
17ముగిసిన ప్రాదేశిక ప్రచారం
- రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు
- సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత
- తెరవెనుక మంత్రాంగంలో పార్టీలు
- సొమ్ము కుమ్మరింపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: మైకులు మూగబోయాయి. మలి విడత పరిషత్ ఎన్నికలకు బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అభ్యర్థులు చివరి రోజున సాయంత్రం వరకు ముమ్మర ప్రచారం చేపట్టారు. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలన్న ఎన్నికల నిబంధనతో ఉదయం నుంచి హోరెత్తిన మైకులు సాయంత్రం ఐదుగంటలతో మూగబోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఏజెన్సీలో తెరవెనక మంత్రాంగం నడుస్తోంది.
ఇప్పటి వరకు రోడ్ల మీదకు వచ్చి ఓట్లు అభ్యర్థించిన వారు ఇప్పుడు క్యాంపుల నిర్వహణలో బిజీగా ఉన్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇక శుక్రవారం నాటి పోలింగ్ పర్వానికి ముందస్తు ప్రణాళికతో పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అవసరమైతే డబ్బులు ఎరచూపి పరిస్థితులను తమకు అనుకూలంగా
మలచుకోవడానికి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.
ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి అభ్యర్థులు రాయబేరాలు సాగిస్తున్నారు. నగదు, మద్యం పంపిణీ చాపకింద నీరులా సాగిపోతోంది. మలివిడతలో ఏజెన్సీతోపాటు ఉపప్రణాళిక ప్రాంతంలోని 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 38 సమస్యాత్మక ప్రాంతాల్లో 104 పోలింగ్ కేంద్రాలు, 73 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 138, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 330 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
రెండో విడతలో కూడా ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. తొలి దశలో ఓటింగ్ సరళిని బట్టి వైఎస్‌ఆర్‌సీపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రెండో దశలోనూ అత్యధిక స్థానాల కోసం వైఎస్‌ఆర్‌సీపీ వ్యూహాలు చేస్తుంటే, ఇందులోనైనా పరువు దక్కించుకోవడానికి టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా శుక్రవారంతో అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది.