- రుణమాఫీపై చంద్రబాబు రోజుకోమాట
- బ్యాంకు నోటీసులతో రైతుల ఆందోళన
- కొత్త రుణాలివ్వకపోతే ఖరీఫ్ పెట్టుబడులెలా
- ఉద్యమ బాటలో రైతు, డ్వాక్రా సంఘాలు
చోడవరం: ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’... అన్నట్టుంది తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి. ఎన్నికల ముందు అధికారం కోసం అమలు కాని హామీలు ప్రకటించింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ బకాయిలు చెల్లించవద్దని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు.
అప్పును సజావుగా చెల్లించే రైతులు ఏడాదిగా రుణాలు చెల్లించడం మానేశారు. డ్వాక్రా సభ్యులు రుణవాయిదాల చెల్లింపును నిలిపివేశారు. తీరా అధికారంలోకి వచ్చాక టీడీపీ రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతోంది. రైతులు, డ్వాక్రా మహిళల్లో అయోమయం నెలకొంది. కాలయాపన చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉద్యమాలతో నిరసన గళం వినిపిస్తున్నారు.
బ్యాంకు ఒత్తిడి చేస్తోంది
వ్యవసాయ పెట్టుబడుల కోసం తుమ్మపాల యూనియన్ బ్యాం క్‌లో రూ.లక్ష రుణం తెచ్చాను. పంట సరిగ్గా పండక చాలా ఇబ్బందులు పడ్డాను. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమీ మాట్లాడటం లేదు. అప్పు తీర్చమని బ్యాంక్ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు.
- గొంప దేముడునాయుడు, రామచంద్రపురం, కె.కోటపాడు
చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి
చంద్రబాబు మాటలు విని అప్పు చెల్లించలేదు. నాకు ఎకరన్నర పొలం ఉంది. వరి, చెరకు పంటలు వేస్తున్నాను. వ్యవసాయ పెట్టుబడుల కోసం తుమ్మపాల యూని యన్ బ్యాంక్‌లో రూ.50 వేల రుణం తీసుకున్నాను. అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసిచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
- కిల్లి సోమినాయుడు, సింగన్నదొరపాలెం, కె.కోటపాడు
వ్యవసాయం కష్టంగా ఉంది
వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారింది. రెండేళ్లుగా కరువు వస్తుండటంతో పెట్టుబడులు రావడం లేదు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏమీ చెప్పడం లేదు. హామీ మేరకు అన్ని వ్యవసాయ రుణాలు మాఫీచేయాలి.
- పెదిరెడ్ల మల్లునాయుడు, కొండపాలెం, బుచ్చెయ్యపేట
మాఫీ చేయకపోతే ఆందోళన చేస్తాం
వ్యవసాయ పెట్టుబడుల కోసం గత ఏడాది బుచ్చెయ్యపేట ఐఓబి బ్యాంక్‌లో బంగారంపై రూ.20 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే ఆందోళన దిగుతాం.
- గరికి అర్జున, పెదమదీన, బుచ్చెయ్యపేట
మాఫీ చేస్తారని రుణం చెల్లించలేదు
రెండేళ్ల కిందట మా డ్వాక్రా సంఘం తరపున రూ.3 లక్షలు బుచ్చెయ్యపేట ఐఓబి బ్యాంక్‌లో డ్వాక్రా రుణం తీసుకున్నాం. చంద్రబాబు హామీతో మూడు నెలలుగా అప్పు వాయిదాలు కట్టడం మానేశాం.
- కోనపల్లి రాజు, డ్వాక్రాగ్రూపు అధ్యక్షురాలు, కొండపాలెం, బుచ్చెయ్యపేట
రుణం ఎలా తీర్చాలో తెలియడం లేదు
తెలుగుతల్లి డ్వాక్రా సంఘం పేరున 2013 డిసెంబరులో యూనియన్ బ్యాంక్‌లో రూ.3 లక్షల రుణం తీసుకున్నాం. వాయిదాలు చెల్లించాలని బ్యాంక్ ఒత్తిడి తెస్తోంది.
- వంటాకు సుశీల, డ్వాక్రా మహిళ, లక్కవరం
బ్యాంకు నోటీసులిచ్చింది
నాకు ఎకరన్నర భూమి ఉంది. గత ఏడాది జన్నవరం సహకార బ్యాంక్‌లో రూ.20 వేలు, విజయరామరాజుపేట గ్రామీణ బ్యాంకులో రూ.20 వేలు రుణం తీసుకున్నాను. అప్పు తీర్చమని గ్రామీణ బ్యాంక్ నోటీసు ఇచ్చింది.
- మంగ అప్పలనాయుడు, గౌరీపట్నం, చోడవరం
ఖరీఫ్ పెట్టుబడికి డబ్బుల్లేవు
వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం నాన్చడం వల్ల చా లా ఇబ్బంది పడుతున్నాం. ఏడాది కిందట లక్కవరం సహకార బ్యాంక్‌లో రూ.50 వేల రుణం తీసుకున్నాం. ఖరీఫ్ పెట్టుబడులకు డబ్బుల్లేవు. వెంటనే మాఫీ చే యాలి.
- జెర్రిపోతుల అప్పారావు, లక్కవరం, చోడవరం