‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం!
ఏమిటి జింజర్?
ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్‌సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్‌లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు.
‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్‌సిఎల్ సీయివో పునీత్ చత్వాల్.
ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది.
కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు.
అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది.
స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది.
371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment