స్తూపంతో భర్తకు కనువిప్పు!
చౌటుప్పల్: సమాజంలో మరో మహిళ దారుణ హత్యకు గురి కావొద్దని, కిరాతకంగా హత్య చేసే వారికి ఇదో గుణపాఠం కావాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే భార్యను కడతేర్చిన భర్త వ్యవసాయ క్షే-తంలోనే ఆమె స్మారక స్థూపాన్ని నిర్మించి, ఆవిష్కరించారు. ఈ సంఘటన నల్లొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే సరిగ్గా నెల రోజుల క్రితం గత జనవరి 4వ తేదీన చౌటుప్పల్ మండలం పంతంగిలో మిర్యాల శ్రీశైలం (28) తన భార్య పార్వతమ్మ (24)ను రోకలిబండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. న్యాయం కోసం మృతురాలి బంధువులు పోరాడారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. కిరాతకానికి ఒడిగట్టే భర్తలకు కనువిప్పు కలిగించాలని అప్పట్లోనే గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు నిర్ణయించారు.
భర్త ఇంటి ఎదుటే భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సమాధి నిర్మించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో ఇంటి పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో ఆమె మృతికి స్మారకంగా స్తూపాన్ని నిర్మించి బుధవారం ఆవిష్కరించారు. మహిళలను హత్య చేసే కిరాతకులకు ఈ సంఘటన గుణపాఠం కావాలని నినదించారు. ఆ స్థలంలో ఆమె పేరుతో పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.