‘బాబు’ బాధితుల్లో రైతుల తరువాత డ్వాక్రా గ్రూపులు అధికంగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. దీంతో రుణానికి వడ్డీ పెరగడమే కాకుండా కొత్త రుణాలు తీసుకునే అవకాశాన్ని కోల్పోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఎప్పటికప్పుడు రుణాలు చెల్లిస్తూ కొత్త రుణాలు తీసుకుంటూ గౌరవప్రదంగా జీవనాన్ని సాగించిన ఈ గ్రూపు సభ్యులు నేడు బతుకు పోరు సాగిస్తున్నారు.
కొరిటెపాడు(గుంటూరు) : ఏడాది నుంచి డ్వాక్రా గ్రూపు మహిళలను మోసం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పెట్టుబడి నిధి’తో కొత్త పల్లవి పాడుతున్నారు. ఇందులోనూ ఆధార్‌ను అనుసంధానం చేస్తూ వారి సంఖ్యను తగ్గించే యత్నం చేస్తున్నారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం మాఫీతో పాటు పూర్తిగా వడ్డీ చెల్లిస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అదే వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. జిల్లాలో 47,924 పొదుపు గ్రూపులున్నాయి. వారికి రూ.869.24 కోట్లు రు ణాలు ఇచ్చారు.
రుణంతోపాటు వడ్డీకూడా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం డ్వాక్రా రుణమాఫీని విస్మరించారు. దీంతో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేకపోవడంతో 14 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోంది. లక్ష రూపాయల రుణం తీసుకున్న గ్రూపు సగటున రూ.13 వేలు వడ్డీనే చెల్లించాల్సి వస్తోంది. అసలుకు వడ్డీ కూడా కలవడంతో రుణభారం పెరిగి గ్రూపు సభ్యులు నిరాశ చెందుతున్నారు. కొత్త వ్యాపారం చేసేందుకు పెట్టుబడి పెట్టే మార్గం లేక చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు విధానాలకు వ్యతిరేకంగా అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో పెట్టుబడి నిధి పేరుతో పొదుపు మహిళలపై మాయవల విసిరారు.
రూ. లక్ష మూల ధనం కింద పొదుపు సభ్యుల ఖాతాకు జమచేస్తానని ఇటీవల ప్రకటించారు. మొదటి విడతగా ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. పూర్తిగా రుణమాఫీ చేయాల్సిన చంద్రబాబు తమను నిలువెల్లా ముంచాడని మండిపడుతున్నారు. ఏడాదిపాటుగా రుణాలు మాఫీ అవుతాయని ఎదురు చూస్తున్న తమకు నిరాశే మిగిలిందని బాహాటంగా విమర్శిస్తున్నారు.
పెట్టుబడి నిధిలోనూ పొదుపు మహిళలకు చెక్ ...
వ్యవసాయ రుణమాఫీ తరహాలోనే పెట్టుబడి నిధి మంజూరు చేయడంలో చంద్రబాబు చెక్ పెట్టారు. ఆధార్ లింకేజీ పేరుతో గ్రూపులో ఇద్దరి నుంచి నలుగురు పేర్లను తొలగించారు. జిల్లాలో ఆధార్ లింకేజీ కారణంగా కొన్ని వందల మంది మొదటి విడత పెట్టుబడి నిధి రూ. 3 వేలను కోల్పోనున్నారు. వ్యవసాయ రుణమాఫీ కోసం రైతులు తిరిగినట్లు తాము ఎన్ని కార్యాల యాల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలని పొదుపు మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
మూడునెలలు ఎదురు చూసినా ఫలితం లేదు
మేం పిడుగురాళ్ల ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.లక్షన్నర లోను తీసుకున్నాం. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మాఫీ చేస్తారని ఎదురు చూశాం. మూడు నెలలు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు వారు కట్టుకుంటే మంచిది లేదంటే వడ్డీ భారమవుతుందని తెలిపారు. దాంతో బాబుపై నమ్మకం లేక అంతా కలసి అదనపు వడ్డీ చెల్లించాం.
- మారం సరస్వతి, బాపూజీ డ్వాక్రా గ్రూపు, పిడుగురాళ్ల
వేయికళ్లతో ఎదురు చూశాం..
పిడుగురాళ్లలోని సీజీజీబీ బ్యాంకులో రూ.3 లక్షలు లోను తీసుకున్నాం. దీనికి గాను రూ.80 వేలు వడ్డీ చెల్లించాలి. మధ్యలో ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం రుణం మాఫీ అవుతుందని వేయి కళ్లతో ఎదురు చూశాం. చివరకు నిరాశే ఎదురైంది. గత్యంతరం లేక అదనపు వడ్డీ కట్టి మా పొదుపు ఖాతాను రన్నింగ్‌లోకి తెచ్చుకున్నాం. మాఫీ అవుతుందని ఎదురుచూసినందుకు అనవసరంగా అదనపు వడ్డీ కట్టుకోవాల్సి వచ్చింది.
- ఈసరెడ్డి అనసూర్య, గంగాభవానీ పొదుపు గ్రూపు, పిడుగురాళ్ల
బాబు మోసం చేశారు...
ప్రతి ఏటా మేం రుణాలు తీసుకుని చెల్లిస్తుంటాం. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేప్తే నమ్మి ఓట్లు వేశాం. సంవత్సరం వరకు రుణాలు గురించి మాట్లాడని ముఖ్యమంత్రి ఇప్పుడు మ్యాచింగ్‌గ్రాంట్ పేరుతో సంవత్సరానికి మూడువేలు జమచేస్తామని చెపుతున్నారు. ఇది మహిళలను మోసం చేయడమే.
- మన్నెం మల్లేశ్వరి, దొండపాడు
పొదుపు మహిళలకు పంగనామాలు
Published Fri, May 29 2015 2:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement