రూ.1,050 కోట్లతో స్త్రీ ‘నిధి’
- ఆమోదం తెలిపిన స్త్రీనిధి బ్యాంకు పాలకమండలి
- బినామీ రుణాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం
- జీవనోపాధి ప్రాజెక్టులకు అధికంగా రుణాలివ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణ రుణాల కింద రూ.1,050 కోట్లు అందించాలని స్త్రీనిధి బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళిక (క్రెడిట్ ప్లాన్)కు బ్యాంకు పాలకమండలి ఆమోదం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో క్రెడిట్ ప్లాన్ అమలుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రుణ ప్రణాళికలో రూ.950 కోట్లు సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు, రూ.100 కోట్లు మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు రుణాలుగా అందించాలని నిర్ణయించారు.
జీవనోపాధికి అధిక ప్రాధాన్యం..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు తక్షణ అవసరాల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా రుణం పొందే వీలుంది. ఒక్కో మహిళా సంఘం రూ.25 వేల వరకు రుణం పొందవచ్చు. జీవనోపాధి కోసం రూ.25 వేలకుపైగా రుణాలను అందిస్తారు. గ్రామ సమాఖ్యల పనితీరును బట్టి రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించారు. పనితీరు బాగున్న సమాఖ్యలకు రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఒక్కో సంఘం రుణం పొందేందుకు ఆరుగురు మహిళలకు మాత్రమే ఉన్న పరిమితిని తాజాగా తొమ్మిది మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్
క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహాలు, సూచనలను స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతేడాది రుణ ప్రణాళిక రూ.753 కోట్లలో రూ.705 కోట్లు రుణాలుగా అందించామని, 99 శాతం రికవరీ కూడా జరిగిందని స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాలకమండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 1.62 లక్షల సంఘాలకు చెందిన 7.71 లక్షల మంది మహిళలకు రుణాలను అందించామని వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి, మెప్మా డెరైక్టర్ జనార్ధ్దన్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల, జిల్లా సమాఖ్యల డెరైక్టర్లు పాల్గొన్నారు.
రుణ మంజూరులో బయోమెట్రిక్
బినామీలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ద్వారా మహిళలకు రుణాల మంజూరు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 50 మండలాల్లో బయోమెట్రిక్ బేస్డ్ లెండింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లోని 2,784 గ్రామాల్లో ‘వన్ స్టాప్ షాప్’లను స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో ఒకేచోట అన్ని రకాల (ఈ సేవ, మీ సేవల్లో లభించే సేవలు, ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తులు, ఫిర్యాదులు, ఉపాధి వేతన చెల్లిం పులు) సేవలు అందించడమే వన్ స్టాప్ షాప్ ఉద్దేశం.