మహిళే మహారాణి
సాక్షి, ముంబై: నేటి ప్రపంచంలో పురుషులతో పోటీ పడుతూ దూసుకువెళ్తున్న మహిళలు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషాధిపత్యం ఉన్న మన దేశంలో దాదాపు కుటుంబ పెద్దగా పురుషులే ఉండడం గమనిస్తుంటాం. మహిళల జీవితకాలంలో వివాహం అయ్యే వరకు తండ్రి, వివాహం తర్వాత భర్త, అత్తమామల నిర్ణయాలనే శిర సా వహించే మహిళల్లో మార్పొస్తోంది. రాష్ట్రంలో నివసిస్తున్న కోట్లాది కుటుంబాలలో నేడు లక్షలాది కుటుంబాలకు పెద్దగా మహిళలు వ్యవహరిస్తుండడం మార్పుకు నాందిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 25.13 లక్షల మంది మహిళలు కుటుంబపెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు వెళ్లడైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కుటుంబపెద్దలుగా వ్యవహరిస్తున్న మహిళల సంఖ్యపై ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. రాష్ట్రంలోని 11.24 కోట్ల జనాభాలో 5.40 కోట్ల మంది మహిళలున్నారు. వీరిలో ఏడు శాతం మహిళలు అనగా 25.13 లక్షల మంది కుటుంబ పెద్దలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వెళ్లడైంది. మహిళలంటే కేవలం ఇంటికే పరిమితమనే భావన భావన ఈ సర్వే వివరాలతో మారిందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, క్రీడ, సామాజిక సేవలు, రాజకీయాలు, పరిశ్రమలు ఇలా దాదాపు అన్ని రంగాల్లో మహిళలు నేడు కీలక పాత్ర పోషిస్తున్నారు.
యావత్మాల్, అకోలా, అమరావతి, వర్దా మొదలగు జిల్లాల్లో భర్త మరణానంతరం బాధ్యతలన్ని మహిళలే చేపడుతున్నారు. కుటుంబ పెద్దగా సఫలీకృతమవుతున్నారు. యావత్మాల్ జిల్లాలో 6.40 లక్షలు కుటుంబాలుండగా వీరిలో 65 వేల కుటుంబాలకు మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అకోలాలో 3.91 లక్షలు కుటుంబాల్లో 36వేల కుటుంబాలకు, అమరావతిలోని 6.37 లక్షల కుటుంబాల్లో 63వేలు, వర్దా జిల్లాలోని 3.03 లక్షల కుటుం బాల్లో 36 వేల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దగా ఉన్నారు.