ఓటేస్తే.. తోడేశారు! | Sand Mining In Srikakulam | Sakshi
Sakshi News home page

ఓటేస్తే.. తోడేశారు!

Published Thu, Mar 21 2019 10:34 AM | Last Updated on Thu, Mar 21 2019 10:36 AM

Sand Mining In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌:  శ్రీకాకుళం పరిధిలో ఇసుక వ్యాపారం తారస్థాయికి చేరుకుంది. టీడీపీ నాయకుల కనుసైగల్లోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా బట్టేరు, కరజాడ, బైరి, పొన్నాం పరిసర ప్రాంతాల్లో గల టీడీపీ నాయకులతో పాటు జన్మభూమి కమిటీ సభ్యులంతా కలిసి ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే నదీ పరి వాహక ప్రాంతాల్లో ఇసుక పూర్తిగా తవ్వేసి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం చేసేందుకు గాను ఒ క్కో లారీ నుంచి రూ. 15వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.


కొద్ది రోజుల కిందట విశాఖ అవసరాల కోసం పొన్నాం పరిసర ప్రాంతాల్లో మైన్స్‌ అధికారులు అధికారికంగా ఇసుక ర్యాంప్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికిగాను బ్లూఫ్రాగ్‌ సంస్థతో జియోటాగింగ్‌ చేసి లారీలకు అనుసంధానం చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఈ ఇసుక అనుమతుల వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన బడానేతల ప్రమేయం ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేద న్న ఆరోపణలు కుడా వెల్లువెత్తుతున్నాయి. 


దాడులు..
బైరి, కరజాడ పరిసర ప్రాంతంలో అక్రమంగా ఇసుకను డంపింగ్‌ చేస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 11 ఇసుక లారీలను శ్రీకాకుళం శాండ్‌ మొబైల్‌ టీమ్‌ పట్టుకుంది. ఇందులో కేవలం ఎనిమిది లారీలను మాత్రమే రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించి మిగతా మూడు లారీల వద్ద భారీ మోతాదుల్లో కమీషన్‌లు తీసుకుంటూ వదిలేసినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది. 


ఇసుక దోపిడీని అరికట్టాలి
మండలంలో ఇసుక దోపిడీని అరికట్టాలి. జన్మభూమి కమిటీ సభ్యులు ఉచిత ఇసుక పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలి. ఎక్కువగా బట్టేరు, కరజాడ, బైరి, పొన్నాం ప్రాంతంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. 
– మూకళ్ల జయానంద్, శ్రీకాకుళం

 కోర్టుకు వెళ్తా..
ప్రభుత్వం తరఫున భూగర్భ పైపుల పనుల పనుల కోసం ఇసుక కావాలంటూ మూడు నెలల కిం దట అప్పట్లో పనిచేసిన కలెక్టర్‌కు శ్రీకాకుళం రూరల్‌ మండలానికి చెందిన బోర  లక్ష్మీనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. అయితే బ్లూఫ్రాగ్‌ సంస్థ ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు నిరాకరించింది. కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ చేసినందుకు గాను అక్రమంగా ఇసుకను అమ్ముతున్నందుకు గాను ఆయన కోర్డును ఆశ్రయించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement