* ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదు: వైఎస్ జగన్
సొంతమామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం కొత్తేంకాదు. ఇంతవరకు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ చాలా హామీలిస్తున్నారు. చంద్రబాబు హామీలను చూసి చాలామంది నన్నుకూడా హామీలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. కానీ నేను బాబులా అబద్ధాలు ఆడలేను. అన్యాయమైన రాజకీయాలు చేయలేను. ఆయన వయసు 65 ఏళ్లు. ఆయనకివే చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. నేను ఆయనకంటే పాతికేళ్లు చిన్నవాడిని. విశ్వసనీయత అనే పదానికి నేను ఆయనలా పాతర వేయలేను. మహానేత వైఎస్ నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేదైనా ఉంది అంటే అది విశ్వసనీయతే. మాట కోసం ఎందాకైనా వెళతా.
- వైఎస్ జగన్
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదని, ఆయన ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని, కొత్తగా ఆల్ ఫ్రీ అంటూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా అంటున్నారు. కానీ బాబు ఈ మాట అంటుంటే ఇంతకన్నా అన్యాయం లేదనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే ఒకపక్క అన్యాయం అని అంటూనే, ఇంకోపక్క రాష్ట్రాన్ని విడగొట్టడానికి పార్లమెంట్‌లో ఎంపీలతో ఓట్లు వేయించారు. ఒకవైపు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి, ఇంకోవైపు విభజనలో భాగస్వాములయ్యారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామంటున్నారు.
బాబు తీరు ఎలా ఉందంటే ఒక వ్యక్తిని తానే చంపి తిరిగి చనిపోయిన వ్యక్తికి నేనే దండవేస్తానని పరిగెత్తినట్టుంది. ఒకమనిషిని చంపి దండ వేయడమనేది ఆయనకు కొత్తేం కాదు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయన ఫొటో బయటకు తీసి దానికి దండేస్తుంటారు’’ అని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తునిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం విశాఖ జిల్లా నర్సీపట్నంలో సభలో పాల్గొన్నారు. సభకు హాజరైన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనకాపల్లి లోక్‌సభకు పార్టీ అభ్యర్థిగా గుడివాడ అమర్‌నాథ్, నర్శీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేశ్ పోటీ చేస్తారని ప్రకటించారు. సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
పట్టపగలే మోసం చేస్తున్నారు..
ఇవాళ రైతులకు రుణమాఫీ అంటున్నారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దుచేస్తామంటున్నారు. ఉచితంగా సెల్‌ఫోన్లు, టీవీలు.. ఇలా అన్నీ ఆల్‌ఫ్రీ అంటున్నారు. ఇవాళ నేను ఒకటి చెబుతున్నా.. రైతులకు రుణ మాఫీ చేయాలంటే రూ.1.27 లక్షల కోట్లు అవసరం. డ్వాక్రా రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు కావాలి. ఈ రెండు కలిపితే రూ.1.47 లక్షల కోట్లు. కానీ ఇవాళ బడ్జెట్లో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు. కానీ బడ్జెట్‌ను మించిపోయి రూ.1.47 లక్షల కోట్ల రుణాలను బాబు ఎలా మాఫీ చేస్తారు? 2008లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.65 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది. వీటిని 28 రాష్ట్రాలకు పంచితే మన రాష్ట్రానికి వచ్చేసరికి రూ.12వేల కోట్లు మాఫీ అయింది. మనకంటే పదిరెట్లు ఎక్కువ ఆదాయం ఉన్న కేంద్రప్రభుత్వమే రాష్ట్రానికి రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తే చంద్రబాబు ఏకంగా అధికారంలోకి వస్తే రూ.1.47 లక్షల కోట్లు మాఫీ చేస్తారని పట్టపగలు మోసం చేస్తున్నారు.
ఐదేళ్లలో అన్ని కోట్ల ఉద్యోగాలెలా ఇస్తారు?
ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడతారు. ఆయనలో ఏ మార్పులేదు. నోటికి ఏ హామీ వస్తే అది గుడ్డిగా ఇచ్చేస్తారు. ఆయన ప్రజలను ఎంతగా వంచన చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో బాబు ఇంకో హామీ ఇచ్చారు. ఇంటింటికీఉద్యోగం ఇస్తానంటున్నారు. ఇవాళ చంద్రబాబును అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అలాంటప్పుడు ఇంటికొక ఉద్యోగం ఎలా ఇస్తారు? 60ఏళ్ల స్వాతంత్య్రంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 20లక్షల ఉద్యోగాలిస్తే ఐదేళ్లలో 3 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలకు ఉద్యోగాలెలా ఇస్తారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉండగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి 21వేల మంది ఉద్యోగులను బజారులో నిలబెట్టారు.
ఏడాదికి 10 లక్షల ఇళ్లు నిర్మిస్తా..
నేను ముఖ్యమంత్రి అయ్యాక అయిదు సంతకాలు చేస్తా. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయి. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతాను. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తా. విద్యావంతులను చేస్తా. అంతేకాదు.. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీషుమీడియం పెట్టిస్తా. రెండోసంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తా. మూడో సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. నాలుగో సంతకంగా.. అక్కా చెల్లెళ్లకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలను కిందామీదాపడి ఏదోలా మాఫీచేస్తాను. రేషన్ కార్డుల కోసం సామాన్య ప్రజలు కాళ్లరిగేలా తిరగనక్కర్లేకుండా మీ గ్రామం, మీ వార్డులోనే ఆఫీసు తెరుస్తా. 24 గంటల్లో ఏ కార్డు అయినా సరే ఇచ్చేందుకు ఐదో సంతకం చేస్తాను. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తా. అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తా.
ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
ఈరోజు రాష్ట్రంలో వ్యాధులకు ఆపరేషన్ చేయించుకోవాలంటే హైదరాబాద్ తప్ప వేరే దిక్కులేని పరిస్థితి. ఈ పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తా. హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని అభివృద్ధి చేస్తా. అక్కడే 17 నుంచి 20వరకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం. ఆ తర్వాత సంతకం విద్యుత్ సమస్యలు తీర్చడానికి చేస్తా. 2019నాటికి రాష్ట్రంలో కరెంటు కోతలే లేకుండా చేస్తా. పగలు ఏడు గంటలు కచ్చితంగా వ్యవసాయానికి విద్యుత్ అందిస్తా. అధికారంలోకి వచ్చాక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ తీర్చిదిద్దుతాం. ఇందులో అనేక కంపెనీలు ఏర్పాటుచేస్తాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా చేస్తాను. నాలుగేళ్లుగా ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడ్డా. నా పిల్లాడిగా మీ పిల్లల అభివృద్ధికి కష్టపడతా.’’
తూర్పులో.. 9 రోజులు 375 కిలోమీటర్లు..
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మునిసిపాలిటీలు, మూడు నగరపంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ నెల 17 నుంచి మంగళవారం వరకు 9 రోజుల్లో సుమారు 375 కిలోమీటర్ల మేర పర్యటించారు. రోడ్ షో నిర్వహిస్తూ వాడవాడలా ప్రజలను కలిశారు.
బాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్ జగన్
Published Wed, Mar 26 2014 1:33 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement