ముంబై జూహూ గ్రౌండ్స్‌లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి...
‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ.
ముంబైలో డాన్స్ స్కూల్‌ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది.
11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్‌ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది.
అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు.
దేహం, గళం, బుద్ధి
‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత.
‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది.
1100 స్కూళ్లలో
‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్‌బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు.
మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె.
నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment