మైక్రోరల్లో మహిళా సంఘాలు | My krorallo women's groups | Sakshi
Sakshi News home page

మైక్రోరల్లో మహిళా సంఘాలు

Published Sun, Aug 10 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

మైక్రోరల్లో మహిళా సంఘాలు

మైక్రోరల్లో మహిళా సంఘాలు

పార్వతీపురం:  జిల్లాలో సుమారు 63 వేలు మహిళా సంఘాలుండగా, వీటికి సంబంధించి వడ్డీలేని రుణాల మంజూరు గత ఏడాది డిసెంబర్ నుంచి మే నెల వరకు పరిశీలిస్తే... దాదాపు 72 శాతం నుంచి 23 శాతానికి పడిపోయాయి. డిసెంబర్‌లో దాదాపు 30,764 సంఘాలు రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేయగా, 22,276 సంఘాలు మాత్రమే అర్హత సాధించాయి. ఆయా సంఘాలకు రూ.3 కోట్లు వరకు రుణంగా ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న నమ్మకంతో మహిళా సంఘాలు బ్యాంకులతో లావాదేవీలు తగ్గించుకున్నాయి. దీంతో ఈ సంవత్సరం మే నెల నాటికి   30 వేలు సంఘాలు రుణానికి దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం 6,981 సంఘాలు అర్హత సాధించాయి. ఇవి  రూ. 32 లక్షలు మాత్రమే రుణంగా పొందగలిగాయి.
 
 ఇక జూన్, జూలై, ఆగస్టుకు వచ్చేసరికి ఆయా మహిళా సంఘాలు దాదాపు బ్యాంకుల మెట్లెక్కడం మానేశాయి. దీంతో తారుమారైన ఆర్థిక పరిస్థితులను గట్టేందుకు ఆయా మహిళా సంఘాలు మైక్రో, వారపు వడ్డీలను ఆశ్రయించక తప్పలేదు.  పార్వతీపురం సబ్-ప్లాన్ పరిధిలోని ఎనిమిది మండలాలలో దాదాపు ఏడు వేల వరకు మహిళా సంఘాలున్నాయి.  దాదాపు 300 వరకు వీవోలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది వరకు మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలు చైతన్యవంతమై నెలనెలా పొదుపులు, అప్పులు తీసుకొని వాటిని వాయిదా తప్పకుండా రెగ్యులర్‌గా చెల్లించే విధంగా ఐకేసీ సిబ్బంది తీర్చిదిద్దారు. అయితే రుణమాఫీ వస్తుందన్న నమ్మకంతో మహిళలు దాదాపు ఎన్నికల ముందు నుంచే బ్యాంకుల్లో అప్పులు చెల్లించడం, అప్పులు తీసుకోవడం ఆపేశారు. దీంతో   నిబంధనల ప్రకారం బ్యాంకర్లు రుణాల రీ-షెడ్యూల్ చేయడం మానేశారు.
 
 అలాగే అప్పులు కట్టమని ఒత్తిడి చేస్తుండడంతో పాటు వడ్డీ విధిస్తుండడంతో మహిళా సంఘాలు తమకు అవసరమైనంత ఆర్థిక ఆసరా దొరకక సతమతమవుతున్న సమయంలో   మైక్రో సంస్థల సిబ్బంది, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు మహిళా సంఘాలను టార్గెట్‌గా చేసుకొని రుణాలను ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7 కోట్ల రుణ మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.3 కోట్లు వరకు రుణాలిప్పించామని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. రుణాలు అందని మిగతా సంఘాలన్నీ వ్యక్తిగతంగా, సంఘాల పరంగా మైక్రో, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాయి. ఈ రుణాల పట్ల పేదలే అధికంగా మొగ్గు చూపుతున్నారు. రుణం ఇచ్చినప్పుడే వడ్డీతో పాటు కొంత మొత్తాన్ని మినహాయించి ఇస్తున్నారు. తర్వాత వారం, పక్షం, నెలవారీగా వీరి వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో అప్పులు తీర్చని వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కఠినంగా దండించిన సందర్భాలు లేకపోలేదు. దీనికి ఉదాహరణగా గతంలో కొమరాడ మండలంలో జరిగిన పలు సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గ్రూపులో ఎవరైనా రుణం వాయిదా చెల్లించకపోతే మిగతా సభ్యులు ఆమెపై దాడి చేయడం, మైక్రో సంఘాలు వారు ఇంట్లో వస్తువులు పట్టుకుపోవడం తదితర సంఘటనలు లేకపోలేదు. అయితే తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరవని పక్షంలో మహిళా సంఘాలు తమ సంపాదనంతటినీ వారపు వడ్డీలు, మైక్రో రుణాలకు పోయాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement