. సోంపల్లిలో వేబిల్లు ఒకటే ట్రిప్పులు ఐదారు అన్నట్టు ఇసుక తరలిపోతోంది. ఒక వే బిల్లు రాయించుకున్న ట్రాక్టరుతో రోజుకు 10 ట్రాక్టర్ల ఇసుక దొడ్డిదారిన తరలిస్తున్నారు. రాజోలు దీవి ఇసుక రీచ్‌లలో ప్రభుత్వానికి చెల్లించే రూ.2 వేల డీడీ కాక ట్రాక్టరు ఇసుకను లోడ్ చేశాక రూ.650 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ అధికారులకు తెలిసినా ఒత్తిళ్లతో మిన్నకుంటున్నారు. నదీగర్భంలోకి భారీ వాహనాలు.. ఇదే పరిస్థితి మందపల్లి, జొన్నాడ రీచ్‌లలో కనిపిస్తోంది. భారీ వాహనాలను నదీ గర్భంలోకి దింపి మరీ ఎగుమతి చేస్తున్నారు. నేతల కనుసన్నల్లోనే డ్వాక్రా సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేయడంతో వారు మాట్లాడలేకపోతున్నారు. క్వారీ లారీకి రెండు యూనిట్ల ఇసుక(ఆరు క్యూబిక్ మీటర్లు) మాత్రమే పడుతుంది. యూనిట్ రూ.2000 వంతున రెండు యూనిట్లకు రూ.4000 చెల్లించి వాహనాన్ని తీసుకువెళితే ఇసుక ఎగుమతి చేస్తున్నారు. క్వారీ లారీలో రవాణా 10 టన్నుల వరకు ఉంటుంది. అదే మార్కెట్ లారీ, 10 టైర్ల లారీ(పెద్ద టిప్పరు)లకి రవాణాశాఖ 17 టన్నుల పరిమితిని విధించింది. ఈ ర్యాంపుల్లో మార్కెట్ లారీలు, పెద్ద టిప్పర్లలో ఐదు యూనిట్ల ఇసుకను నింపుతున్నారు. అంటే ఒక లారీలో 30 టన్నుల సరుకు వెళుతోంది. కళ్లెదుటే ఈ తంతు జరుగుతున్నా కేసుల నమోదుకు వెనుకంజ వేయడంతో స్థానికులు విస్తుబోతున్నారు. అక్కమాలకు అధికారుల ఊతం మందపల్లి రీచ్‌పై కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రీచ్‌లో రోజుకు సుమారు 50 మార్కెట్ లారీల్లో ఇసుక ఎగుమతవుతోంది. నిబంధనలకు భిన్నంగా నిత్యం 650 టన్నుల ఇసుక తరలిపోతోందని అంచనా. లారీకి రూ.4 వేల చొప్పున రూ.2.60 లక్షలు ఈ ఒక్క రీచ్‌లోనే ప్రతి రోజు ఇసుక తరలిపోతోందని అంచనా. పాత వే బిల్లులతో ఇసుక తరలించుకుపోతుండగా శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో మరో కొత్త వేబిల్లు తీసుకువచ్చి పొరపాటున పాత బిల్లు ఇచ్చారని సమర్థించేందుకు ప్రయత్నించడం, ఇందుకు అధికారులు కూడా వత్తాసు పలకడాన్ని బట్టి వారు ఏ రకంగా అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోంది. జొన్నాడ రీచ్‌లో ఒక బిల్లుపై నాలుగైదు ట్రిప్పులు తరలించేస్తున్నారు.ఆ రీచ్‌లో 10 టైర్ల లారీల్లో రోజుకు 20 ట్రిప్పుల ఇసుక ఎగుమతి అవుతోంది. లారీకి రూ.10 వేల వంతున రోజుకు రూ.2 లక్షల విలువైన ఇసుక దొడ్డిదారిన మళ్లించేస్తున్నారని అంచనా. అనధికారికంగానే ర్యాంపుల నిర్వహణ గోదావరి పరీవాహక ప్రాంతమైన కె.గంగవరం మండలం మసకపల్లి, పెదలంక, కోటిపల్లి వద్ద కోట గ్రామాలను అనుకుని అనధికార ర్యాంపులను తెలుగుతమ్ముళ్లు నిర్వహిస్తున్నారు. మసకపల్లి, పెదలంకల పరిధిలో గోదావరి తీరంలో కె.గంగవరం మండ లానికి చెందిన అధికారపార్టీ స్థానిక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధి దగ్గరుండి రాత్రి వేళల్లో ఇసుక తరలించి సొమ్ములు దండుకుంటున్నారు. కోట వద్ద కూడా ఇదే పరిస్థితి. ఆ రెండు ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక రీచ్ అనేదే లేనప్పుడు రూ.70 వేలు వెచ్చించి రాకపోకలకు అనువుగా ర్యాంపు నిర్మించడం, ఇసుక నిల్వ కోసం గోదావరిని అనుకుని 10 ఎకరాల లంక భూములను లీజుకు తీసుకోవడాన్ని పరిశీలిస్తే ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. నది కడుపులోని ఇసుకతో ఇలా అక్రమార్కులు లాభాలు పిండుకోవడమేనా.. సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవడం అన్న ప్రశ్నకు సర్కారే సమాధానం చెప్పాలి. -
సమస్యలు హెవీ !
ప్రభుత్వ యంత్రాంగం ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ధాన్యం సేకరణకు పలు అడ్డంకులు ఎదురుకానున్నాయి. గత ఏడాది నుంచి కొత్త షావుకార్లుగా చెప్పుకుంటున్న పౌరసరఫరాల శాఖ సిబ్బంది ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ నిబంధనలు, చెల్లింపులకు సింగిల్ విండో విధానం లేకపోవడం, సిబ్బంది కొరత గుదిబండగా తయారయ్యాయి. మరో వైపు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని ఎగరేసుకుపోడానికి దళారులు కాపుకాసి ఉన్నారు. విజయనగరం కంటోన్మెంట్ : ఈ ఏడాది డ్వాక్రా మహిళా సంఘాలు, సహకార పరపతి సంఘాలతో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని 81 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా 61 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మరో 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా గ్రామాలు, వార్డులను ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నాట్లు ఆలస్యమైన కొన్ని చోట్ల మినహా దాదాపుగా సంతృప్తికరంగా ఉభాలు జరిగాయని భావిస్తున్నారు. దిగుబడిలో 30 శాతం సొంత అవసరాలకు పోగా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. సివిల్ సప్లైస్ డీటీలు, వ్యవసాయ శాఖ సిబ్బందిని కూడా నియమించి, వారికి బాధ్యతలను అప్పగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వారు ఉన్న నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలుకు అనుమతులిస్తారు. దీంతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సవాలక్ష నిబంధనలు ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. ధాన్యం కొనుగోలులో వ్యర్థపదార్థాలు ఒక శాతం, చెత్త, పొల్లు ఒక శాతం మాత్రమే ఉండాలి. అంత కన్నా ఎక్కువ ఉన్నట్టు తేలితే సంబంధిత ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఈ కారణంగా సిబ్బంది నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం ఐదు శాతం మించి ఉండకూడదు. పూర్తిగా తయారు కాని ధాన్యం మూడు శాతం మించి ఉండకూడదు. నాణ్యత లేని ధాన్యం ఇందులో కల్తీ అవకూడదు. అటువంటి ధాన్యం ఆరు శాతం మించి ఉండకూడదు. ముఖ్యంగా ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించి ఉండకూడదు. ఈ పరీక్షలన్నీ చేశాక అధికారులు ధాన్యం తీసుకుంటారు. దీని బదులు సాధారణ వ్యాపారులయితే ఇన్ని పరీక్షలు లేకుండా కొంచెం చేత్తో నలిపి బియ్యం రంగు చూసి కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాప్యం ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యానికి చెల్లింపులు వెంటవెంటనే జరుగవన్న అపవాదు ఉంది. నిబంధనల ప్రకారం కనీసం వారం రోజుల్లో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చెక్కుల రూపంలో చెల్లింపులు చేయడం వల్ల రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. ప్రైవేటు వ్యాపారులయితే వెంటనే డబ్బులు ఇస్తారని రైతులు చెబుతున్నారు. అడ్వాన్సులతో పొంచిఉన్న వ్యాపారులు, దళారులు మిల్లర్లు, వ్యాపారులతో పోటీ పడి ధాన్యాన్ని కొనుగోలు చేద్దామని పౌరసరఫరాల శాఖ అనుకుంటున్నప్పటికీ అది సాధ్యంకాని పనిలా కనిపిస్తోంది. ఇప్పటికే వ్యాపారులు, దళారులు... రైతులకు కొంత నగదును అడ్వాన్సుగా ఇచ్చి ఉన్నారు. అడ్వాన్సు తీసుకున్న రైతులు తప్పనిసరిగా ఆ వ్యాపారికే ధాన్యం విక్రయించాయి. దీంతో వ్యాపారులు తాము కొనాల్సిన ధాన్యాన్ని ముందుగానే రిజర్వు చేసుకున్నట్టవుతోంది. తాము ఎంత ధాన్యం కొనగలమో ప్రైవేటు వ్యాపారులు చెబుతుంటే, దానికి భిన్నంగా అధికారులు తాము ఎంత కొనుగోలు చేయగలమో తెలిపే పరిస్థితి లేదు. లక్ష్యం మాత్రం 80వేల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించుకున్నారు. సిబ్బంది కొరత జిల్లాలో ధాన్యం సేకరణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. గతంలో ఔట్సోర్సింగ్ నుంచి కొంతమందిని నియమించుకున్నారు. ఇప్పటివరకూ ఈ విషయంలో స్పష్టత లేదు. అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖలో మేనేజర్ పోస్టు ఇన్చార్జి అధికారి నిర్వహిస్తున్నారు. కేవలం ఇద్దరు సహాయ మేనేజర్లుండగా వారితో కొనుగోలు కార్యక్రమం నిర్వహిస్తారనుకుంటే ఆ ఇద్దరు మేనేజర్లకు బదిలీ చేశారు. వీరిద్దరి స్థానంలో ఇద్దరిని నియమించాల్సి ఉండగా కేవలం శ్రీకాకుళం నుంచి వరసయ్య అనే అధికారిని నియమించారు. మరో పక్క కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలకు సంబంధించి సిబ్బంది నియామకం పక్కాగా ఉండాలి. కానీ ఇవేమీ కనిపించే పరిస్థితి లేదు. కొనుగోలు చేస్తాం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఈ నెలాఖరు నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. జాయింట్‌కలెక్టర్ బి రామారావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపడతాం. -ఎం గణపతిరావు, ఇన్‌ఛార్జి మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ, విజయనగరం. -
మహిళల కన్నెర్ర
టాస్మాక్ మద్యం దుకాణాలపై మహిళా సంఘాలు కన్నెర్ర చేశాయి. మహిళా సంఘాలు, యువజన సంఘాల నేతృత్వంలో మంగళవారం టాస్మాక్ దుకాణా లకు తాళం వేసే కార్యక్రమం చేపట్టారు. పలుచోట్ల దుకాణాలకు తాళం వేశారు. దీన్ని అడ్డుకునే క్రమంలో మహిళా, యువజన సంఘాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధమే లక్ష్యంగా అనేక పార్టీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ఆలయాలు, పాఠశాలల పక్కన ఉన్న టాస్మాక్ దుకాణాలను తొలగిం చాలని డిమాండ్ చేస్తూ తరచూ ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ‘టాస్మాక్ దుకాణాలకు తాళం’ అనే నినాదంతో మహిళా సంఘాలు, యువజన సంఘాలు నిరసన బాట పట్టాయి. రాష్ట్రంలో పలుచోట్ల దుకాణాలకు తాళం వేశారు. ఈ తాళాల్ని పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాటిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తోపులాటలు, వాగ్యుద్ధాలు సాగాయి. కొన్నిచోట్ల మహిళల సంఖ్యకు తగ్గట్టుగా మహిళా పోలీసులు లేక పోవడంతో పోలీసులు చోద్యం చూడక తప్పలేదు. నగరంలోని కోయంబేడు మార్కెట్లో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉదయాన్నే ఆ దుకాణాలకు తాళం వేసే పనిలో పడ్డాయి. రెండు దుకాణాలకు తాళం వేశారు. మరో రెండు దుకాణాలకు తాళం వేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ రాజు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు రఘుపతి, శివకుమార్, హరికుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు రావడంతో వారిని కట్టడి చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దుకాణానికి తాళం వేస్తుండగా అతడిపై పోలీసులు ప్రతాపం చూపించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరును దుయ్యబడుతూ ప్రధాన మార్గంలో రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాల రాక పోకలు స్తంభించారుు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మహిళల్ని బుజ్జగించారు. మాధవరంలో మహిళా సంఘం నాయకురాలు తమిళ్‌సెల్వి నేతృత్వంలో రెండు దుకాణాలకు తాళం వేశారు. వీటిని తొలగించే క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. పోలీసుల తోపులాటలో ఐదుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వ్యాసార్పాడి, శర్మా నగర్, సెంగుండ్రంలోని మూడు టాస్మాక్ దుకాణాలకు మహిళలు తాళం వేశారు. -
ఇసుక ధరలు ఖరారు
తవ్వే విధానాన్నిబట్టి మూడుగా విభజించి, ధరలు నిర్ణయించిన ఏపీఎండీసీ యంత్రాలతో తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను ధర రూ. 157 మనుషుల ద్వారా తవ్వే చోట టన్ను రూ. 211 మిషన్లు, కూలీలను వినియోగించే రీచ్‌ల ఇసుక ధర రూ. 177 హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక ధరలను ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఖరారు చేసింది. రీచ్‌లలో తవ్వకాలు జరిగే తీరునుబట్టి మూడు విభాగాలు చేసి, ధరలను నిర్ణయించింది. ప్రొక్లెయిన్ వంటి యంత్రాల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌లో టన్ను ఇసుక ధర రూ. 157గా నిర్ణయించింది. పూర్తి స్థాయిలో మనుషుల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను రూ. 211గా ఖరారు చేసింది. యంత్రాలు, కూలీలను సమంగా ఉపయోగించే రీచ్‌ల వద్ద టన్ను రూ. 177గా నిర్ణయించింది. ఈ ధరలు కేవలం రీచ్ స్టాక్ పాయింట్ల వద్ద వాహనంలోకి ఇసుక లోడ్ చేసేంతవరకు నిర్ధారించిన ధరలు మాత్రమే. అక్కడి నుంచి రవాణా చార్జీలను వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 28న కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టి, అమ్మకాలు జరపాలి. ఇసుకను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమ్మాలి. ధరను నిర్ణయించే అధికారాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు అప్పగించింది. కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా ఇసుక కమిటీలు ఆ జిల్లాలో ఇసుక రవాణా ఖర్చును ఖరారు చేస్తాయి. ఈ రవాణా చార్జీలను ఏపీఎండీసీ నిర్ణయించే ధరకు కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీఎండీసీ శనివారం ఇసుక ధరలను ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఆమోదం వచ్చాక అవి అమల్లోకి వస్తాయి. ట్రాక్టర్ల ద్వారా వాగు ఇసుక... రాష్ట్రంలో ఇప్పటివరకు 111 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో 83 రీచ్‌లకు అవకాశం ఉంది. అయితే, నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. ఈ రీచ్‌లలో వేటికీ పర్యావరణ అనుమతులు లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. పెద్ద వాగులు, చిన్న చెరువుల్లో ఇసుక తవ్వకాలకు మాత్రం పర్యావరణ అనుమతులు అవసరంలేదు. ఇలాంటి 28 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. కొత్త విధానం ప్రకారం అధికారికంగా గత నెల రోజులుగా పెద్దస్థాయి వాగులు, చెరువుల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా వెలికి తీసే ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా మాత్రమే ఆయా మండలాల పరిధిలోనే విక్రయించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా ట్రాక్టరు ద్వారా ఇసుక రవాణా చార్జీలను రాష్ట్రస్థాయిలో ఖరారు చేయాలని భావిస్తోంది. ప్రతి 5 కిలోమీటర్లను ఒక కేటగిరీగా తీసుకొని రూ. 80 వంతున ట్రాక్టరు రవాణా చార్జీలు నిర్ణయించాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. రీచ్‌ల వద్ద లారీ ఇసుక ధర రూ. 3,165 సాధారణంగా పది టైర్ల లారీ ద్వారా 15 టన్నులు, ఆరు టైర్ల లారీ ద్వారా 8 టన్నుల ఇసుకను తరలిస్తుంటారు. ట్రాక్టర్లలో 4.5 టన్నులు రవాణా చేస్తుంటారు. కొత్త ధరల ప్రకారం పది టైర్ల లారీలో 15 టన్నుల ఇసుక లోడ్ చేయడానికే రూ 2,355 నుంచి రూ. 3,165 చెల్లించాల్సి ఉంటుంది. 4.5 టన్నుల సామర్ధ్యం ఉండే ట్రాక్టరు ఇసుకకు స్టాక్ పాయింట్ వద్ద రూ. 707 నుంచి రూ. 950 వరకు వసూలు చేస్తారు. అక్కడి నుంచి చేర్చాల్సిన దూరాన్నిబట్టి రవాణా చార్జీలను అదనంగా చెల్లించాలి. -
మహిళా సంఘాల నెత్తిన ఇసుక
►విపరిణామాలకు దారి తీయనున్న సర్కారు నిర్ణయం ►ఇసుక ర్యాంపులు డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు ►మాఫియా ఉచ్చులో మహిళలు చిక్కుకునే ప్రమాదం ►రాజకీయ జోక్యాన్నీ అరికట్టలేని పరిస్థితి ►ఫలితంగా ప్రశ్నార్థకం కానున్న సంఘాల ఉనికి ►ఇప్పటికే రుణమాఫీ చిక్కులతో విలవిల శ్రీకాకుళం పాతబస్టాండ్: పొదుపు చేసి.. రుణాలు పొంది.. చిన్నచిన్న వ్యాపార, ఉపాధి యూనిట్లు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాల నెత్తిన సర్కారు నిర్ణయం ఇసుక కుమ్మరించేలా ఉంది. కలిసికట్టుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు ఇసుక క్వారీలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుండటం తెలిసిందే. అయితే దీనివల్ల తలెత్తే పరిణామాల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇసుక క్వారీల నిర్వహణ అంటేనే.. మాఫియాలు, రాజకీయ హస్తం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఇంకెన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నా వీటి జోక్యానికి అడ్డుకట్ట వేయడం సాధ్యంకాదన్నది సుస్పష్టం. గత అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇప్పుడు ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగిస్తే వాటిపైనా ఇసుక మాఫియా పెత్తనం పెరుగుతుంది. రాజకీయ జోక్యం అనివార్యమవుతుంది. అదే జరిగితే ఇంతవరకు ప్రశాంతంగా గ్రూపులను, వ్యాపారాలను నిర్వహించుకుంటున్న మహిళా సంఘాలు వివాదాల ఉచ్చులో చిక్కుకుని బలహీనపడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీ నిర్వహణ లాభసాటి వ్యాపారం కావడంతో దీన్ని వదులుకొనేందుకు మాఫియా గ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడవు. ఏదో ఒక విధంగా సంఘాల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా ఈ సంఘాల పేరుతో బినామీలు పట్టుకొస్తారు. అనైక్యత పెరుగుతుంది. దీనివల్ల సహకార స్ఫూర్తి దెబ్బతిని సంఘాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం విసిరిన రుణమాఫి వలలో చిక్కుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘాల సభ్యులు ఇసుక దందాలతోమరింత అవస్థలపాలవుతారు. 18 రీచ్‌ల గుర్తింపు గతంలో జిల్లాలో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో 24 ఇసుక ర్యాంపులు ఉండేవి. క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. గత కొన్నాళ్లు అధికారిక ర్యాంపులు లేకపోయినా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. తాజాగా మహిళా సంఘాలకు వీటిని అప్పగించి తవ్వకాలు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో 18 ర్యాంపులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ, మౌలిక సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. నదులు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో ఫిబ్రవరి నెల ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. -
మమ్ములను కూడా మోసం చేసిండ్లు
శాయంపేట : రాజీవ్ యువకిరణాలు, తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌మిషన్ల స్కీమ్‌తో ఓ ముఠా మహిళలను మోసగించిన వైనంపై ‘మహిళా సంఘాలకు కుచ్చుటోపి’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో బాధిత మహిళలు ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో మండలంలోని మైలారం, పత్తిపాక, వసంతాపూర్, శాయంపేటకు చెందిన సుమారు 50 మంది ఉన్నారు. తమను కూడా ఇలాగే మోసగించి.. డబ్బులు తీసుకెళ్లారని తమ గోడు వెల్లబోసుకున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొంతమంది భర్తలకు తెలియకుండా తమ ఇంట్లో దాచుకున్న డబ్బులు చెల్లించగా.. మరికొంత మంది తమ కుమారులు పనిచేసి తీసుకొచ్చిన జీతాలను వారికి ముట్టజెప్పారు. కాగా అందరు కలిసి తమకు జరిగిన అన్యాయాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. -
మహిళలను ముంచేశారు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికార దాహంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణ మాఫీ హామీ మహిళా సంఘాలను కష్టాల్లోకి నెట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడింది. ఫలితంగా ఆర్థికంగా బలపడాల్సిన సం ఘాలు నీరసించిపోతున్నాయి. బాబు ఇచ్చిన హామీని నమ్మి ఆరు నెలలుగా రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలను మహిళా సంఘాలు చెల్లించకుండా నిలిపివేశారు. దీంతో మహిళా సంఘాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తించడం లేదు. దీనికితోడు అసలు, వడ్డీని చక్రవడ్డీతో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతవరకూ రుణమాఫీ అవుతోందని ఆశించిన సంఘాలకు మాఫీ లేదని ప్రభుత్వం ప్రకటించడం, లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఎప్పుడు అందజేస్తారో స్పష్టత లేకపోవడంపై మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని లబోదిబో మంటున్నారు. జిల్లాలో రుణాలు పొందిన సంఘాలు 42,176 ఉన్నాయి. ఈ సంఘాలు గడచిన రెండేళ్లుగా బ్యాం కుల నుంచి 628 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీలను పొందారుు. సంఘాల సభ్యులు నెలకు సుమారు రూ. 20 కోట్లు వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే సంఘాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తోంది. అరుుతే అధికారం కోసం ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా మహిళలు వాయిదాలు కట్టవద్దని హామీ ఇచ్చారు. దీన్ని నమ్మిన సంఘాల సభ్యుల్లో కొంతమంది మార్చి నెల నుంచి, మరికొందరు ఏప్రిల్ నుంచి నెలవారీగా బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ వాయిదాలను కట్టడం నిలిపివేశారు. అరుుతే ఇప్పుడు రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో మహిళా సం ఘాలపై వడ్డీ రుపేణా పెనుభారం పడింది. క్రమంగా వాయిదాలు చెల్లించకపోవడంతో పూర్తి వడ్డీ రాయితీ నిబంధనల మేర వర్తిం చడం లేదు. బ్యాంకు అధికారులు సంఘాలకు అసలు, వడ్డీ, చక్రవడ్డీలు వేస్తున్నారు. ఈ వడ్డీలు నెలకు సుమారుగా రూ. 6 కోట్లు వరకూ మహిళపై భారం పడింది. ఇలా గడచిన ఆరు నెలలుగా 36 కోట్ల రూపాయల అదనపు భారం పడడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. రుణ మాఫీ చేయకుండా సంఘానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అదికూడా ఇంతవేగంగా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఇచ్చిన ఆర్థిక సహాయం రుణ ఖాతాకు మళ్లిస్తారా? లేక పొదుపుఖాతాలో జమచేస్తారా? గ్రామ సంఘం ఖాతాలో జమచేస్తారా అన్నదానిపై స్పష్టత లేకపోవడంపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమను నిండా ముంచేశారని మహిళా సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో జిల్లాలోని పలు సంఘాలు ఆర్థిక భారంతో బలహీన పడే పరిస్థితులు నెలకొన్నారుు. రుణ లక్ష్యం చేరేనా ? డ్వాక్రా సంఘాల కొత్త లింకేజీలకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, ఆర్థిక సహాయం సమస్యగా మారింది. గతంలో రుణాలు పొందినవారు వాయిదాలు చెల్లించకపోవడంతో కొత్త గా రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకులు ముం దుకు రావడం లేదు. ఈ ఏడాది కొత్త రుణ ల క్ష్యాన్ని చేరేందుకు ఇబ్బందులు పడుతున్నామని అధికారులంటున్నారు. గత ఏడాది 112 శాతం లక్ష్యాన్ని సాధించారు. ఈ ఏడాది టార్గెట్ రూ. 850.67 కోట్లు కాగా, ఇంతవరకు ఇచ్చిన రుణాలు రూ.37.62 కోట్లు మాత్రమే కావడంతో లక్ష్యం చేరడం అనుమానమే.