మహిళా సంఘాల నెత్తిన ఇసుక
►విపరిణామాలకు దారి తీయనున్న సర్కారు నిర్ణయం
►ఇసుక ర్యాంపులు డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు
►మాఫియా ఉచ్చులో మహిళలు చిక్కుకునే ప్రమాదం
►రాజకీయ జోక్యాన్నీ అరికట్టలేని పరిస్థితి
►ఫలితంగా ప్రశ్నార్థకం కానున్న సంఘాల ఉనికి
►ఇప్పటికే రుణమాఫీ చిక్కులతో విలవిల
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొదుపు చేసి.. రుణాలు పొంది.. చిన్నచిన్న వ్యాపార, ఉపాధి యూనిట్లు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాల నెత్తిన సర్కారు నిర్ణయం ఇసుక కుమ్మరించేలా ఉంది. కలిసికట్టుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు ఇసుక క్వారీలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుండటం తెలిసిందే. అయితే దీనివల్ల తలెత్తే పరిణామాల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఇసుక క్వారీల నిర్వహణ అంటేనే.. మాఫియాలు, రాజకీయ హస్తం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఇంకెన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నా వీటి జోక్యానికి అడ్డుకట్ట వేయడం సాధ్యంకాదన్నది సుస్పష్టం. గత అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇప్పుడు ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగిస్తే వాటిపైనా ఇసుక మాఫియా పెత్తనం పెరుగుతుంది. రాజకీయ జోక్యం అనివార్యమవుతుంది.
అదే జరిగితే ఇంతవరకు ప్రశాంతంగా గ్రూపులను, వ్యాపారాలను నిర్వహించుకుంటున్న మహిళా సంఘాలు వివాదాల ఉచ్చులో చిక్కుకుని బలహీనపడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీ నిర్వహణ లాభసాటి వ్యాపారం కావడంతో దీన్ని వదులుకొనేందుకు మాఫియా గ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడవు.
ఏదో ఒక విధంగా సంఘాల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా ఈ సంఘాల పేరుతో బినామీలు పట్టుకొస్తారు. అనైక్యత పెరుగుతుంది. దీనివల్ల సహకార స్ఫూర్తి దెబ్బతిని సంఘాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం విసిరిన రుణమాఫి వలలో చిక్కుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘాల సభ్యులు ఇసుక దందాలతోమరింత అవస్థలపాలవుతారు.
18 రీచ్‌ల గుర్తింపు
గతంలో జిల్లాలో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో 24 ఇసుక ర్యాంపులు ఉండేవి. క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. గత కొన్నాళ్లు అధికారిక ర్యాంపులు లేకపోయినా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. తాజాగా మహిళా సంఘాలకు వీటిని అప్పగించి తవ్వకాలు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో 18 ర్యాంపులను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
వీటిని సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ, మౌలిక సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. నదులు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో ఫిబ్రవరి నెల ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.