ఇసుక రవాణా బాధ్యత మహిళా సంఘాలదే | Women are responsible for the transport of sand sanghalade | Sakshi
Sakshi News home page

ఇసుక రవాణా బాధ్యత మహిళా సంఘాలదే

Published Sun, Dec 21 2014 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Women are responsible for the transport of sand sanghalade

 శ్రీకాకుళం:  మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ల నుంచి నిర్వాహకులే స్వయంగా వాహనాలను సమకూర్చి వినియోగదారులకు ఇసుక చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్ కృష్ణారావు తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇసుకరీచ్‌ల వద్ద రవాణా శాఖ భాగస్వామ్యంతో నిర్వాహకులు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ వాహనాల ద్వారా వినియోగదారుల గృహాల వద్దకే ఇసుక చేర్చాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగరాదని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఇసుకతో సహా రవాణా చార్జీలను ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంకుల్లో చలానా ద్వారా చెల్లించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమంగా ఇసుక రవాణా జరగరాదని, అందుకు రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కొత్త రీచ్‌లను గుర్తించడంలో జాప్యం చేయరాదన్నారు.
 
 జిల్లాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు తదితర సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జె.వి. రాముడు మాట్లాడుతూ పోలీస్‌శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండి ఇసుక అక్రమ రవాణా జరగకుండానివారించాలన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 40 కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించామని, వాటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. వినియోగదారులకు ప్రభుత్వం నుంచే రవాణా సౌకర్యం కల్పించేందుకు ఇప్పటి వరకు 562 వాహనాలను నమోదు చేశామని, కొద్ది రోజుల్లో అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఎస్‌ఎస్‌ఖాన్, జేసీ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఏజేసీ పి. రజనీకాంతారావు, డీఆర్‌డీఏ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement