వివిధ రంగాలలో విజయపథంలో దూసుకుపోతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలు
వినీతసింగ్ (కాస్మెటిక్స్)
వినీతసింగ్‌కు తండ్రి తేజ్‌సింగ్ స్ఫూర్తిప్రదాత. ఆయన శాస్త్రవేత్త. ఏడాదిలో 365 రోజులూ పనిచేసేవాడు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో డిజిటల్–ఫస్ట్ కాస్మటిక్ బ్రాండ్ ‘సుగర్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది వినీత. ఐఐటీ–మద్రాస్, ఐఐఎం–అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వినీత ఒక ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో అధిక వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను వదులుకొని వ్యాపారరంగంలోకి అడుగు పెట్టింది.
మొదటి స్టార్టప్ ‘క్వెట్జాల్’ ఘోరంగా విఫలమైంది. 2012లో మన దేశంలో ఇ–కామర్స్ ఊపందుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ప్రతినెలా వివిధ రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ తక్కువ ధరకు అందించే ‘ఫ్యాబ్ బ్యాగ్’ అనే సబ్‌స్క్రిప్షన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ వ్యాపారం హిట్ అయింది. అయితే ఈ మేకప్ బ్రాండ్లు మన భారతీయ స్కిన్‌టోన్, జీవన విధానానికి అనుగుణంగా లేవని గ్రహించింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2015లో కాస్మటిక్ ‘సుగర్’ను స్టార్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది.
నేహా సతక్ (ఆస్ట్రోమ్ టెక్నాలజీ)
టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసింది నేహా సతక్.‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన సత్తా చాటింది. ‘నన్ను నేను ఒక ఇన్నోవేటర్‌గా భావిస్తాను’ అంటుంది ‘ఆస్ట్రోమ్ టెక్నాలజీ’ కో–ఫౌండర్, సీయీవో నేహా సతక్. ‘ఇన్నోవేటివ్ హై– బ్యాండ్‌విడ్త్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఇంటర్నెట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలోక్లి తీసుకురావడానికి, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచనలో ఆస్ట్రోమ్ టెక్నాలజీ మొదలు పెట్టాం. ఆస్ట్రోమ్ గిగామెష్ డివైజ్ చుట్టుపక్కల ఉన్న నాలుగు డివైజ్‌లను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఒక పరికరాన్ని మాత్రమే కనెక్ట్ చేయగలదు’ అంటుంది నేహా సతక్.
హర్దిక షా (ఫిన్‌టెక్)
ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది హర్దిక షా. చిన్నపాటి వ్యాపారం నిర్వహించడానికి తల్లి పడే కష్టాలను దగ్గరి నుంచి చూసిన షా యూఎస్‌లో కంప్యూటర్ సైన్స్ చేసింది. కొలంబియా బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తయిన తరువాత టాప్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. మన దేశంలో చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత బెంగళూరు కేంద్రంగా ‘కినార క్యాపిటల్’ అనే ఫిన్‌టెక్‌ను ప్రారంభించింది. ఈ ఫిన్‌టెక్‌కు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి. ‘గ్యారెంటీ లేని బిజినెస్. చాలా రిస్క్’ అన్నారు హర్థిక షా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. అయితే ఆ మాటలేవీ ఆమెపై ప్రభావం చూపలేదు. తొలి అడుగుల్లోనే కస్టమర్‌లు, ఇన్వెస్టర్‌ల విశ్వాసాన్ని గెలుచుకుంది. ‘ఫిన్ టెక్’ ఫీల్డ్‌లో విజయకేతనం ఎగరేసింది.
డా. ప్రియా అబ్రహం, వైరాలజిస్ట్
మన దేశంలోని ప్రసిద్ధ వైరాలజిస్ట్‌లలో డా. ప్రియా అబ్రహం ఒకరు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టిన ప్రియ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు(సీఎంసీ)లో బయాలజీలో పీహెచ్‌డీ చేసింది. సీఎంసీ ‘క్లినికల్ వైరాలజీ సెక్షన్’ హెడ్‌గా పనిచేసింది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు సంబంధించిన ఎన్నో కమిటీల్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పనిచేసింది. నేషనల్ వైరల్ ఇన్‌ఫెక్షన్ సర్వైలెన్స్ రిసెర్చ్‌లో భాగం అయింది. కోవిడ్–19కి జస్ట్ రెండు నెలల ముందు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్‌గా బాధత్యలు చేపట్టింది.
‘ఆ టైమ్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’ అని కరోనా కాలాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ప్రియ. టెస్టింగ్ కిట్‌లను వివిధ టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపే లాజిస్టిక్స్‌ను నిర్వహించడం నుంచి కొత్తగా పుడుతున్న వేరియెంట్లను నిశితంగా పరిశీలించడం వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రియ ఆమె బృందం ఎంతో కృషి చేసింది. లాజిస్టిక్స్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా మన దేశంలో జరిగిన అన్ని వ్యాక్సిన్ ట్రయల్స్ పర్యవేక్షణలోనూ కీలక పాత్ర పోషించింది. ‘గుర్తింపు, విజయం రావాలని ఆశగా పరుగెత్తినంత మాత్రాన రావు. మనం చేసిన కృషిని బట్టి వెదుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి’ అంటుంది ప్రియా అబ్రహం.
రిమ్‌జిమ్ అగర్వాల్ (న్యూరో–ఇన్‌ఫర్‌మేటిక్స్)
లైనా ఇమాన్యుయేల్‌తో కలిసి న్యూరో–ఇన్‌ఫర్‌మేటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్‌సైట్’ను ప్రారంభించింది రిమ్‌జిమ్ అగర్వాల్. బ్రెయిన్‌సైట్ ఏఐ సాఫ్ట్‌వేర్ మెంటల్ హెల్త్ ప్రాక్టిషనర్స్‌కు, న్యూరోసర్జన్స్ బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన అగర్వాల్ మెంటల్ హెల్త్‌కు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) అప్లికేషన్‌లను స్టడీ చేసింది. ‘గూగుల్ మ్యాప్ ఆఫ్ ది బ్రెయిన్’గా ‘బ్రెయిన్‌సైట్’ ప్లాట్‌ఫామ్ గుర్తింపు పొందింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను నాలుగు రకాల టెక్నాలజీలతో రూపొందించారు.
స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్‌లాంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. మెదడులో ఏం జరుగుతుందో అనేదానిపై ‘బ్రెయిన్‌సైట్’ సాంకేతికత దృష్టి సారిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మానసిక సమస్యతో బాధపడుతున్న వారి గురించి సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘మా పరిశోధనలను ఎక్కువమందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఫంక్షనల్ అంశాలకు కృత్రిమ మేధస్సును వర్తింప చేస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది కంపెనీలలో మా కంపెనీ ఒకటి’ అంటుంది అగర్వాల్.
అశ్వినీ అశోకన్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్ కోర్సు చదువుతున్న రోజుల నుంచి అశ్వినీ అశోకన్‌కు కంప్యూటర్‌కు సంబంధించి విషయాలపై ఆసక్తి ఉండేది. ‘ఇంటెల్’లో దశాబ్దం పాటు వివిధ రకాల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన విభాగాల్లో పనిచేసింది. ఈ అనుభవ జ్ఞానంతో ‘మ్యాడ్‌స్ట్రీట్ డెన్’ను ప్రారంభించింది. డిజిటల్, ఏఐ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు సంబంధించి కంపెనీల జర్నీలో ‘మ్యాడ్‌స్ట్రీట్’ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
2020–2021లో కంపెనీలో రకరకాల పరిశ్రమలలోకి విస్తరించింది. వ్యాపార విజయాలకు మాత్రమే కాదు ఉద్యోగాలలో జెండర్ ఈక్వాలిటీకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది అశ్విని. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు మానేసిన ఎంతోమందిని తిరిగి పనిలో చేరేలా కృషి చేసింది. ‘అన్ని రకాల కంపెనీలను నడిపించడంలో మహిళలు ముందుండాలి’ అని కోరుకుంటున్న అశ్వినీ అశోకన్ ఈ భూగోళంలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తిని ఏఐ నేటివ్‌గా చూడాలనుకుంటుంది.
అపర్ణ పురోహిత్ (వినోద రంగం)
మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ పురోహిత్ ఎన్నో కలలతో దిల్లీ నుంచి ముంబైలోకి అడుగు పెట్టింది. ముంబైకి వచ్చిన ఐదేళ్ల తరువాత ఇండిపెండెంట్ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది. కథలు చెప్పాలనే కలతో ముంబైకి వచ్చిన అపర్ణ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజనల్స్’ హెడ్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. ‘ఇది నా పని కాదు’ అని ఎప్పుడూ అనుకోలేదు. ట్యూషన్ల్ చెప్పడం నుంచి వాయిస్ ఓవర్ వరకు ఎన్నో పనులు చేసింది. ‘అమెజాన్ ప్రైమ్‌వీడియో–ఇండియా’ హెడ్ హోదాలో పాతాళ్ లోక్, మీర్జాపూర్ మేడ్ ఇన్ హెవెన్, ది ఫర్‌గెటన్ ఆర్మీలాంటి ఒరిజినల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ‘సూపర్‌మెన్‌లాగా సూపర్ ఉమెన్ అనే మాట ఎందుకు వినిపించదు’ అనే మాటకు అపర్ణ పురోహిత్ ఇచ్చిన జవాబు... ‘తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడూ సూపరే’.
Comments
Please login to add a commentAdd a comment