ఎంఎంటీఎస్-2 కూత
టెండర్లు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థ
30 నెలల్లో రూ.389 కోట్లతో లైన్ల నిర్మాణం
కొత్త ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి
సాక్షి, సిటీబ్యూరో : ఎట్టకేలకు ఎంఎంటీఎస్ రెండోదశలో ప్రతిష్టంభన తొలగిపోయింది. దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం జీఎమ్మార్ సంస్థకు అప్పగించింది. మొత్తం ఆరు మార్గాల్లో నిర్మించనున్న రెండోదశలో లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల కోసం రూ.389 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు.
ఇందులో రూ.207 కోట్ల విలువైన పనులను జీఎమ్మార్ సంస్థ పూర్తి చేయనుంది. ఇందుకోసం 30 నెలల కాలపరిమితిని విధించారు. టాటా ప్రాజెక్ట్, కాళింది రైల్ నిర్మాణ్ సంస్థలతో కలిసి జీఎమ్మార్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. వచ్చేనెలలో పనులు ప్రారంభించే అవకాశ ం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రిటన్ సంస్థ బాల్‌ఫోర్‌బెట్టి ముందుకొచ్చినప్పటికీ గతేడాది సాంకేతిక కారణాల వల్ల విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ఆ సంస్థతో కలిసి పనిచేసేందుకు కాళింది సంస్థ కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది.
బాల్‌ఫోర్‌బెట్టి టెండర్లను కూడా దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో కొందరు రాజకీయ నేతలు కమిషన్లు అడిగినందుకే ఆ సంస్థ వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో రెండోదశకు బ్రేకులు పడ్డాయి. తాజాగా జీఎమ్మార్ ఈ టెండర్లను దక్కించుకోవడంతో మళ్లీ కదలిక ప్రారంభమైంది.
లైన్ల నిర్మాణ ం ఇలా...
రెండోదశలో ఘట్కేసర్ నుంచి మౌలాలీ వరకు 14 కి.మీ. మేర కొత్త లైన్లు వేసి విద్యుదీకరిస్తారు. సనత్‌నగర్ నుంచి మౌలాలీ వరకు 23 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలి. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కి.మీ. మేర కొత్త లైన్లను నిర్మించాలి.
బొల్లారం-మేడ్చల్మధ్య 14 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు 14 కి.మీ. విద్యుదీకరిస్తారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ. పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల ఫిరోజ్‌గూడ, సుచిత్ర జంక్షన్, బీహెచ్ఈఎల్, భూదేవినగర్, మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.