డ్వాక్రా రుణాలపై సందిగ్ధం
- మాఫీ అవుతాయనే ఆశతో రుణాలు తిరిగి చెల్లించని మహిళలు
- ఆరు మండలాల్లో సుమారు రూ. 10 కోట్ల వరకు బకాయి
- తప్పనిసరిగా రుణాలు చెల్లించాలని అధికారుల ఒత్తిడి
- అయోమయంలో అతివలు
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల హామీలతో డ్వాక్రా మహిళలు ఊహల్లో తేలిపోయారు. బ్యాంకు లింకేజీ రుణాలు పూర్తిగా రద్దవుతాయని ఆశపడ్డారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఐకేపీ కందుకూరు ఏరియా పరిధిలో గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాలెం, కందుకూరు, పొన్నలూరు మండలాలున్నాయి.
ఈప్రాంతంలో సుమారు ఐదు వేల మహిళా గ్రూపులున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రూ.68 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..లక్ష్యాన్ని మించి రూ.71 కోట్లు అందజేశారు. రుణమాఫీ హామీల నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి మహిళలు రుణాలు చెల్లించడం మానేశారు. దీంతో ఈ ఆరు మండలాల పరిధిలో సుమారు రూ.10 కోట్లకుపైగా చెల్లింపులు నిలిచిపోయాయి. డ్వాక్రా రుణాలు తప్పనిసరిగా తిరిగి చెల్లించేలా చూడాలంటూ ఐకేపీ అధికారులు సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు.
గ్రూపులు చెల్లాచెదురయ్యే ప్రమాదం..
బ్యాంకు లింకేజీ రుణాల పేరుతో ఒక్కో గ్రూపు లక్షల్లో రుణాలు తీసుకుంటారు. రుణాలు పొందిన మహిళలు కూలీనాలి, చిరువ్యాపారాలు చేసుకుంటూ క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలు చెల్లిస్తూ వడ్డీమాఫీ పొందుతున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో అటు అధికారులు..ఇటు డ్వాక్రా మహిళలు సతమతమవుతున్నారు. రుణమాఫీ వర్తించదంటే ఒకేసారి రుణాల చెల్లింపు కష్టతరంగా మారుతుందని మహిళలు చెబుతున్నారు.
రుణమాఫీ కష్టమేనని, సీమాంధ్రలో అది సాధ్యం కాదన్న రాజకీయ విశ్లేషకుల మాటలు వింటుంటే మహిళలు బెంబేలెత్తుతున్నారు. రుణాల చెల్లింపులు గాడి తప్పితే గ్రూపులు చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని ఐకేపీ సిబ్బంది చెప్తున్నారు. తిరిగి గ్రూపులు ఏర్పాటు చేయాలన్నా..రుణాలు తిరిగి క్రమం తప్పకుండా ఇవ్వాలన్నా కష్టంతో కూడుకున్న పనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వచ్చేనెల 8న ప్రమాణ స్వీకారం చేస్తారు. దీని కారణంగా జూన్ నెలలో కూడా చెల్లింపులు జరగవని చెబుతున్నారు.