ర్యాంపులకొస్తా.. సంగతి తేలుస్తా | Ryampulakosta's telusta .. | Sakshi
Sakshi News home page

ర్యాంపులకొస్తా.. సంగతి తేలుస్తా

Published Sat, Feb 28 2015 12:57 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

Ryampulakosta's telusta ..

ఏలూరు (టూటౌన్) : ‘ఇసుక ర్యాంపుల్లో తనిఖీ లకు వస్తా. అక్రమాలు బయటపడితే కేసులు పెట్టిస్తా. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుం టా’నని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. జిల్లాలో ఇసుక విక్రయాల తీరుపై డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, ఇందిరాక్రాంతిపథం ఏపీఎంలతో కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక తవ్వకం, విక్రయాల్లో అక్రమాల నిరోధానికి చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా వారంలో రెండు ర్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాంపుల్లో అక్రమాలకు తావు లేకుండా ఎలక్ట్రానిక్ వే బిల్లులను రూపొందించామని చెప్పారు.

కొంతమంది బయట వ్యక్తులతో కుమ్మక్కై ఇసుక రీచ్‌లలో అక్రమ తవ్వకాలు, అమ్మకాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిం దన్నారు. 3 క్యూబిక్ మీటర్ల ఇసుక కోసం వేబిల్లు తీసుకువచ్చిన వారికి 5 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇస్తున్నారని, కొన్నిచోట్ల వేబిల్లు లేకపోయినా వాహనాల్లో ఇసుక తరలించేందుకు సహకరి స్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ర్యాంపుల్లోకి బయటి వ్యక్తులు వస్తుం టే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిం చారు. కొంతమంది ఏపీఎంలు, సీసీలు ఉద్యోగ ధర్మాన్ని వదిలి బయ ట వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారు. ‘మీకు ఆత్మాభిమానం లేదా.. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మీది కాదా.. స్వలాభం కోసం ఇతరుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఎందుకు మారుతున్నారు’ అని ప్రశ్నించారు.

పలుచోట్ల ఉదయం 10 గంటల సమయంలో ఇసుక వాహనాన్ని పట్టుకుని వే బిల్లు అడిగితే,  11.30 గంటలకు చూపించారని, గంటన్నర తరువాత వేబిల్లు పొందినట్టు నిరూపణ అయ్యిందని కలెక్టర్ పేర్కొన్నారు. దీనినిబట్టి ఆ వాహనంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు స్పష్టమైందన్నారు. ఇసుక రీచ్‌లలో మహిళలను ఎవరూ బెదిరించకుండా ప్రత్యేకంగా గన్‌మెన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. బయటి వ్యక్తులు ఇసుక రీచ్‌లలో ప్రవేశించినా బెదిరింపులకు పాల్పడినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్యాంప్రసాద్, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, డీటీసీ సీహెచ్ శ్రీదేవి పాల్గొన్నారు.
 
6 ర్యాంపులు తెరిచేందుకు ప్రతిపాదనలు
జిల్లాలో కొత్తగా ఆరు ర్యాంపులను తెరిచి ఇసుక విక్రయాలు జరిపేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని ఇసుక వాహనాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి రావాల్సి ఉన్నందున, ఆ రాష్ట్రం నుంచి తగిన అనుమతులు పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు.

కొవ్వూరు మండలం చిడిపి, కుకునూరు మండలంలోని వింజరం, దాచవరం, ఇబ్రహీంపట్నం, వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రకోట గ్రామాల్లోని ఇసుక రీచ్‌లలో 5 మీటర్ల ఎత్తున ఇసుక నిల్వలు  ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ వివరించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి డిపోల వద్ద సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి విజయరాయి ఇసుక ర్యాంపు నుంచి నిర్ధేశించిన వాహనాల్లోనే ఇసుక రవాణా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement