సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు జిల్లా... టీడీపీ ఆవిర్భావం నుంచీ కంచుకోటగా ఉంది! పది అసెంబ్లీ స్థానాల్లో ఇచ్ఛాపురం మినహా మిగిలిన తొమ్మిది స్థానాల్లో విజయపతాక ఎగురవేసి 2009 ఎన్నికలలో తొలిసారిగా ఆ కోటను బద్దలు కొట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కింది! ఇప్పుడు వైఎస్సార్‌సీపీ శతశాతం విజయాన్ని అందుకునే వాతావరణం కనిపిస్తోంది. జిల్లాలో సైకిల్ స్పీడ్ కన్నా ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా ఉందని, పది స్థానాల్లోనూ గెలుపు సంకేతాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ విస్పష్టంగా చెప్పాయి. ఏదిఏమైనా గత నెల 11వ తేదీన జరిగిన 2019 సాధారణ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,905 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగిన ఈవీఎంలకు సంబంధించి కంట్రోల్ యూనిట్లను తెరచి అభ్యర్థుల భవిష్యత్తును తేల్చేందుకు ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మంగళవారం మాక్ కౌంటింగ్ నిర్వహించారు.
రాష్ట్రంలోనే అత్యధిక శాతం బీసీల జనాభా ఉన్న జిల్లాగా సిక్కోలుకు పేరు. దాదాపు 80 శాతం బడుగు బలహీన వర్గాలే! ఎన్‌టీ రామారావు ప్రభావంతో వారంతా టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. 1995 సంవత్సరంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో టీడీపీని దక్కించుకున్నప్పటికీ బీసీలు చాలావరకూ సైకిల్‌కే సై అన్నారు. కానీ 2003 సంవత్సరం వరకూ సాగిన చంద్రబాబు పాలన తమ ఆకాంక్షలకు అనుగుణంగా సాగకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందారు. అదే సమయంలో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి తమ గోడు విన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టారు.
2004 ఎన్నికలలో జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరింది. టీడీపీ పతనానికి అప్పుడే బీజం పడింది. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పదికి తగ్గింది. అక్కడ 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో టీడీపీ కేవలం ఇచ్ఛాపురం స్థానానికే పరిమితమైంది. అయితే రాష్ట్ర విభజనతో తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మిన ప్రజలు 2014 ఎన్నికలలో జిల్లాలోని ఏడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. కానీ గత ఐదేళ్ల పాలనలో ఆ హామీలు నెరవేర్చకపోగా మరోసారి మోసగించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు సాగలేదు. ఎన్నికలు సమీపించిన ఆఖరి నిమిషంలో పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, ఆదరణ, నిరుద్యోగ భృతి పథకాలతోపాటు పింఛను పెంపు వంటి గిమ్మిక్కులు చేసినా ప్రజలు టీడీపీని నమ్మలేదని పలు ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.
తన తండ్రి వైఎస్‌ఆర్ మాదిరిగానే సుదీర్ఘ పాదయాత్రతో జిల్లాలో గత ఏడాది నవంబరు నెలలో అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమైనప్పుడే 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. వైఎస్సా ర్ సంక్షేమ పథకాల స్ఫూర్తితో జగన్ ప్రకటించిన నవరత్నాలతో పాటు బీసీ డిక్లరేషన్, సామాజిక వర్గాలవారీగా కార్పొరేషన్ల ఏర్పాటు హామీలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. వాటికితోడు ప్రజలు ‘మార్పు’ను బలంగా కోరుకోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా గెలుపు బాటపట్టడానికి మార్గం సుగమమైంది.
ఇచ్ఛాపురం: ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ప్రధానంగా పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి ఈ నాలుగు మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ గాలి కనిపించింది. ప్రధానమైన యాదవ, రెడ్డిక సామాజిక వర్గాలతో పాటు టీడీపీలో అసంతృప్తి వర్గం సాయిరాజ్‌కు అనుకూలంగా పనిచేశాయి. ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
పలాస: ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రముఖ వైద్యుడు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజు పోటీ చేశారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శివాజీ ఈసారి పోటీ నుంచి తప్పుకొని తన వారసురాలైన శిరీషను బరిలో నిలిపారు. అయి తే ఆయన అనుచరుల అవినీతి, స్వలాభాపేక్షతోపాటు అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి దూకుడు ధోరణితో పలాస ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభావంతో టీడీపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. కాశీబుగ్గ పట్టణంతో పాటు పలాస రూరల్, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పోలింగ్ జరిగింది. మత్స్యకారులు కూడా తమ సామాజికవర్గానికి గుర్తింపు ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. దీంతో పలాసలో సీదిరి విజయం సునాయాసమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టెక్కలి: ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఢీకొనేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున పేరాడ తిలక్ బరిలోకి దిగారు. ఇక్కడ బలంగా ఉన్న ఆయన సామాజిక వర్గానికే చెందిన దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎంపీ అభ్యర్థిగా ఉండటం, స్థానికురాలైన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అంతేగాకుండా మంత్రి అవినీతి, అక్రమాలు, టీడీపీ కార్యకర్తల దురుసుతనంతో విసిగిపోయిన టెక్కలి ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
పాతపట్నం: గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచిన కలమట వెంకటరమణ తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన విషయాన్ని ఈ నియోజకవర్గం ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి పట్టం కట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వంశధార నిర్వాసితులకు పరిహారం పంపిణీలో వెల్లువెత్తిన అవినీతి వ్యవహారాలు కూడా టీడీపీ వ్యతిరేక ఓటింగ్‌కు కారణమయ్యాయి.
ఎచ్చెర్ల: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావును వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్‌కుమార్ బలంగా ఢీకొన్నారు. గత ఎన్నికలలో జరిగిన పొరపాట్లు పునరావృతం గాకుండా చూసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించుకోవడం ఆయనకు గెలుపు బాట వేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కళా స్థానికేతరుడు కావడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్థానిక సమస్యలను గాలికొదిలేయడం, టీడీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరడం వంటి కారణాలతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి.
నరసన్నపేట: వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌కు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టు పనుల్లో అవినీతి, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయడం వంటి కారణాలతో బగ్గుకు ఈసారి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీనికితోడు ప్రజలు మరోసారి మార్పును కోరుకోవడంతో సౌమ్యుడైన కృష్ణదాస్ విజయానికి మార్గం సుగమైంది.
శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితోపాటు జనసేన అభ్యర్థిగా కోరాడ సర్వేశ్వరరావు, కాంగ్రెస్ తరఫున చౌదరి సతీష్, బీజేపీ అభ్యర్థిగా చల్లా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. గత ఎన్నికలలో లక్ష్మీదేవిని గెలిపించినా ఐదేళ్లలో అభివృద్ధి ఛాయలు ఏమీ కనిపించకపోవడం, టీడీపీ నాయకులు అవినీతి వ్యవహారాలు పెచ్చుమీరడం తదితర కారణాలతో శ్రీకాకుళం ప్రజలు మరోసారి ధర్మాన నాయకత్వం వైపు మొగ్గుచూపించారు. నియోజకవర్గం అభివృద్ధి ధర్మానకే సాధ్యమనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. శ్రీకాకుళం టౌన్‌లో వైఎస్సార్‌సీపీ బాగా పుంజుకుంది. గార, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో కూడా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయి.
ఆమదాలవలస: మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైఎ స్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్ టీడీపీ తరఫున పోటీచేశారు. ఇసుక మాఫియాకు అండదండలు అందించడంతో పాటు అధికారులపై విరుచుకుపడటం వంటి దూకుడు వైఖరితో కూన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. మరోవైపు సొంత పార్టీలో గ్రూపులను ప్రోత్సహించడంతో నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమదాలవలసనియోజకవర్గ ప్రజలుఈసారి తమ్మినేని నాయ కత్వానికే మొగ్గు చూపించారని పరిశీలకులు భావిస్తున్నారు.
రాజాం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును ఢీకొట్టేందుకు మాజీ మంత్రి కోం డ్రు మురళీమోహన్‌ను కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి మరీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయించినా చంద్రబాబు ఎత్తుగడ ఫలించబోదనే వాదనలు వినిపిస్తున్నాయి. జోగులు మరోసారి విజయం సాధిస్తారని ఓటింగ్ సరళిని బట్టి విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment