సాక్షి, హైదరాబాద్: మొండి బకాయిల జాబితాలోకి చేరటంతో ఆర్టీసీ ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆదాయం బాగా క్షీణించిపోవటం, నష్టాలు తీవ్రం కావటం, ఇతరత్రా ఆదాయం నామమాత్రమే కావటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి బ్యాంకులు వెనకాడుతున్నాయి. దీంతో ఆ సంస్థకు రుణం ఇచ్చేందుకు జంకుతున్నాయి. ఫలితంగా నిధులు లేక ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఏ విధమైన చెల్లింపులు జరపలేక అంతా గందరగోళంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి అద్దం పడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులు, నష్టాలతో సతమతమవుతున్న తరుణంలో కోవిడ్ మహమ్మారి ఆర్టీసీని పూర్తిగా కుంగదీసింది.
జీతాల చెల్లింపు, డీజిల్ బిల్లులు, మృతిచెందిన ఉద్యోగులకు బెనిఫిట్స్, ఆర్టీసీ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు, సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, అద్దె బస్సుల యజమానుల బిల్లుల చెల్లింపు.. ఇలా అన్నీ పెండింగులో పడిపోయాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లోంచి సాయం చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులు రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం రూ.వేయి కోట్లకు పూచీకత్తు (గ్యారంటీ) ఇస్తూ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సిందిగా సూచించింది. దానికి ఓ ప్రధాన బ్యాంకు స్పందించింది. అయితే, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.180 కోట్లు బకాయిగా ఉండటంతో ఎన్‌పీఏగా ముద్రపడిందని, ఆ మొత్తం చెల్లిస్తే రుణం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సాయంతో దాన్ని తీర్చేసి మళ్లీ రుణం కోసం వెళ్లింది. రీజినల్ స్థాయి బోర్డు సమావేశంలో బ్యాంకు దీనికి ఓకే చేసింది. కానీ కేంద్ర స్థాయిలో బోర్డు మోకాలొడ్డింది.
అసలే ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున ఒకేసారి ఏకంగా రూ.వెయ్యి కోట్ల రుణం ఇవ్వటం సరికాదని ఆ ప్రతిపాదనను తిరస్కరించి కేవలం రూ.500 కోట్లకు ఓకే చెప్పింది. అయితే ఈ రుణం ఇప్పుడు ఆర్టీసీ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం ఆర్టీసీ అవసరాలకు రూ.2 వేల కోట్లు కావాలి. కనీసం రూ.వెయ్యి కోట్లు అందినా సగం సమస్య తీరేది. ప్రభుత్వ పూచీకత్తులో మిగిలిన రూ.500 కోట్ల కోసం ఇప్పుడు అధికారులు ఇతర బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. వారికి నిరాశే ఎదురవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment