ఘనంగా మహిళా దినోత్సవం
సాక్షి, ముంబై: అమ్మ, అక్క, చెల్లి, భార్య.... ఇలా బాధ్యత ఏదైనా నూటికి నూరుపాళ్లూ న్యాయం చేయగల అపూర్వ వ్యక్తి మహిళ. అనధికారికంగా ఆమెను ప్రతిరోజూ పూజిస్తాం, ఆరాధిస్తాం. అధికారికంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. నగరంలోని పలు మహిళా సంఘాలు ఈ రోజును ఓ వేడుకలా జరుపుకున్నాయి.
వడాలాలో...: వడాలా తెలుగు మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వడాల తెలుగు సంఘం హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా మండలి సీనియర్ సభ్యురాలు సవ్వుళ్ల బాలమ్మ పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విద్యారంగంలో మహిళలు మెరుగ్గా రాణించాలనీ, తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే జీవిత విలువలు నేర్పించాలని సూచించారు. గొంగిడి భాగ్య లక్ష్మి బృందం చిన్న పిల్లల గీతాలాపనతో మహిళా సభ్యులు ఉత్తేజం పొందారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షులు గొంగిడి మల్లేశ్వరి, కల్కూరి లక్ష్మి, గంగుల పద్మ, భీమ గోయిన సోమమ్మ, పులిచెర్ల చంద్రకళతోపాటు తెలుగు సంఘం అధ్యక్షుడు కార్యదర్శిరాములు కల్కూరి పాల్గొన్నారు.
సైన్‌లో...: బెస్త గంగపుత్ర సంఘం (బీజీఎస్‌ఎం) మహిళా శాఖ ఆధ్వర్యంలో సైన్‌లోని శివాజీ నగర్ సొసైటి హాలులో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరప్‌లో 1907లోని మహిళలు తమ హక్కుల కోసం చేసిన కృషి ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని బీజీఎస్‌ఎం మహిళా శాఖ అధ్యక్షురాలు మంగెలిపెల్లి రేణుకదేవి వివరించారు. అనంతరం మహిళలు పుష్పగుచ్ఛాలు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
భివండీలో...: కోమల్ సమాచార్, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సావిత్రిమాయి ఫూలే వర్ధంతిని స్థానిక యువక మండలి హాలులో నిర్వహించారు. మహిళల కోసం సావిత్రి మాయి ఫూలే చేసిన కృషి ఎంతో గొప్పదని తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ సీహెచ్ గణేష్ ముదిరాజ్ కొనియాడారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. తె.వి.వి. భీవండీ శాఖ కన్వీనర్ కట్టా బ్రహ్మయ్యచారి మహిళలపై కవితలు చదివారు. అత్యాచారాల నివారణోపాయాలను కోమల్ సమాచార్ సంపాదకులు సిరిమల్లె శ్రీనివాస్ తెలియజేశారు.
వాషిలో...: మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ‘స్వరమాధురి’ సంగీత సంస్థ వాషిలోని మరాఠీ సాహిత్య మందిర్‌లో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వరమాధురి ప్రత్యేక గీతంతో ఈ కార్యక్రమాన్ని భానుమతి శర్మ ప్రారంభించారు. అపూర్వ గజ్జెల, భావన సరిపల్లి, సరోమిత రాయ్, అదితి నేరుర్‌కర్, గిరిజ ద్విభాష్యం, భానుమతి, వసంత అలనాటి హిందీ, మరాఠీ, తెలుగు పాటలు, కొత్త పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాయనీమణులు, వాద్యకారులు , ఫోటోగ్రఫర్ ఇలా అందరూ మహిళలే కావడం విశేషంగా నిర్వాహకులు తెలిపారు.
అవని(త)కి వందనం
Published Mon, Mar 9 2015 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement