విప్ రవికుమార్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకుడు లోలుగు రాజశేఖర్
టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అకారణంగా దాడులకు తెగబడ్డారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో అల్లర్లకు ప్రయత్నించారు. చిన్నచిన్న విషయాలకే వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, నాయకులతో వాగ్వాదానికి దిగారు. పలుచోట్ల రాళ్లదాడికి దిగారు. కోటబొమ్మాళి మండలం చవితిపేటలో ఏకంగా ఈవీఎంలనే ధ్వంసం చేశారు.
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): మండలంలో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లు, కార్యకర్తలు అల్లర్లు సృష్టించారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. బురిడికంచరాంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. డీఎస్పీ ఎల్‌వీ సుధాకర్, ఎస్‌ఐ బాలరాజులు స్పందించి అల్లరిమూకలను చెదరగొట్టారు. దళ్లిపేటలో ఫ్యాన్ గుర్తుకు ఓటింగ్ మద్దతు పెరిగిపోవడంతో ఓటింగ్‌ను సక్రమంగా జరగనీయకుండా గొడవకు దిగారు. హెచ్‌సీ రామకృష్ణ, సాయుధ బలగాలు పరిస్థితిని చక్కదిద్దారు. పెనుబర్తిలో ఓటింగ్ విధానంలో పీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఏజెంటు తమ్మినేని మురళీకృష్ణ ఆరోపించారు. మాజీ సర్పంచ్ కూన సుధ పోలింగ్ కేంద్రానికి వచ్చి టీడీపీకి ఓటెయ్యాలని చెప్పడంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ వ్యతిరేకించారు. రిగ్గింగ్ జరిపేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు. పొందూరులో పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజలను ఓటింగ్ విషయంలో ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించగా పోలీసులు హెచ్చరించి నిలువరించారు. ఒకానొక దశలో లాఠీలకు పనిచెప్పారు. గారపేటలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడితే ధీటుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు బుద్ధిచెప్పారు.
విప్‌ను అడ్డగించిన సొంత పార్టీ నేతలు..
ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు సొంత పార్టీ నాయకులే చుక్కలు చూపించారు. లోలుగులో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రవికుమార్‌కు టీడీపీ జెడ్‌పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములునాయుడు తమ్ముడు లోలుగు రాజశేఖర్‌తో పాటు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డీఎస్పీ ఎల్‌వీ సుధాకర్ రంగంలోకి దిగి ఇరువర్గాలను పంపించేశారు. పొందూరులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన విప్‌ను వైఎస్సార్‌సీపీ నాయకుడు మున్న అడ్డుకున్నారు.
పలాసలో ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద గురువారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలాస పీఎస్ నంబర్ 84 వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, వైఎస్సార్‌సీపీ నేత ఒడిశి హరిప్రసాద్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు, యువకులు రావడాన్ని ప్రశ్నించడంతో ఈ తగాదా చోటుచేసుకుంది. ఒకానొక సమయంలో శిరీష కోపోద్రుక్తురాలై హరిప్రసాద్‌ను ‘ఛీ..పో.. ’అంటూ దుర్భాషలాడారు. ఈ తరుణంలో డీఎస్పీ బర్ల ప్రసాదరావు, సీఐ చంద్రశేఖర్, సిబ్బంది వచ్చి ఇరువర్గాలను అదుపుచేశారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేసి ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
చల్లవానిపేటలో కొట్లాట
జలుమూరు: మండలంలోని చల్లవానిపేట పోలింగ్ కేంద్రం వద్ద కొట్లాట జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కలగ నవీన్, రవి తదితరులు తనపై అకారణంగా దాడిచేసి ముఖం,కంటిపై గాయపరిచినట్లు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పొన్నాడ రవీంద్ర జలుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ జలుమూరు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి బాధితుడ్ని పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.
చవితిపేటలో ఈవీఎంల ధ్వంసం
కోటబొమ్మాళి: టెక్కలి నియోజకవర్గం పరిధిలోని కోటబొమ్మాళి మండలం చిట్టేవలస పంచాయతీ చవితిపేట 316 పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభంలోనే ఘర్షణ తలెత్తింది. వివిధ రాజకీయ పార్టీల తరఫున ఏజెంట్లుగా ఉన్నవారి మధ్య మాటామాటా పెరిగి చివరకు ఈవీఎంలు బద్దలు గొట్టారు. వెంటనే పీఓ ఉపేంద్ర పోలింగ్ నిలుపుదల చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, ఏఎస్‌పీ పనసారెడ్డి చవితిపేట పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆరాతీశారు. ఏఆర్‌ఓ కె.ఆదిమహేశ్వరరావుతో మాట్లాడి కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రక్రియ జరిపించాలని పీఓను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన సంపతిరావు వెంకటరమణ, సంపతిరావు అనిల్‌కుమార్, కూన సింహాచలం, కూన గోవిందరావు, మామిడి కృష్ణారావు, సంపతిరావు కనకమ్మ, కూన అప్పన్న, కూన కృష్ణారావు, యండ అప్పారావులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.లక్ష్మణ్ తెలిపారు.
నేరడి–బి పోలింగ్ కేంద్రం వద్ద కొట్లాట
భామిని: మండలంలోని నేరడి–బి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య కొట్లాట జరిగింది. దీంతో కొంతసేపు పోలింగ్ నిలిపివేశారు. లివిరి, బిల్లుమడ, కొరమలలోనూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చిన్నదిమిలిలో దళితులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. బత్తిలి పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీసరలో వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు జరిగాయి. బుధవారం రాత్రి బాలేరు–సొలికిరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో జరిగిన కొట్లాటలో 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు బత్తిలి ఎస్సై ముకుందరావు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేతల నిర్బంధం
భామిని మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, బత్తిలి మాజీ సర్పంచ్ టింగ అన్నాజీరావు, భామిని మాజీ సర్పంచ్ ప్రతినిధి పొట్నూరు నాగేశ్వరరావులను నిర్బంధించి పోలీస్ స్టేషన్‌లో ఉంచే ప్రయత్నం చేశారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, మండల పార్టీ అధ్యక్షుడు తోట సింహాచలం జోక్యంతో పోలీస్‌లు వెనక్కితగ్గి అన్నాజీరావు, నాగేశ్వరరావులను విడిచిపెట్టారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
ఆమదాలవలస/ ఆమదాలవలస రూరల్: మండలంలోని కణుగులవలస గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సీపాన ఆనందపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు తనతో పాటు కుటుంబసభ్యులను ప్రలోభపెట్టారని, అందుకు నిరాకరించడంతో కక్ష కట్టారని, ఓటు వేసేందుకు వెళుతున్న సమయంలో నూక సుదర్శనరావు, నూక అప్పలసూరన్నాయుడు అలియాస్ రాజు, నూక కిరణ్‌కుమార్, నూక శ్రీరామ్మూర్తిలు కలిసి దాడి చేసినట్లు బాధితుడు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద ప్రస్తుతం స్థానిక 30 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కరకవలస, రావిచెంద్రిలో తోపులాట
ఎల్.ఎన్.పేట/మందస: మండలంలోని కరకవలస, రావిచెంద్రి గ్రామాల్లో స్వల్ప తోపులాటలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తుండటంతో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు పోలింగ్ సిబ్బందితో వేయించాలని, ఒకే వ్యక్తి పదేపదే వారిని తీసుకుని రావడంతో రెండు వర్గాల మధ్య వాదనలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మందస మండలంలోని బీఎస్‌పురంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో ఇరువర్గాలకు చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment