భయపెడుతున్న భ్రూణ హత్యలు | fear to the Fetal killings | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న భ్రూణ హత్యలు

Published Thu, Jul 24 2014 12:41 AM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM

fear to the Fetal killings

జాతీయ స్థాయిలోనూ ఘోరమే
మూడో స్థానంలో తమిళనాడు
 చెన్నై, సాక్షి ప్రతినిధి: స్త్రీ, శిశు సంక్షేమానికి ఎన్ని చట్టాలు చేసినా అవి కొందరికి చుట్టాలుగానే మారిపోతున్నాయి. లింగ నిర్ధారణ వెల్లడించరాదంటూ వచ్చిన చట్టం పుస్తకాలకే పరిమితమైంది. ఆడ శిశువును కాపాడుకోవాలని మహిళా సంఘాలు చేస్తున్న నినాదాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇవి కేవలం ఆరోపణలు కాదు, కఠోర వాస్తవాలంటూ  సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) వారే 2011 నాటి లెక్కలను ఇటీవలే వెలుగులోకి తెచ్చారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా కూతురు పుట్టకూడదని కోరుకునేవారు ఇంకా ఉన్నారు. గర్భిణుల నెలవారీ వైద్యపరీక్షలతోపాటూ స్కానింగ్ ద్వారా లింగనిర్ధారణ చేయరాదని, చేసిన వాస్తవాన్ని వెల్లడించరాదని ప్రీ కాన్సప్షన్, ప్రీ నాటల్ డయోగ్నస్టిక్ టెక్నిక్స్ 1994లో వచ్చిన చట్టం నూరుశాతం అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది.

జనరల్, సెన్సెస్ కమిషనర్ కార్యాలయం రిజిస్ట్రారు వారి ద్వారా లింగ వివక్షపై నిజాలు వెలుగుచూశాయి. లింగ వివక్ష లేని సమాజంలో స్టాండర్డ్ బర్త్‌రేషియో ప్రకారం వెయ్యికి 952 మంది జన్మించాల్సి ఉండగా, తమిళనాడులో 2011లో 905 మంది మాత్రమే పుట్టారు. 952 రేషియో ప్రకారం రాష్ట్రంలో 2011లో 5,78,631 మంది ఆడశిశువులు జన్మించాలి. అయితే 6,07,806 మంది మగశిశువులు జన్మించగా, 5,50,173 మంది మాత్రమే ఆడపిల్లలు పుట్టారు. సాధారణ రేషియో ప్రకారం కేవలం ఒక్క ఏడాదిలోనే 28,458 మంది ఆడశిశువుల తేడా చూపిస్తోంది.

సాధారణ సమాజంలో జననాలు వెయ్యికి 943-962 సంఖ్య మధ్యన సాగాల్సి ఉందని యునెటైడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ పరిశోధకులు చెబుతున్నారు. ఇంత కంటే తక్కువ ఉందంటే అక్కడ లింగ వివక్ష కొనసాగుతోందని నిర్ధారించుకోవచ్చని వారు అంటున్నారు. తమిళనాడులో పుట్టిన ప్రతిబిడ్డను రిజిస్టరు చేసుకుంటున్నందున జననాల సంఖ్యలో ఎంతమాత్రం తేడా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. సంఖ్యాపరంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న తేడా మూలంగా సీఆర్‌ఎస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో లింగ వివక్ష అలాగే లింగ నిర్ధారణ పరీక్షల్లో గోప్యం పాటించడం లేదని అర్థమవుతోంది.
 
ఇదేదో 2011లో మాత్రమే జరిగిన పొరపాటు కాదు, గత ఐదేళ్లుగా ఈ రేషియా పడిపోతోందంటే ఉద్దేశపూర్వకంగా లింగ వివక్ష సాగుతున్నట్లేనని భావిస్తున్నారు. 2004-2007 సంవత్సరాల్లో సగటున 952 జననాలకు గానూ 936 మాత్రమే జరిగారుు. అలాగే 2008-2011లలో 925కు పడిపోయింది. సీఆర్‌ఎస్‌తో శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్టు-2011తో పోల్చిచూసినా తమిళనాడులో లింగ వివక్ష ఏటా పెరుగుతున్నట్లు భావించవచ్చని సెక్స్ సెలెక్టీవ్ అబార్షన్ అంశంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న పరిశోధకుడు డాక్టర్ సబూ జార్జ్ కూడా నిర్ధారించారు. లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో నిబద్ధత పాటించని కేటగిరి కింద నేషనల్ క్రైం రికార్డు బ్యూరో 2013లో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదై ఈ చట్టం అమలు ఎంతలోపభూయిష్టంగా సాగుతోందో చాటి చెప్పింది. దేశం మొత్తం మీద లెక్కకడితే జాతీయ స్థాయిలో 952కు గానూ 906 మాత్రమేగా గుర్తించారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో గోప్యం పాటించిన వైనం, లింగ వివక్ష అంశాల్లో రాష్ట్రాల వారీగా గుజరాత్ (909) ప్రథమస్థానం, ఆంధ్రప్రదేశ్ (915) ద్వితీయ స్థానం, తమిళనాడు (925) తృతీయస్థానంలో నిలిచి ఉండడం ఆందోళనకరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement