శ్రీకాకుళం జిల్లా బుచ్చిపేట వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో 5 రోజులుగా అక్రమ ఇసుక తవ్వకాలు
ఇసుక ర్యాంప్‌పై దాడి చేసిన సెబ్ అధికారులు
మొత్తం 14 లారీలు సీజ్
నరసన్నపేట: అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకులు మొదలుపెట్టిన ఇసుక దందా గుట్టు బట్టబయలైంది. అర్ధరాత్రి వేళ వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తుండగా సెబ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. మడపాం, కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు బుచ్చిపేట వద్ద వంశధార నదిలో అక్రమంగా ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు.
లోడింగ్ పేరుతో ఒక్కో లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి దోచుకుంటున్నారు. ముందుగా ఇసుక లారీలను పగలంతా సమీపంలోని టోల్‌గేట్ వద్ద ఉంచుతున్నారు. చీకటి పడగానే లారీలకు ప్రత్యేక రశీదులిచ్చి నదిలోకి పంపిస్తున్నారు. అడుగడునా టీడీపీ కార్యకర్తల ద్వారా నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు ఆ మార్గంలోకి వచ్చినా వెంటనే ఆ సమాచారం నదిలో ఉన్న వారికి వెళ్లిపోతోంది. వారు వెంటనే అప్రమత్తమై లారీలను సమీపంలోని జీడి తోటల్లోకి తరలిస్తున్నారు.
ఈ విషయం తెలియడంతో సెబ్ అధికారులు బుధవారం రాత్రి బుచ్చిపేటకు వచ్చి మాటు వేశారు. నదిలో 20కి పైగా లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తుండగా.. సెబ్ అధికారులు దాడి చేశారు. మొత్తం 14 లారీలు దొరకగా.. మిగిలిన లారీలు సమీప జీడి తోటల్లోకి వెళ్లి తప్పించుకున్నాయి. ఈ దోపిడీపై సీఐ సతీశ్ కుమార్, ఎస్‌ఐ కావ్య కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన లారీలను నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.
కాగా, ఇసుక దందాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల స్వార్థం వల్ల ఊరంతా ఇబ్బంది పడుతోందని స్థానికులు చెప్పారు. ఇసుక దందాలను అడ్డుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment