బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం
- పూర్తిగా మాఫీ చేయకుంటే మా ఉసురు తగులుతుంది
- గట్టులో మహిళల రాస్తారోకో
బి.కొత్తకోట: ‘‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా.. ఎన్నికల ప్రచారంలో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు రూ.లక్ష మాత్రమేనని మోసం చేస్తారా.. చంద్రబాబు రాజీనామా చేస్తే అప్పుడు మేం రుణాలు చెల్లిస్తాం.’’ అంటూ మహిళా సంఘాల సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని, ఏం చేస్తారో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలవారీ సమావేశాల్లో భాగం గా సీసీ హనుమంతప్ప శనివారం బి.కొత్తకోట మం డలం గట్టు గ్రామంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు.
తొలుత అజెండా అంశాలు, కొత్త గ్రామ సమాఖ్యల ఎన్నిక తదితర అంశాలపై చర్చించారు. సమావేశం చివరిలో సంఘాలన్నీ రుణాలు చెల్లించాలని సీసీ కోరారు. ప్రభుత్వం ఒక్కో సంఘానికి రూ.లక్ష జమ చేస్తుందని, ఆ సొమ్ము 4 నెలులుగా చెల్లించని బకాయిలకు సరిపోతుందని, మిగిలిన రుణాలను వడ్డీతో కలిపి చెల్లించాలన్నారు. దీంతో అక్కడున్న 400 మంది మహిళలు రగిలిపోయారు.
సీసీని నిలదీశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేసారని, ఇప్పుడు డబ్బులు కట్టమంటే ఎలా అని ప్రశ్నించారు. పైసా కూడా చెల్లించే ది లేదన్నారు. ప్రతినెలా రుణాలు చెల్లిస్తున్నామని, 4 నెలలుగా చెల్లించకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. మా ఓట్లతో గెలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమనండి.. అప్పు డు రుణాలు చెల్లిస్తామంటూ తేల్చిచెప్పారు.
మాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందని శాపనార్దాలు పెట్టారు. దీంతో సీసీ, సమావేశ నిర్వాహకులు సమావేశాన్ని ముగించారు. సీసీ సరైన సమాధానం చెప్పకపోవడంతో మహిళలు గట్టు వైఎస్‌ఆర్ విగ్రహం ఎదుట రహదారిపై రాస్తారోకో చేసారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆందోళనను విరమించారు.
డీఫాల్టర్ చేస్తారా
ప్రతినెలా రుణాలు చెల్లించే తమను డీఫాల్టర్లుగా చూడటం అన్యాయం. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామంటేనే చెల్లించలేదు. ఇప్పుడు రుణాలు కట్టమంటే అది మోసం చేయడం కాదా. మా ఓట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదని చెప్పమనండి. లక్ష మాఫీ చేస్తే సంఘాలకు ఒరిగేదేమీలేదు.
- ఎస్.మల్లిక, గట్టు
ముందు రాజీనామా చేయండి
మహిళల ఓట్లతో గెలిచన చంద్రబాబు రుణాలను పూర్తిగా మాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆయన గద్దె దిగితే మా రుణాలు చెల్లించేస్తాం. ఎందుకంటే మా ఓట్లతో గెలిచిన ఆయన రుణాలు మాఫీ చేస్తారని ఆశించాం. ఇప్పుడు కాదంటే మళ్లీ ఎవరికైనా ఓట్లేసి గెలిపించుకుంటాం.
- సాలమ్మ, గట్టు
ఇంతకంటే మోసమా
మహిళలకు చంద్రబాబు చేసిన మోసం ఇంతకన్నా లేదు. లక్ష మాఫీని గొప్పగా చెప్పుకొంటున్నారు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి, ఎంత మందికి ఉంటుందో చెప్పాలి. మహిళలను అన్యాయంగా చూస్తున్నారు. రుణాలను మేం చెల్లించం. చంద్రబాబు ఏం చేస్తారో చూస్తాం.
- డీ.లక్ష్మీదేవి, గట్టు