సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులు రాష్ట్రంలో చాలామందికి అందడం లేదు. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు రైతులు తీసుకోకుండా వారి ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నాయన్న మాట.
రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం కోసం ఎంతో ఆతురతతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు, వడ్డీలకు సంబంధించి కానీ, రుణాల రెన్యువల్‌కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సర్కారు సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి 57,60,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.5,294 కోట్లు పంపిణీ చేశారు.
ఇందులో 10 శాతం వరకు అంటే రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు ఈ విధంగా ‘హోల్డ్’చేయడం లేదా రుణాల కింద జమ చేసుకోవడం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్‌లో ఇలాగే వ్యవహరించిన బ్యాంకులపై అప్పట్లో ప్రభుత్వం సీరియస్ అయినా, తీరు మార్చుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటంలేదన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి.
రూ.5,294 కోట్లు పంపిణీ
పంటల సాగు సీజన్‌లో పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బందులు పడే రైతుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లకు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద నిర్ణీత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.52 కోట్లకు పైగా ఎకరాలకు గాను రూ.7,645 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 60,16,697 మంది రైతులకు రూ.6008.27 కోట్లు పంపిణీ చేశారు. అయితే తమ వద్ద రుణం తీసుకొని చెల్లించని రైతులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.
ఆర్‌బీఐ చట్టం ప్రకారం రికవరీ చేయాల్సిందే: బ్యాంకు వర్గాలు
రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి డబ్బులు తిరిగి రికవరీ చేయడం తాము సొంతగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారమే ఇది జరుగుతుందని బ్యాంకర్లు వివరిస్తున్నారు. తాము ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని, కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్‌లో బ్యాంకులో ఎవరైనా ఖాతాదారుని రుణం పెండింగ్‌లో ఉంటే.. అకౌంట్‌లో ఏవైనా డబ్బులు జమ అయితే అవి అప్పు కింద జమ అవుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు నిధులను రైతు రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకుల్లో ఎక్కువగా చిన్న బ్యాంకులే ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నడిచే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవని బ్యాంకర్లు చెపుతుండగా, వడ్ల కొనుగోలు కింద ప్రభుత్వం జమ చేసిన నిధులను కూడా అంతకుముందు తీసుకున్న అప్పుల కింద కొన్ని బ్యాంకులు బిగపడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు.
బ్యాంకులకు గతంలోనే చెప్పాం: వ్యవసాయ శాఖ వర్గాలు
రైతుబంధు నిధులను బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడం సరైంది కాదని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. ఆర్‌బీఐ నిబంధనలు ఏవైనా ఉండొచ్చు కానీ రైతులకు ప్రభుత్వం సాయం చేయడంలోని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని వారు చెబుతున్నారు. రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకునే పక్షంలో, ప్రభుత్వం సాయం చేసినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చి, వాటిని గత రుణాల కింద జమ చేసుకోవాలని, కొత్త రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బ్యాంకులకు చెప్పామని, లేఖలు సైతం రాశామని తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే 2019–20లో బ్యాంకర్లు జమ చేసుకున్న రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
'మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ పంచాంగల్ తండాకు చెందిన లావుడ్యా నాయక్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట రుణం కింద గతంలో గండేడ్ ఎస్‌బీహెచ్‌లో రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం అందరి రైతుల మాదిరిగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి రైతుబంధు డబ్బులు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు అప్పు కింద అట్టే పెట్టుకున్నారు. వారం క్రితం వరకు ఆయన బ్యాంకు ఖాతాను ‘హోల్డ్’లో (లావాదేవీల నిలిపివేత) పెట్టలేదు. కానీ రైతుబంధు పడుతోందని తెలియగానే హోల్డ్‌లో పెట్టేశారని నాయక్ తెలిపాడు. డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకు వెళ్తే పంట రుణం బాకీ చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారని' వాపోయాడు
Comments
Please login to add a commentAdd a comment