సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 వార్షిక సంవత్సర రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లతో రూపుదిద్దుకుంది. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణ మంజూరులో వేగం పెంచి లబ్ధిదారుల రుణ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని కోరారు.
రూ.350.64 కోట్ల పెరుగుదల
రుణ మంజూరులో బ్యాంకర్లు ఈ ఏడాది భారీ ప్రణాళికనే తయారు చేశారు. గతేడాది రూ.4,558.95 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించగా.. తాజాగా ఈ ప్రణాళిక రూ.4,909.59 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రూ.350.64 కోట్లు అదనంగా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కీలకమైన పంటరుణాల కింద రూ.730 కోట్లు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించారు. లింకేజీ రుణాల కింద రూ.281.51 కోట్లు, వ్యవసాయ యాంత్రికీకరణకు రూ.111.20 కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు.
పాడిపరిశ్రమకు రూ.130.75 కోట్లు, పౌల్ట్రీ రంగానికి రూ.116.45 కోట్లు, గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.50.06 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి గాను రూ.791.25 కోట్లు నిర్దేశించారు. ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, వార్షిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను సాధిస్తామని బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ డీజీఎం శేషసాయి, ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు, ఆర్బీఐ ఎల్‌డీఓ వెంకటేష్, ఎస్‌బీహెచ్ అగ్రీ డీజీఎం అనూరాధ, ఎల్‌డీఎం సుబ్రమణ్యం, డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లు
Published Thu, Apr 16 2015 12:36 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement