వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంబాల జోగులు, టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీ
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): అప్పుడే ఎన్నికల అభ్యర్థుల గుండెల్లో లబ్‌డబ్ వేగం పెరుగుతోంది. గడియారంలో సెకెన్ల ముళ్లు కంటే వేగంగా కొట్టుకుంటోంది. 24 గంటలూ ఫలితాలపైనే రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తున్నాయి. అసలు గెలుస్తామా.. లేదా? అని ఒకటే సందిగ్ధత. భోజనం చేద్దామంటే సహించడం లేదు. కూర్చొన్నచోట నుంచి లేవాలనిపించడంలేదు. ఎవరెవరో వచ్చి చెబుతున్న మాటలు సైతం చెవికెక్కడంలేదు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇలా అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు జరిగి 39 రోజులు గడిచింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటి నుంచి అలుపెరుగకుండా పలు పార్టీల నాయకులు కష్టపడ్డారు. ఎక్కని గడపా....తిరగని ఊరు లేదు. అన్ని పార్టీల నేతలు తమ బలాలను, బలగాలను, కుయొక్తులను ఈ ఎన్నికల్లో బాగా వినియోగించుకున్నారు. చుట్టాలు, బంధువులు, తెలిసినవాళ్లు, మన అనుకున్నవాళ్లు ఇలా ఎవరినీ వదలలేదు. ప్రధానంగా అలక పాన్పుపై ఉన్నవారిని సైతం కాళ్లూవేళ్లూ పట్టుకుని రంగంలోకి దించారు. కొంతమందిని మాటతో లొంగదీసుకుంటే మరికొంత మందిని డబ్బు, మద్యం వంటి వాటిని ఎరగా చూపి ముగ్గులోకి దించారు. ఇంత జరిగినా ఎక్కడో అనుమానపు భూతం. ఒకరిది గెలుపు తాపత్రయం కాగా, మరొకరిది మెజార్టీ తాపత్రయం. ఈ రెండింటి మధ్యనే ప్రస్తుతం రాజాం పోరు కొనసాగుతుంది. చివరకు రాజపీఠం ఎవరిని వరిస్తుందో మూడు రోజులు వరకూ ఓపిక పట్టి ఎదురుచూడాల్సి ఉంది.
ఆ నమ్మకమే.. మెజార్టీ...
ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంబాల జోగులు ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసిన ఓటమి చెందిన తర్వాత అనూహ్యంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచిన ఈయనకు టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు ఎరగా చూపినా ఫిరాయించలేదు. ఈ విలువలే జోగులుకు శ్రీరామరక్షగా నిలిచాయి. జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయి. అంతేకాకుండా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాజాం బహిరంగ సభలో జోగులును కలుపువనంలో తులసిమొక్కగా అభివర్ణించడంతోపాటు ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ పిలుపుతోపాటు జోగులు మంచితనం ఈ దఫా ఎన్నికల్లో బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. గతంలో వంగర, సంతకవిటి మండలాల్లో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ రెండు మండలాల్లో ఈ దఫా టీడీపీ నుంచి భారీగా చేరికలు వచ్చాయి. వీటితోపాటు రాజాం పట్టణంలో ఉద్యోగులు, వ్యాపారులు వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా రేగిడి మండలంలోనూ టీడీపీకి ఎదురీత తప్పలేదు. ఇవన్నీ కంబాల జోగులు గెలుపుకు దోహదపడనున్నాయని, భారీ మెజార్టీ ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమాలో ఉన్నారు.
గెలిస్తే చాలన్నట్టుగా..
ఈ దఫా ఎన్నికల్లో తాము కూడా గెలుస్తామనే ధీమాలో టీడీపీ నేతలు ఉన్నారు. ప్రధానంగా పార్టీ మహిళా సీనియర్ నేత కావలి ప్రతిభాభారతిని తప్పించి ఇక్కడ కోండ్రు మురళీమోహన్‌కు పార్టీ టిక్కెట్టు కేటాయించింది. ప్రతిభాభారతి సీనియర్ నాయకురాలు కావడంతోపాటు పార్టీ కష్టకాల సమయంలో సేవలందించారు. అయితే గ్రూపు వివాదాలు రావడంతో కోండ్రు బాగా చక్కదిద్దగలరని, ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారని ఆశతో స్థానిక నాయకులు పార్టీ టిక్కెట్ కోసం ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కార్యకర్తల ఆలోచనను ప్రణాళికగా రూపొందించుకుని ఎన్నికల బరిలోకి కోండ్రు దిగారు. అయితే ఈయనకు పార్టీ కార్యకర్తల నుంచి కావల్సినంత సాయం అందలేదనే చెప్పాలి.
ప్రధానంగా వంగర, రేగిడి మండలాల్లో భారీగా టీడీపీ ఓట్లు చీలి వైఎస్సార్‌సీపీకి పడ్డాయన్నది పలువురి వాదన. ఇవే కాకుండా రాజాం రూరల్, సంతకవిటి మండలంలో సీనియర్ టీడీపీ క్యాడర్ వైఎస్సార్‌సీపీ బాట పట్టింది. ఈ లోపాలతోపాటు రాజాం పట్టణంలో ఉద్యోగ, కార్మిక వర్గం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో కోండ్రుకు ఆశించినంత ఓటు బ్యాంకు రాలేదు. అయినా గెలుపు తమదేనంటూ కోండ్రు ప్రెస్‌మీట్‌లో ప్రకటించడం ఉత్కంఠను రేపుతోంది. రాజాం పట్టణంలో భారీ మెజార్టీ వచ్చి మిగిలిన మండలాల్లో వైఎస్సార్‌సీపీ మెజార్టీ తగ్గుతుందన్న టీడీపీ కార్యకర్తలు గెలుపుపై స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు. గురువారం ఫలితాలు ఓటరు తీర్పును బయట పెట్టనున్నాయి.
దడ దడ...
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభంజనం ప్రస్తుతం కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజాం నియోజకవర్గం ఏర్పడి రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించగా, ఇప్పుడు మూడో పర్యాయం జరిగింది. రెండు పర్యాయాలు వైఎస్సార్ కుటుంబానికి పట్టం గట్టారు. ఈ దఫా వైఎస్సార్‌సీపీకే శతశాతం మొగ్గు చూపారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. వీటికితోడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, వైఎస్ విజయమ్మ ఎన్నికల బహిరంగ సభలు ఇదే నియోజకవర్గంలో జరిగాయి. ఈ ప్రభావం గెలుపులో కీలకం కావచ్చని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment